లోకేశ్ ప్రసంగానికి ముగ్ధులైన ఎన్‌ఆర్‌ఐలు
- టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్
హైదరాబాద్: తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో చేసిన ప్రసంగానికి ప్రవాస భారతీయులు ముగ్ధులయ్యారని ఆ పార్టీ మీడిమా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్కార్కే ప్రసాద్ తెలిపారు. లోకేశ్ ఆలోచనలను, దూరదృష్టిని మెచ్చి వారు 780 గ్రామాలు దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించారని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
అలాగే మరో 220 గ్రామాలను దత్తత తీసుకునేందుకూ వారు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘ప్రపంచాన్ని అమెరికా శాసిస్తోంటే.. ఆ దేశాన్ని మాత్రం అక్కడ స్థిరపడిన తెలుగువారు శాసిస్తున్నారు.’ అని ఎడిసన్ హోటల్‌లో జరిగిన సమావేశంలో లోకేశ్ వ్యాఖ్యానించారని తెలిపారు. ఏపీలో ఎన్‌ఆర్‌ఐ భవన నిర్మాణానికి బ్రహ్మాజీ వలివేటి రూ.60 లక్షల విరాళాన్ని ప్రకటించారన్నారు. ‘తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని మాట్లాడుతూ.. తానా 100 గ్రామాలను దత్తత తీసుకుంటుందని వెల్లడించారు. సమావేశంలో మోహనకృష్ణ మన్నవ, జె.తాళ్లూరి ప్రసంగించారు.’ అని ప్రసాద్ వివరించారు.