గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో పట్టుబడిన కల్తీ పొటాష్ ఎరువులు
సాక్షి, అమరావతి బ్యూరో: పొరుగు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్ద ఎత్తున నకిలీ ఎరువులు సరఫరా అవుతున్నట్లు తేలడం కలకలం రేపుతోంది. కల్తీ పొటాష్ ఎరువులను రాయలసీమతోపాటు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతులకు భారీగా విక్రయించినట్లు విజిలెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఎ.ముప్పాళలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో తనిఖీలు జరిపిన విజిలెన్స్ అధికారులు ఇక్కడ నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని తాజాగా ప్రకటించారు. కల్తీ ఎరువులను ఉప్పు, రసాయన రంగులు, ఎరువుల గిడ్డంగుల్లో వ్యర్థాలతో తయారు చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
నరసరావుపేటలోని నాలుగు దుకాణాల్లో...
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఈనెల 8, 9వ తేదీల్లో తనిఖీలు జరిపిన విజిలెన్స్ అధికారులు 920 బస్తాల కల్తీ పొటాష్ ఎరువులను సీజ్ చేసి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. వీటి విలువ రూ.5.42 లక్షలుగా గుర్తించారు. ఐపీఎల్ కంపెనీకి చెందిన మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఫెర్టిలైజర్స్ మాదిరిగా ఉండేలా కల్తీ ఎరువులు తయారు చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వినుకొండ, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు జరిపి నమానాలను సేకరించాయి. నరసరావుపేటలోని నాలుగు దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
కల్తీ ఎరువులు 2 వేల టన్నులకుపైనే..
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ లిమిటెడ్ షాపులో చిక్కిన కల్తీ ఎరువులపై విజిలెన్స్ అధికారులు అరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతంకంలోని వెంకట సుబ్రమణ్యేశ్వర ట్రేడర్స్, వెంకట రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్ షాపుల నుంచి నడిగడ్డ నాగిరెడ్డి అనే మధ్యవర్తి ద్వారా వినుకొండ, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాలకు కల్తీ ఎరువులు తరలించినట్టు గుర్తించారు. నరసరావుపేటలోని ఓ బ్రోకర్ ద్వారా నాలుగు దుకాణాలకు ఈ ఎరువులు చేరాయి. త్రిపురాంతకం ప్రాంతానికి కడపలోని ఓ బ్రోకర్ ద్వారా కర్ణాటక నుంచి కల్తీ ఎరువులు సరఫరా అయినట్లు వెల్లడైంది. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 2 వేల మెట్రిక్ టన్నులకు పైగా కల్తీ ఎరువులను విక్రయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ చేస్తే అసలు దోషులు చిక్కే అవకాశం ఉంది.
కల్తీ ఎరువుల విక్రేతలపై 420 కేసులు..
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దుకాణంలో ఎరువుల శాంపిళ్లను పరీక్షించిన బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆగ్రికల్చర్ ఎఫ్‌సీఓ ల్యాబ్ వీటిని కల్తీ పొటాష్ ఎరువుగా తేల్చింది. ఎంఓపీ ఎరువులో కె.టు.ఒ 60 శాతానికి బదులు కేవలం 2.86 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఉప్పు లవణానికి రంగులు వేసి దీన్ని తయారు చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ పరీక్షలో కల్తీ పొటాష్ ఎరువుగా నిర్ధారించినట్లు గుంటూరు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి, ఐపీఎల్ కంపెనీ ఏపీ ఇన్‌చార్జి రాంబాబు గుంటూరులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కల్తీ ఎరువులు అమ్మిన వారిపై 420 కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment