సాక్షి, విజయవాడ: జిల్లాలో కరోనా బుసలు కొడుతోంది. ఎక్కడికక్కడ కరోనా కట్టడికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం బాధితుల్లో 78 శాతం మంది ‘ఢిల్లీ’తో సంబంధం ఉన్నవారేనని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే కరోనా పాజిటివ్ బాధితులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఏడు వందల తొంబై ఎనిమిది మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మరోవైపు కరోనా వైరస్ సోకిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైద్యారోగ్యశాఖ అధికారులు రెడ్‌జోన్ ప్రాంతాల్లో కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఈ రోజు ఎన్ని కేసులు వచ్చాయంటూ అధికారులు మొదలుకొని సామాన్యుడి వరకు ఆరా తీస్తున్నారు. గత నెల లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆదివారం వరకు జిల్లాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క విజయవాడ నగరంలోనే 17 మంది, జగ్గయ్యపేటలో ముగ్గురు, పెనమలూరులో ముగ్గురు, నందిగామ మండలంలో ఇద్దరు, నూజివీడులో ఇద్దరు, మచిలీపట్నం నగరంలో ఒకరు కరోనా పాజిటివ్ బాధితులుగా తేలడంతో అధికారులు అప్రమత్తయ్యారు. వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులు 798 మందిని అధికారులు గుర్తించి విజయవాడ, గన్నవరం, గంగూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లకు తరలించారు.
ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్న వారు 2,443 కాగా, గృహనిర్బంధం పూర్తి చేసిన వారు 870 మందని అధికారులు వెల్లడించారు. ఇంకా గృహ నిర్బంధంలో 1573 మంది ఉండగా, కరోనా పాజిటివ్ వచ్చిన వారు 28 మందిగా నిర్ధారించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారు 798 మంది కాగా, ఇంత వరకు సేకరించిన నమూనాలు 378, వీటిలో నెగిటివ్ వచ్చిన నమూనాలు 155 కాగా, ఫలితాలు రావాల్సి ఉన్న నమూనాలు 195 ఉన్నాయి. చికిత్సతో సంపూర్ణ ఆరోగ్యంతో బయట పడ్డవారు ఇద్దరని వైద్యాధికారులు వెల్లడించారు. పాజిటివ్ కేసుల్లో ఇద్దరు మరణించగా (అధికారికంగా ఒకరి మృతి ప్రకటించాల్సిఉంది), మిగిలిన వారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రి, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలోని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
బెజవాడలో 352 షాపులపై కేసులు
కోవిడ్–19 చట్టం అమల్లోకి వచ్చాక నగరంలో వ్యాపారాలు నిర్వహించిన 352 షాపులపై విజయవాడ నగర పోలీసులు కేసులు నమోదు చేసి 535 మందిని అరెస్టు చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన 16,921 వాహనాలపై కేసులు నమోదు చేసి వారికి రూ.86,88,545 అపరాధ రుసుం విధించారు. మరో 172 వాహనాలను సీజ్ చేశారు.
ఒక్క రోజే 25 మంది క్వారంటైన్‌కు..
మచిలీపట్నంలోని చిలకలపూడిలో కరోనా లక్షణాలతో ఉన్న ఒక వ్యక్తిని విజయవాడ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. శనివారం అతనికి పాజిటివ్ అని తేలింది. అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ వ్యక్తి ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు? అన్న వివరాలపై ఆరా తీసి 25 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment