
లడ్డూ కపుల్...
మైలవరం : ఏమిటీ ఈ చిత్రం విచిత్రంగా ఉంది కదూ.. భారీ స్థూలకాయులను పెళ్లి దుస్తుల్లో చూసి ఆశ్చర్యపోతున్నారా... ఇదేదో ఫేస్‌బుక్ ఫన్ పిక్ అనుకుంటే పొరపాటే... మైలవరంలో గురువారం ఈ భారీ స్థూలకాయులిద్దరూ ఒకటయ్యారు. ఈ అపూర్వ, అరుదైన కల్యాణాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి నూతన జంటపై ఆశీస్సుల అక్షింతలు కురిపించారు. అబ్బాయి బాగోలేదనో... అమ్మాయి లావుగా ఉందనో చిన్నచిన్న కారణాలతో పెళ్లిల్లు రద్దు చేసుకుంటున్న ఈ రోజుల్లో 125 కేజీల బరువున్న యువతికి 130 కేజీల బరువు ఉన్న యువకుడితో జరిగిన ఈ పెళ్లి పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మైలవరం సుగాలి తండాకు చెందిన సబావతు రామారావు కుమార్తె నాగమణి(20)కి ఎ.కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన బాణావతు నాని(22)తో పొందుగల రోడ్డులోని బెరియన్ ఫెలోషిప్ చర్చిలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజల సమక్షంలో కల్యాణం జరిగింది. వివాహం చేసుకోవడానికి మంచి మనసు ఉంటే చాలు.. రూపం ప్రధానం కాదని నిరూపించింది ఈ జంట. చిన్నతనంలో వెన్నులోకి నీరు వెళ్లడంతో ఊబకాయం వచ్చిందని భారీ కాయంవల్ల ఎటువంటి ఇబ్బందులు పడలేదని అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నానని నాని తెలిపారు. పెద్దలు కుదిర్చిన వివాహమని ఇద్దరం ఒకరికి ఒకరం అన్యోన్యంగా కలిసిమెలసి ఉంటామంటున్న లడ్డూబాబు జంటకు ‘విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ చెప్పేద్దామా...!