సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యేతో ప్రాంగణంలో చర్చిస్తున్న అటవీ శాఖ అధికారి ప్రదీప్‌కుమార్
ఇబ్రహీంపట్నం: జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ఈనెల 22న ఇబ్రహీంపట్నంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న వనమహోత్సవ ప్రాంగణ ప్రాంతాన్ని అటవీ సంరక్షణ రాష్ట్ర ప్రధాన అధికారి ప్రదీప్‌కుమార్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలసి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. పచ్చతోరణం ఏర్పాట్లుపై ఆరా తీశారు. సభా వేదిక, సీఎంచేత మొక్కలు నాటించనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీశాఖ ఏర్పాటు చేయనున్న స్టాల్స్ ప్రదేశం, బారికేడ్లు ఏర్పాటుపై స్థానిక అధికారులతో చర్చించారు. వర్షం వచ్చినప్పటికీ అంతరాయం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో అటవీశాఖ సీఎఫ్ ఎన్.నాగేశ్వరరావు, జిల్లా ఫారెస్ట్ అధికారి మంగమ్మ, తహసీల్దార్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ఎంపీడీఓ దివాకర్ పాల్గొన్నారు.
శరవేగంగా ఏర్పాట్లు..
వన మహోత్సవ నిర్వహించనున్న ప్రాంగణంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆదివారం అధికారులతో కలసి పనులు పర్యవేక్షించారు. ఇప్పటికే పేదలకు కేటాయించేందుకు 33 ఎకరాల్లో మెరక పనులు పూర్తి చేసి సరిహద్దు రాళ్లు పాతించారు. వర్షాలకు ప్లాట్లు జలమయం అయ్యాయి. ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఆటంకం లేకుండా తిరిగి గ్రావెల్ తోలుతున్నారు. ఎప్పటికప్పుడు పొక్లెయిన్‌లతో నేల చదును చేసే పనులు చురుకుగా సాగుతున్నాయి. జాతీయ రహదారి నుంచి సభాస్థలం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు తొలగిస్తున్నారు. ప్రధాన రోడ్డును అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment