సాక్షి కడప/వైవీయూ: ఏన్నో ఏళ్ల తర్వాత రాకరాక వచ్చిన అవకాశం.. అదృష్టం పరీక్షించుకుందామని వ్యయప్రయాసలకు ఓర్చి దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు అధికారుల తీరు నిరాశకు గురిచేస్తోంది. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించనట్లుగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నిబంధనలు స్పష్టంగా ఇచ్చినా జిల్లాస్థాయిలో మాత్రం సరికొత్త నిబంధనలతో అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫేస్టోలో డీఎస్సీ విడుదల చేస్తామంటూ ఆరు నెలల పాటు కాలయాపన చేసిన తర్వాత నేడు.. రేపు అంటూ ఇన్నాళ్లకు ప్రకటన చేశారు. అన్ని జిల్లాల కంటే తక్కువ పోస్టులు వైఎస్‌ఆర్ జిల్లాకు కేటాయించారు. నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా ఉన్న ఈ జిల్లాలో పోస్టులు తక్కువ కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దాని ప్రతికాపీలను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంది. దీనికి తోడు దరఖాస్తుల స్వీకరణ రెండ్రోజులు ఆలస్యంగా ప్రారంభమైన విషయం విధితమే.
సంతకం పేరుతో సతాయింపు...
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రతికాపీపై స్వీయ సంతకం (సెల్ఫ్ అటెస్టెడ్) చేసి డీఈఓ కార్యాలయంలో అందించాలని నిబంధన ఉంది. అయితే డీఈఓ కార్యాలయ సిబ్బంది మాత్రం స్వీయ సంతకంతో పాటు గెజిటెడ్ అధికారి సంతకం ఉంటేనే దరఖాస్తులు తీసుకుంటామంటూ తిర స్కరిస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ అధికారులు లేనిపోని నిబంధనల వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. డీఎస్సీ టోల్‌ఫ్రీ నెంబర్‌లో సైతం కేవలం సెల్ఫ్ అటెస్టెడ్ చాలు అని పేర్కొన్నారని పలువురు అభ్యర్థులు విన్నవించినా వినే నాథుడే లేకపోవడం గమనార్హం. దీంతో అభ్యర్థులు గెజిటెడ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
‘ఓపన్’ అభ్యర్థులకూ తప్పని పాట్లు..
జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేని డిగ్రీతో పాటు బీఈడీ అర్హత కలిగిన వారు అర్హులు. అయితే సార్వత్రిక విద్యావిధానంలో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థుల విషయంలో మాత్రం అధికారులు వింతపోకడలు అవలంభిస్తున్నారు. ఓపన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసి బీఈడీ పూర్తి అరుున అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా స్థానిక అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దరఖాస్తులను స్వీకరించేలా ఆదేశాలిస్తా..
ఓపన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించేలా సిబ్బందికి ఆదేశాలు జారీచేస్తాం. కోర్టు పని నిమిత్తం హైదరాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నాను. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తీసుకుంటాం. శనివారం నుంచి దరఖాస్తులను స్వీకరించేలా సిబ్బందిని ఆదేశిస్తాం.
- బి. ప్రతాప్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, కడప
ఇదేమి చోద్యం
Published Sat, Dec 13 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement