
ఖమ్మం జిల్లా తుమ్మూరు వద్ద ఎత్తు పెంచి నిర్మించిన ఆంధ్రా కాలువ
పశ్చిమగోదావరి , చింతలపూడి : ఆంధ్రా కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ ఏడాది సాగునీటి కష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2012లో నీలం తుపానుకు పడిన గండిని సంబంధిత అధికారులు ఇంత వరకూ పూడ్చలేదు. దీంతో ఇప్పటికే మెరక తేలి పూడిక, ముళ్ల పొదలతో పూడుకుపోయిన ఆంధ్రా కాలువ కొంతకాలానికి కనుమరుగు అవుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
11 వేల ఎకరాలకు సాగునీరు
చింతలపూడి మండలంలోని 21 చెరువులకు సాగు నీరు అందించడానికి ఖమ్మం జిల్లా తుమ్మూరు వద్ద ఆనకట్ట నిర్మించారు. అక్కడి నుంచి వరద నీటిని సాగునీటి చెరువులకు మళ్లిస్తారు. 1967లో 18 కిలోమీటర్ల పొడవున కాలువను నిర్మించారు. ఈ కాలువల ద్వారా మండలంలో దాదాపు 11 వేల ఎకరాలకు ఏటా సాగునీరు అందుతోంది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రా కాలువ పూడుకుపోయి సాగు నీటి సరఫరాకు అంతరాయంగా మారింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలువకు గండ్లు
దీనికి తోడు మైనర్ ఇరిగేషన్ పరిధిలోని ఈ కాలువకు వర్షాకాలం సమయంలో అనేకసార్లు గండ్లు పడటం, మరమ్మతులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో నీలం తుపానుకు మండలంలోని గణిజర్ల గ్రామం వద్ద ఆంధ్రాకాలువకు పెద్ద గండి పడింది. ఆంధ్రా కాలువకు పడిన గండిని తక్షణం పూడ్చాలని రైతులు, ప్రజలు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గండి పూడ్చివేతలో లక్షలాది రూపాలయలు దండుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో శాశ్వత చర్యలు చేపట్టలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఏటా ఇదే ప్రాంతంలో గండి పడుతుండటంతో అధికారులకు, కాంట్రాక్టర్లకు కాసుల పంట కురుస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఈ వేసవిలో నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టకపోతే ఆంధ్రా కాలువ నుంచి వచ్చే వరదనీరు వృథాగా పోయే ప్రమాదం ఉందని ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు శాశ్వత ప్రాతిపదికన పటిష్టంగా మరమ్మతులు చేపట్టాలని, ఆంధ్రకాలువ పూడికతీత పనులను చేపట్టాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment