
వృద్ధుడు వెంకట్రమణ
పెద్దతిప్పసముద్రం: అధికారుల అలసత్వం కారణంగా వృద్ధాప్య పింఛన్‌కు అర్హుడైన ఓ పండు ముసలాయనకు చుక్కెదురవుతోంది. వివరాలు..మండలంలోని బూర్లపల్లి పంచాయతీ చల్లావాండ్లపల్లికి చెందిన చల్లా వెంకట్రమణ (72)కు సెంటు భూమి కూడా లేదు. వృద్ధాప్య పింఛన్ కోసం గతంలోనే అర్జీల ద్వారా అధికారులకు మొరపెట్టుకున్నాడు. ఇతని పేరున ఉన్న రేషన్ కార్డు డబ్ల్యూఏపీ 100400600143 ఆధారంగా ఐడి నంబర్ 110312580 ద్వారా ఆయనకు 2007లోనే పింఛన్ మంజూరైంది.
అయితే ఇంత వరకు ఈయనకు నయా పైసా అందుకోలేదు. ఈ విషయంపై బాధితుడు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే ఆయన పేరుతో ఉన్న రేషన్‌కార్డు ఆదారంతో ఇదే గ్రామానికి చెందిన నచ్చు వెంకటలక్ష్మి అనే మహిళ పింఛన్ సొమ్ము అందుకుంటోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆధార్ కార్డు నంబర్ మార్చి పింఛన్ సొమ్ము అందేలా చేస్తామని అధికారులు నమ్మబలుకుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్‌లైన్‌లో ఉన్న వివరాలను సవరించి పింఛన్ మంజూరయ్యేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.