రబీకి నీరివ్వకుంటే ఎలా?
Published Wed, Jan 29 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
కాలువల మరమ్మతులు గురించి పట్టించుకోరు.. రబీలో వరికి నీరు ఇవ్వబోమని ఇప్పుడు చెబితే ఎలా.. ఇప్పటికే చాలా మంది రైతులు నారుపోసుకొని నాట్లు వేసుకుంటున్నారు.. సాగునీరు అందించని వారు వ్యవసాయశాఖ విత్తనాలు పంపిణీ చేస్తుంటే ఎందుకుఊరుకున్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు...కొందరు రైతుల వద్ద డబ్బులు తీసుకొని దొంగతూములు ఏర్పాటు చేస్తుంటే ఆయా అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోరు...ఇవి నాగార్జున సాగర్ లింగంగుంట్ల సర్కిల్ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల ఆగ్రహావేశాలు.
నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్: ఎన్‌ఎస్‌పీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ‘వాలంతరి’(నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధిశాఖ క్షేత్రస్థాయి శిక్షణా సంస్థ) ఆధ్వర్యంలో నీటి పన్ను అంచనా, వసూలు, పంటల దిగుబడిపై నీటి పారుదల, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. వాలంతరి అధికారి శంకర్‌బాబు అధ్యక్షత వహించగా, ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ సన్యాసినాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాగునీటి వినియోగంపై రైతులందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జూన్, జూలైలో నాట్లు వేసుకుంటే ఖరీఫ్ అనంతరం రబీలో వరిసాగుకు ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పంట కాలువలకు మరమ్మతులు జరిగితేనే నీరు సక్రమంగా అందుతుందన్నారు. అనంతరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ) చైర్మన్లు ఒక్కొక్కరుగా ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత అనుపాలెం డీసీ చైర్మన్ బాలసైదులు మాట్లాడుతూ రబీలో వరిసాగు వద్దని చెబుతున్నారు, వ్యవసాయశాఖ వరి వంగడాలను ఎందుకు పంపిణీ చేసినట్టు అని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ ఏడీఏ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ డిసెంబర్ 10 నుంచి విత్తనాల పంపిణీ నిలిపివేశామని, అలాగే బహిరంగ మార్కెట్‌లో వరివంగడాలు అమ్మవద్దని దుకాణదారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. దీనిపై డీసీ సభ్యులు మాట్లాడుతూ మార్చి 31 వరకు సాగునీరు విడుదల చేయాలని, లేకుంటే రైతులు ఇబ్బందులు పడతారని కోరారు. ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ మాట్లాడుతూ అది అధికారుల చేతుల్లో లేదని, ఒకసారి నీటి విడుదల తగ్గించిన తరువాత పెంపు నిర్ణయం ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. త్రిపురాపురం మేజరు డీసీ చైర్మన్ గంగినేని చంద్రశేఖర రావు మాట్లాడుతూ సొంత నిధులతో రెండేళ్ళ క్రితం రూ.4 లక్షలు వెచ్చించి కాలువల్లో పూడికతీత పనులు నిర్వహిస్తే ఇంతవరకు బిల్లులు రాలేదన్నారు. ఐనవోలు డీసీ చైర్మన్ చంద్రయ్య మాట్లాడుతూ కాలువల మరమ్మతులకు తాను వెచ్చించిన నగదును మార్చి 31లోగా ఇవ్వకుంటే నిరాహారదీక్ష చేస్తానని,
అదీ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎస్‌ఈ ఆవేశపడినందు వల్ల ప్రయోజనం ఉండదని, పరిస్థితులు గమనించాలన్నారు. అమరావతి మేజరు డీసీ చైర్మన్ యర్రగుంట్ల రమేష్ మాట్లాడుతూ మేజరు పరిధిలోని కెమైనర్ హెడ్ వద్ద కొందరు దొంగతూములు ఏర్పాటు చేసుకున్నారని, దీనికి డీఈ భరోసా ఇచ్చారని, అసలు తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్‌ఎస్‌పీ అధికారులు ఇలా వ్యవహరించడ భావ్యం కాదంటూ ఆరోపించారు. దీనిపై ఎస్‌ఈ మాట్లాడుతూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. తుర్లపాడు మేజరు డీసీ చైర్మన్ ఉడతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓగేరు, కుప్పగంజివాగుల పరిధిలోని కాలువలకు నీరు విడుదల చేస్తే ఎత్తిపోతల పథకాల వల్ల రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఎస్‌ఈ సమాధానం ఇస్తూ ఉన్నతాధికారుల అనుమతితో నీరు విడుదల చేస్తామన్నారు. సమావేశంలో వినుకొండ ఈఈ శ్రీనివాసరావు, నరసరావుపేట సర్కిల్ డీఈ రమణరావు, మాచర్ల ఈఈ బి.చిట్టిబాబు సత్తెనపల్లి ఈఈ నాగార్జున, వాలంతరి అధికారులు, డీసీ చైర్మన్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement