అధికార పార్టీ పింఛన్ల పరిశీలన కమిటీ తీరు అభయహస్తం లబ్ధిదారులకు భస్మాసుర హస్తంగా మారింది.
పలమనేరు: అధికార పార్టీ పింఛన్ల పరిశీలన కమిటీ తీరు అభయహస్తం లబ్ధిదారులకు భస్మాసుర హస్తంగా మారింది. కమిటీ పరిధిలో లేని ఈ పథకంలోనూ రాజకీయం ప్రదర్శించారు. ఒక సంతకంతో అన్ని పింఛన్లనూ రద్దు చేసేశారు. జన్మభూమి గ్రామసభల్లో అధికారులను మహిళలు నిలదీస్తుండడంతో పొరపాటు జరిగిందని తిరిగి ఆ పింఛన్లు ఇస్తామంటూ మభ్యపెట్టేందుకు నానా యాతన పడుతున్నారు.
ఇదిగో సాక్ష్యం
పలమనేరు పురపాలకసంఘ పరిధి లో 151 మందికి వైఎస్‌ఆర్ అభయహస్తం ద్వారా ప్రతినెలా రూ.500 పింఛన్ ఇచ్చేవారు. డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలు బీమా చేసుకుని, 60 ఏళ్లు నిండాక అభయహస్తం పింఛన్ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా గ్రూ పుల నిర్వహణలో సభ్యుల డబ్బుతో జరిగే కార్యక్రమం. ఇదేమీ పట్టించుకోని పింఛన్ల పరిశీలన కమిటీ సభ్యు లు మున్సిపాలిటీలోని అభయహస్తం లబ్ధిదారులందరినీ జాబితా నుంచి తొలగించేశారు. ఈ పథకం ద్వారా పలమనేరులో 151 మంది రూ. 3,650 ప్రీమియంగా చెల్లించారు. వీరి కి అప్పటి ప్రభుత్వం అంతే మొత్తం జమ చేసింది. దీంతో వీరు ప్రతి నెలా రూ.500 పింఛన్ తీసుకుంటున్నారు.
ఇప్పుడేం జరిగిందంటే
అభయహస్తం పింఛన్లపై అవగాహన లేని ఈ కమిటీ సభ్యులు ఏకపక్షంగా లబ్ధిదారులకు 65 ఏళ్లు నిండలేదనే సాకుతో జాబితా నుంచి తొలగించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1,600 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆయా ప్రదేశాల్లో కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. మండలాల్లో దాదాపు 9 వేల మంది అభయహస్తం పింఛన్‌దార్లలో ఏడు వేల మందిని తొలగించినట్టు సమాచారం.
పొరపాటు జరిగిందంటున్న అధికారులు
అభయహస్తం పింఛన్ల జోలికి వెళ్లొద్ద ని సాక్షాత్తు సీఎం ఆదేశించినా కమిటీ సభ్యులు ఏకపక్షంగా వ్యవహరించా రు. వైఎస్‌ఆర్ అభయహస్తం పథకం లో ఎంపికైన వారంతా వైఎస్‌ఆర్‌సీపీ కి చెందిన వారని తొలగించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలమనేరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావ్‌ను వివరణ కోరగా మాకు కూడా తెలియకుం డానే జాబితాలో అభయహస్తం పింఛన్లన్నీ తొలగించారన్నారు. ఈ విషయమై డీఆర్‌డీఏ పీడీతో సంప్రదించామని తెలిపారు. వారందరికీ తిరిగి పింఛన్లు వచ్చేలా చూస్తామన్నారు.