సాక్షి, తిరుమల(చిత్తూరు): తిరుపతిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులో వీస్తున్నాయి. తిరుమల ఘట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఈ క్రమంలో అధికారులు వాహన దారులను, స్థానికులను అప్రమత్తం చేశారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా పయనించి, గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, మధ్య చెన్నై సమీపంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం కుడా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతో.. భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం చిత్తూరు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, నెల్లూరు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం పంపించామని తెలియజేశారు.
శనివారం అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అది ఈ నెల 17న దక్షిణకోస్తాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment