
టీడీ‘ఫ్రీ’ ఆఫర్
* రూ.100 రుసుముతో రూ.2 లక్షల బీమా సదుపాయం
* ‘కేశినేని’లో రాయితీ,కార్పొరేట్ ఆస్పత్రుల్లో తగ్గింపు
* సభ్యత్వ నమోదులో అధికార పక్షం సరికొత్త ఎరలు
* కరపత్రాలతో గ్రామాల్లో నాయకుల విస్తృత ప్రచారం
రాజమండ్రి రూరల్ : ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’, ‘మా వద్ద షాపింగ్ చేయండి.. సింగపూర్ షికారు ఛాన్స్ కొట్టండి’ వంటి ఆఫర్లు.. సరుకులను అమ్ముకునేందుకు వివిధ సంస్థలు అనుసరించే వ్యూహాలే. ఇప్పుడు ఆ బాపతు వ్యూహాన్నే అధికార తెలుగుదేశం ఎంచుకుంది. పార్టీ సభ్యత్వాల నమోదు క్రమంలో జనాన్ని ఆకట్టుకునేందుకు అనేక తాయిలాలనూ, రాయితీలను ఇవ్వజూపుతోంది. రాజకీయ పార్టీలకు సంబంధించి వింత వరవడికి నాంది పలుకుతోంది. టీడీపీ సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.100 రుసుముగా నిర్ణయించింది.
ఈ ఏడాదిలో సభ్యత్వ నమోదులో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టిన ఆ పార్టీ రోజుకు ఒక గ్రామంలో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, డిసెంబరు మూడు లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ శ్రేణులను నిర్దేశించింది. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చైతన్యం కలిగించాలని సూచించింది. ఆ మేరకు నాయకులు క్రియాశీలక సభ్యులుగా చేరే వారికి కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇవీ నజరానాలు..
ఎవరైనా రూ.100 పెట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే రూ.రెండు లక్షల ప్రమాద బీమా, కేశినేని ట్రావెల్స్‌లో ప్రయాణిస్తే టిక్కెట్ చార్జీలో పది శాతం రాయి తీ, వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందితే 15 నుంచి 20 శాతం బిల్లు తగ్గింపు వంటి సౌకర్యాలు సొంతమవుతాయని ఊరిస్తున్నారు. ఒకవేళ ఆ కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోతే అతని పిల్లల్లో ఇద్దరికి విద్యాసంక్షేమ నిధి నుంచి చదువు నిమిత్తం రూ.10 వేల చొప్పున అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు. క్రియాశీలక సభ్యులుగా చేరితే దక్కే ఇలాంటి ప్రయోజనాలను ముఖతహ చెప్పడమే కాక.. కరపత్రాలు ముద్రించి మరీ ప్రచారం చేస్తున్నారు.
నేటి మైనర్లే.. రేపటి ఓటర్లు
ఇప్పటి వరకూ ఏ పార్టీ అయినా 18 ఏళ్లు నిండి న వారిని మాత్రమే సభ్యులుగా చేర్చుకునేది. ఇప్పుడు టీడీపీ ఆ వయోపరిమితిని సడలించేసింది. ఒకప్పుడు ‘విద్యార్థులకు రాజకీయాలెందుకు?’ అన్న చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని పార్టీయే ఇప్పుడు బాలలనూ నిస్సంకోచంగా సభ్యులుగా చేర్చుకుంటోంది. 14 ఏళ్లు నిండిన వారిని సభ్యులుగా చేర్చుకోవచ్చని, వారు రానున్న ఎన్నికల నాటికి 18 ఏళ్లు నిండి ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉన్నందున సభ్యత్వాలు స్వీకరించాలని ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో పెల్లుబుతుకున్న వ్యతిరేకతను తట్టుకునేందుకు తమ పార్టీ చిత్రవిచిత్రమైన చిట్కాలను ప్రయోగిస్తోందని, అవి ఎంతవరకూ ఫలిస్తాయో కాలమే తేలుస్తుందని కొందరు టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.