
భర్త మందలించాడని..
మనస్తాపంతో భార్య ఆత్మహత్య
గాజువాక : భర్త మందలించాడని మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి కణితి రోడ్డు కైలాసనగర్‌లో చోటుచేసుకుంది. గాజువాక పోలీసుల కథనం ప్రకారం.. గాజువాకలో టపాసుల తయారీ సంస్థ నిర్వహిస్తున్న కొర్రేటి శ్రీమన్నారాయణ కైలాసనగర్‌లో భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. అతడి భార్య కె.భాగ్యలక్ష్మి కనకదుర్గ(33) చాలా కాలంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ మందులు వాడుతోంది.
ఇది చాలా ఇబ్బందిగా ఉందంటూ తన తండ్రికి, కుటుంబ సభ్యులకు చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాను ఉన్నా లేకపోయినా పిల్లలను బాగా చూసుకోవాలని భర్తకు చెప్పింది. ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని పిల్లలకు కూడా చెప్పింది. పిల్లల ముందు అలా మాట్లావద్దని ఆమెను భర్త మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం అర్ధరాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరిపోసుకొంది. దీనిపై ఆమె తండ్రి దవ్వ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఈశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.