తిరుపతికి చెందిన రామకృష్ణారెడ్డి ఐదు నెలల క్రితం ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశాడు. నంబర్ ప్లేట్ కోసం రోజూ తిరుపతి రవాణాశాఖ కార్యాలయం సమీపంలోని నంబర్ ప్లేట్ విక్రయ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు. ఫలితం లేదు. కొనుగోలు చేసిన వాహనంపై వెళ్తుండగా శుక్రవారం తనిఖీ అధికారులు ఆపారు. నంబర్ ప్లేట్ లేదని అపరాధ రుసుం వసూలు చేశారు. తాను చేయని తప్పునకు శిక్ష అనుభవించాడు.
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వాహనదారుల జేబులకు చిల్లుపడుతోంది. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసి న వారికి సకాలంలో నంబర్ ప్లేట్లు అందడం లేదు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి పరిధిలో ఆరు నెలలుగా వేలాది మంది వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. నెలలు గడుస్తున్నా నంబ ర్ ప్లేట్లు అందలేదు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రవాణాశాఖ డిజిటలైజేషన్ పేరుతో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు శ్రీకారం చుట్టి న విషయం తెలిసిందే. ఈ ప్లేట్ల తయారీ ప్రక్రియను రవాణాశాఖ ‘లింక్ ఆటో టెక్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ’ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించింది. కాంట్రాక్ట్ తీసుకున్న మొదట్లో నంబర్ ప్లేట్లు సకాలంలోనే అందేవి. కొంత కాలంగా తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసినవారంలోపు నంబర్‌ప్లేట్స్ అందజేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా 10వేలకుపైగా వాహనాలకు ఆరునెలలుగా నంబర్‌ప్లేట్స్ అందలేదు. ఏపీ03 సీయూ సీరీస్‌లోనైతే మరీ దారుణంగా ఈ జాప్యం కనబడుతోంది. ఒక్క తిరుపతి పరిధిలోనే ఇప్పటివరకు 6వేల వాహనాలకు నెలలు గడుస్తున్నా నంబర్‌ప్లేట్స్ సరఫరా చేయకపోవడం గమనార్హం.
అడుగడుగునా తనిఖీలతో జేబులకు చిల్లు..
కొత్త వాహనాల కొనుగోలుదారులు అధికారుల తనిఖీలతో బెంబేలెత్తుతున్నారు. రోజు నంబర్‌ప్లేట్ విక్రయకేంద్రం వద్దకు వచ్చి తమ వాహనాల నంబర్‌ప్లేట్స్‌పై ఆరా తీస్తున్నారు. విక్రయ కేంద్రంలోని సిబ్బందికి సైతం జాప్యంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇటు వాహనదారులు... అటు రవాణా శాఖ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆర్టీఓ ఆఫీసులోని హెల్ప్ డెస్క్‌ను ఆశ్రయిస్తున్నారు. కంపెనీ జిల్లా ఇన్‌చార్జికి సైతం ఫిర్యాదు చేసినా సరైన సమాధానం ఇవ్వకపోవటంతో వాహనదారులు మండిపడుతున్నారు. నంబర్‌ప్లేట్లలో వచ్చిన తప్పులు.. వాటిని అందజేయడంలో జరుగుతున్న జాప్యంపై ఎదురవుతున్న సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌కాని, టోల్‌ఫ్రీ నంబర్‌కాని అందుబాటులో లేవు. దీనిపై సాక్షి ఆరాతీయగా ఆన్‌లైన్‌లో డేటా జాప్యంతో ఈ సమస్య ఏర్పడిందని, ప్రస్తుతం నంబర్ ప్లేట్ తయారీ చురుకుగా కొనసాగుతోందని సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment