ఎన్టీపీసీలో యువకుడి దారుణహత్య | NTPC young man's brutal murder | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీలో యువకుడి దారుణహత్య

Published Fri, Dec 20 2013 3:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

NTPC young man's brutal murder

గోదావరిఖని, న్యూస్‌లైన్: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ వీక్లీ మార్కెట్ సమీపంలో ఇప్ప చక్రధర్ (22) దారుణహత్యకు గురయ్యాడు. అతిగా మద్యం తాగించి చున్నీతో ఉరిబిగించి... అనంతరం గొంతు కోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆటోనగర్‌కు చెందిన ఇప్ప పెంటయ్య, కనకమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు... కుమారుడు చక్రధర్ ఉన్నారు. పెంటయ్య సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ మూడేళ్ల క్రితం మృతిచెందాడు. అతడి ఉద్యోగం చక్రధర్‌కు రెండేళ్ల క్రితం వచ్చింది. అప్పటినుంచి బెల్లంపల్లిలోని శాంతిగనిలో బదిలీఫిల్లర్ కార్మికుడిగా పనిచేస్తూ.. మందమర్రిలో క్వార్టర్‌లో ఉన్నాడు. నెలరోజులుగా సొంతింటి నుంచే రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లిన చక్రధర్ పొద్దుపోయినా చేరలేదు. దీంతో తల్లి, సోదరి తెలిసిన చోటల్లా వాకబు చేశారు.
 
 గురువారం వేకువజామున వీక్లీ మార్కెట్ కోసం నిర్మించిన ప్రహరీ అవతల దారుణహత్యకు గురై కనిపించాడు. గొంతుభాగం, చాతీ ఎడమవైపు, నుదురుభాగంలో కత్తిపోట్లు ఉన్నాయి. హత్య విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి తరలివచ్చారు. డీఎస్సీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రామగుండం సీఐ నారాయణ హత్య జరిగిన తీరును పరిశీలించారు. కరీంనగర్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను రప్పించి వివరాలు సేకరించారు. హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తి సమీపంలోని కాలువలో లభ్యమైంది. ‘ఒక్కగానొక్క కొడుకు పోయిండు.. ఇగ మాకు దిక్కెవ్వరు..’ అంటూ తల్లి కనకమ్మ రోధనలు మిన్నంటాయి.
 
 ప్రేమ వ్యవహారమే కారణమా..?
 చక్రధర్‌కు గోదావరిఖనిలోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటామంటూ ఏడాది క్రితం ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆమె మైనర్ కావడంతో ఆమె తండ్రి ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు కింద చక్రధర్ కొద్ది రోజులు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే తరచూ బాలిక నుంచి ఫోన్లు వచ్చేవని మృతుడి తల్లి కనుకమ్మ పేర్కొంది. మందమర్రి నుంచి ఇంటికొచ్చాక చాలాసార్లు ఫోన్లు చేసేదని పోలీసులకు వివరించింది. అమ్మాయి తరఫు వారే తన కుమారుడిని పొట్టనబెట్టుకున్నారని రోధించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement