అధికారులు బృందాల వారీగా జిల్లాకు వచ్చారు. లెక్కలమీద లెక్కలు కట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా పలుమండలాల్లో రూ.650కోట్ల భారీ నష్టం అన్నదాతలకు వాటిల్లినట్లు తేల్చారు. ఇప్పుడు కరువు మండలాల ప్రకటనలో సర్కార్ అదేదీ పరిగణనలోనికి తీసుకున్నట్లు లేదు. మొక్కుబడిగా మూడు మండలాల్లో దుర్బరస్థితి నెలకొందని ప్రకటించి చేతులు దులుపుకుంది. రైతుల గుండెమంటను అర్థంచేసుకోవడంలో విఫలమైంది. నేతలు దాన్ని ఎలుగెత్తిచాటడంలో సత్తాచాటుకోలేక పోయారు.
పాలమూరు, న్యూస్‌లైన్ : జిల్లాపై సర్కారు శీతకన్ను వేసింది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు అనుకూలించక జిల్లాలోని వేల ఎకరాల పంటను దెబ్బతీశాయి. దీంతో సాగు చేసిన పంట చేతికందక అన్నదాతలు దారుణంగా దెబ్బతిన్నారు. ఈ నేపథ్యంలో సర్కారు సాయంకోసం ఎదురు చూపులు చూస్తుంటే వారికి మొండిచేయే మిగిలింది.
జిల్లాలోని 64 మండలాలకు గాను 48 మండలాలకు పైగా అతివృష్టి కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిహారం అందజేసేందుకు పరిశీలనలు, బృందాల పర్యటనలు చేపట్టినప్పటికీ.. జిల్లాకు గోరంత సాయమే అందింది. శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిన మేరకు జిల్లాలోని కొడంగల్, ఉప్పునుంతల, కేశంపేట మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో జిల్లాలోని రైతుల ఆశలపై నీళ్లు చ ల్లినట్లయింది.
నష్టం భారీగా ఉందని తేల్చినా...
గత సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాల కారణంగా.. జిల్లాలో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రత్యేక బృందాల పరిశీలన చేపట్టి జిల్లా వ్యాప్తంగా 48 మండలాల్లో దాదాపు 800 గ్రామాల పరిధిలో ఆయా పంటలు 1.90 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారికంగా గుర్తించారు. వారి లెక్కల ప్రకారం రైతులు రూ.650 కోట్లమేర నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 744604 హెక్టార్లలో (18,66,510 ఎకరాల్లో) ఆయా పంటలను సాగు చేపట్టగా అధిక వర్షాల కారణంగా 70,617 హెక్టార్ల మేర (1.90 లక్షల ఎకరాల్లో) వివిధ పంటలు నష్టపోయినట్లు నిర్ధారించారు. పంటసాగుకైన ఖర్చు, దిగుబడి నష్టాన్ని లెక్కిస్తే రూ.650 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. అధికారుల పరిశీలన మేరకు దెబ్బతిన్న పంటల్లో వరి 5147.62 హెక్టార్లు, మొక్కజొన్న 1172.2, జొన్న 213.1, ఆముదం 6.68, పొద్దుతిరుగుడు 2.4, కందులు 6.23, పెసర 21.08 హెక్టార్లమేర దెబ్బతినడంతో రూ.150 కోట్లమేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో పత్తిపంట సాగు సాధారణంగా 3,11,323 ఎకరాల్లో చేపట్టాల్సి ఉండగా అంతకు మించి 4,60,725 ఎకరాల్లో సాగయింది. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
గత మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా పత్తిరైతులు ఏటా ఏదోరూపంలో పంట నష్టపోవాల్సి వస్తోంది. ఇలా అన్నదాతలను వాతావరణ పరిస్థితులు నష్టాల బాట పట్టిస్తుండగా ఆదుకోవాల్సిన పాలకులు మాత్రం పట్టించుకోక పోవడం విమర్శలకు ఆస్కారమిస్తోంది. గతేడాది జిల్లాలోని 60 మండలాలను కరువు ప్రాంతాలుగా నిర్ణయించగా.. ఈ సారి కేవలం 3 మండలాలను మాత్రమే ఎంపిక చేయడం పట్ల అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా ఈసారి ఖరీఫ్ సీజన్‌లో ఆయా బృందాలు పర్యటించి మద్దూరు, చిన్నచింతకుంట, దేవరకద్ర, ధన్వాడ, నర్వ, ఆత్మకూర్, మాగనూరు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అలంపూర్, మానోపాడు, మల్దకల్, గట్టు, ధరూర్, అయిజ, గద్వాల మండలాల్లో ఏమాత్రం పంట నష్టం కలుగలేదని నిర్ధారించారు. అధికారులు నిర్ణయించిన ఈ మండలాలు కాకుండా మిగతా వాటిని కరువు ప్రాంతాలుగా ఎంపిక చేస్తారని జిల్లా వాసులు భావించినప్పటికీ సర్కారు నిర్ణయం కరువు జిల్లాకు సంకటస్థితిని తెచ్చిపెట్టింది.
గోస పట్టలే...!
Published Sat, Jan 4 2014 3:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement