హెలెన్ పెను తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. కృష్ణాజిల్లాలో 80 వేల మందిపై తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే హెలెన్ తుఫాన్ సహాయక చర్యల కోసం నిధుల విషయంలో అధికారులకు అన్ని అధికారాలు ఇచ్చినట్లు మంత్రి రఘువీరా రెడ్డి వెల్లడించారు.
అయితే హెలెన్ తుఫాన్ కారణంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు వెల్లడించారు. అలాగే జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెలెన్ తుపాన్ వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైన వెంటనే 08672- 252572, 08672- 251077 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. తీర ప్రాంతంలోని ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అలాగే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.