యాచారం, న్యూస్‌లైన్ : నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం దళితులు, గిరిజనులకు శాపంగా మారింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. అధికారులు, ప్రజాప్రతినిధులను తమదైన రీతిలో మచ్చిక చేసుకొని ఏడు నెలలుగా పనులను నత్తనడకన కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలవాసులు అపరిశుభ్ర వాతావరణంలో మగ్గుతున్నారు.
మండలంలోని 20 గ్రామాలకు గతేడాది జూలై నెలలో ఈజీఎస్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు నిర్మించడానికి రూ.కోటి ఐదు లక్షల నిధులు మంజూరయ్యాయి. మాల్, నల్లవెల్లి గ్రామాలకు రూ.పది లక్షల చొప్పున, మిగతా గ్రామాలకు దాదాపు రూ.ఐదు లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. వీటితో ఆయా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని గతేడాది జూలై చివరలోనే మండల పరిషత్ కార్యాలయానికి ఉత్తర్వులు కూడా వచ్చాయి. అయితే కేవలం నానక్‌నగర్, మల్కీజ్‌గూడ, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద, గునుగల్, చింతపట్ల గ్రామాల సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఆ గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి.
కాని మిగతా 14 గ్రామాల్లో మాత్రం నేటికీ పనులు పూర్తికాలేదు. ఇదిలా ఉంటే.. గత పక్షం రోజులుగా ఎన్నికల కోడ్ వస్తుందనే పుకార్ల నేపథ్యంలో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే భయంతో సర్పంచ్‌లు ఎంతో అర్భాటంగా ఆయా గ్రామాల్లో పనులు ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటించుకుంటున్నారు. కానీ కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి అభివృద్ధి పనులు చేయించడంలో మాత్రం అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు...
అభివృద్ధి పనులు వేగవంతంగా జరగకపోవడం వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లోనే మురుగు నీరు పారడం, దుర్వాసన, దోమలతో తరచు అస్వస్థతకు గురవుతున్నామని పలు కాలనీలవాసులు పేర్కొంటున్నారు. యాచారంలోని వీకర్ సెక్షన్ కాలనీవాసులు రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు వెంటనే నిర్మించాలంటూ పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు చేశారు. అదే విధంగా నక్కర్తమేడిపల్లి, మాల్, నల్లవెల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల ప్రజలు డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.
నిధులు పుష్కలం...పనులే నత్తనడక
Published Tue, Mar 4 2014 11:33 PM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM
Advertisement
Advertisement