మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాలోని విజయవాడ కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు కసరత్తు ప్రారంభించారు.
మున్సిపల్, సాధారణ ఎన్నికల నిబంధనలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులతో మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని విజయవాడ కార్పొరేషన్‌తో పాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మున్సిపాలిటీలు, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు నగర పంచాయతీల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల తొలగింపు...
సోమవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తెస్తూ ఆయా మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన ఫ్లెక్సీలు, ప్రచార హోర్డింగ్‌లను తొలగించారు. ఎన్నికల నిబంధనల అమలు, నామినేషన్‌ల స్వీకరణ, పరిశీలన, ప్రచారం తదితర ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తును కూడా కోరారు.
రంగంలోకి నిఘా బృందాలు..
ఈ నెల 10 నుంచి నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో టౌన్ ప్లానింగ్, పోలీస్, ఎలక్షన్ కమిషన్‌కు చెందిన వారితో నిఘా బృందాలను రంగంలోకి దించనున్నారు. వీరు ప్రత్యేకంగా ఆయా మున్సిపాలిటీల్లో తిరుగుతూ ప్రచార హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, డోర్ పోస్టర్లు, జెండాలు తొలగించిందీ లేనిదీ పరిశీలిస్తారు. ఇంకా తొలగించని వాటిని ఆయా అభ్యర్థుల ఖర్చుల్లో రాస్తారు. ఇలాంటివన్నీ కలిపితే పరిమితికి మించిన ఖర్చు అయ్యి అభ్యర్థి గెలిచినా అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఉంది. 30న ఎన్నికలు పూర్తయ్యేవరకు నిఘా బృందాలు అభ్యర్థులు, పార్టీలను నీడలా వెంటాడుతూనే ఉంటాయి.