fake fertilizers
-
‘ఎంతమందికి చికిత్స అయినా ప్రభుత్వం సిద్ధం’
సాక్షి, మహబూబ్‌నగర్ : కరోనా విషయంలో ఎంతమందికైనా చికిత్స చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, వ్యాక్సిన్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాల్సిందేన్నారు. అజాగ్రత్త వల్ల ప్రాణహాని కలిగే అవకాశం ఉందని, ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని కోరారు. కరోనాపై ప్రజల్లో చైతన్యం రావాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారన్నారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూర్ కేంద్రంగా నకిలీ విత్తనాల దందా జరిగేదన్నారు. దీనిపై 8 కేసులు నమోదు చేశామని మంత్రి తెలిపారు. 15వేల నకిలీ విత్తనాల పాకెట్లను సీజ్ చేశామన్నారు. (ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం ) నవాబుపేటలో కూడా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయని మంత్రి పేర్కొన్నారు. వీరిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు పట్టించుకోకుంటే ఆకలిచావులు చస్తామని అన్నారు. వరి రైతులకు సంబంధించిన విత్తనాలు ప్రభుత్వం వద్ద సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఏ రైతు కూడా వరి ధాన్యం విత్తనాన్ని బయటకొనవద్దని సూచించారు. జిల్లాలో ఎలాంటి అక్రమాలు ఎవరి దృష్టికి వచ్చిన జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి సమాచారం అందించాలని కోరారు. మోసాలకు, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. (సుశాంత్ ఆత్మహత్య; కరణ్‌కు మద్దతుగా వర్మ) అదే విధంగా అతి త్వరలోనే రైతుబంధు డబ్బులు రైతులకు జమ చేస్తున్నామని మంత్రి అన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో కోటి మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాది అటుఇటుగా పూర్తిచేసి, అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్నారు. జిల్లా రూపురేఖలు మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని,అధికారులు ఏ చర్య తీసుకున్నా ప్రజా అభివృద్ధి కోసమే అని తెలుసుకోవాలని మంత్రి శ్రీనివాస్ సూచించారు. (డిప్రెషన్‌కు లోనైనందుకు సిగ్గుపడను.. ) -
నకిలీలకు చెక్.. కల్తీకి కళ్లెం
ముఖ్యమంత్రి ముందు చూపు.. సాక్షి, అమరావతి: దేశంలో తొలిసారిగా వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం సమగ్ర (ఇంటిగ్రెటెడ్) ప్రయోగశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.198 కోట్లు వ్యయం చేయనుంది. సాగు ఖర్చులు తగ్గించి ఉత్పాదన పెంచడంతోపాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభించేలా ప్రయోగశాలలు కీలకపాత్ర పోషిస్తాయి. రైతు లాభమే ధ్యేయంగా ఈ ల్యాబ్‌లు పని చేస్తాయి. నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే కేంద్రాలను వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ పరీక్షా ప్రయోగశాలలుగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి ముందు చూపు.. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులతో రైతులు నష్టపోకుండా ముందు చూపుతో ఈ ప్రయోగశాలలకు శ్రీకారం చుట్టింది. నాబార్డ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విత్తన బిల్లు ముసాయిదాలోనూ వీటి గురించి ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. వైఎస్సార్ ల్యాబ్స్ కోసం ఇప్పటికే స్థలాల ఎంపిక జరిగిందని, త్వరలో ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రయోజనాలు ఎన్నెన్నో... ప్రస్తుతం నమూనాల సేకరణ, ఫలితాల విశ్లేషణకు చాలా సమయం పడుతోంది. అన్ని కంపెనీల ఉత్పత్తులు ఈ పరిధిలోకి రావడం లేదు. ఇకపై అలా కుదరదు. యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థలోని ఆటోమేటెడ్ శాంప్లింగ్ మాన్యువల్ వ్యవస్థని పూర్తిగా మారుస్తారు. జిల్లా స్థాయిలోనే శాంపిళ్లను పరీక్షించి నకిలీవని తేలితే చట్టపరమైన చర్యలు చేపడతారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ కేంద్రాలకు బాధ్యుడిగా ఉంటారు. 600 చదరపు గజాల స్థలంలో ఇవి ఏరా>్పటవుతాయి. 2,112 చదరపు అడుగుల స్థలాన్ని భవనం కోసం వినియోగిస్తారు. నియోజకవర్గ ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వ్యయం అవుతుంది. ఇందులో భవనానికి రూ.55 లక్షలు కేటాయించారు. జిల్లా స్థాయి ల్యాబ్ 1.10 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ఉన్న పరీక్షా కేంద్రాలు కొత్తవాటితో విలీనం అవుతాయి. పర్యవేక్షణ ఇలా.. నెల్లూరులోని జీవన ఎరువుల నాణ్యతా నియంత్రణ ప్రయోగశాల, అమరావతిలోని పురుగు మందుల అవశేషాల పరీక్షా ప్రయోగశాల, గుంటూరులోని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, జన్యుమార్పిడి పంటల పర్యవేక్షణ కేంద్రాలు ఇకపై రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలుగా పనిచేస్తాయి. ఏకీకృత డిజిటల్ వేదిక ద్వారా శాంపిళ్లు స్వీకరిస్తాయి. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ కోడింగ్ సెంటర్లు ఏర్పాటవుతాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల శాంపిళ్లను స్వీకరించి కోడింగ్ చేసి పరీక్షా కేంద్రాలకు పంపడం వీటి ప్రధాన కర్తవ్యం. ప్రతి కోడింగ్ సెంటర్‌కు సుమారు రూ.90 లక్షల వరకు వ్యయం అవుతుంది. జిల్లా ల్యాబ్‌లకు అధిపతిగా ఉండే ఏడీఏకి 12 మంది ఏవోలు సహకరిస్తారు. నియోజకవర్గ ల్యాబ్‌లను రెగ్యులర్ ఏడీఏ పర్యవేక్షిస్తారు. గ్రామ వీఏఏలు లేదా మండల సిబ్బంది ఆయనకు సహకరిస్తారు. ఆక్వా ల్యాబ్‌లకు రూ.12.42 కోట్లు ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు కోస్తాలోని 46 నియోజకవర్గాలలో సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలతో పాటు ఆక్వా ల్యాబ్‌లు కూడా ఏర్పాటవుతాయి. వీటికోసం రూ.12.42 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆక్వా ల్యాబ్‌లతో రైతులకు మేలైన సీడ్ అందుతుంది. ఆక్వా సీడ్‌పై నియంత్రణ, పరీక్షలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే ముందడుగు ‘నకిలీ, కల్తీలను అరికట్టి అన్నదాతను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమగ్ర ప్రయోగశాలలు దేశ వ్యవసాయ రంగ చరిత్రలోనే పెద్ద ముందడుగు. నియోజకవర్గ స్థాయి అగ్రీ ల్యాబ్ ముఖ్యమంత్రి మానస పుత్రిక. రైతుల సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. త్వరలో 147 వైఎస్సార్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నాబార్డ్ ఆర్థిక సహకారం అందించనుంది. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు విక్రయిస్తే ఏ కంపెనీనీ వదలం’ – కె.కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి -
అక్రమ పోషకాల గుట్టు రట్టు
సాక్షి, ఆదోని: అనుమతులు లేకుండా తయారు చేస్తున్న పంటల పోషకాల ఉత్పత్తుల గుట్టును ఆదోని వ్యవసాయ అధికారులు రట్టు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మండల వ్యవసాయ అధికారి (ఏఓ) పాపిరెడ్డి, ఎంపీఈఓ వెంకటేష్ నాయక్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం తయారీ కేంద్రంపై దాడి చేశారు. దాడుల్లో రూ.40లక్షలకు పైగా విలువ చేసే పోషకాల ఉత్పత్తులు, తయారీకి అవసరం అయిన ముడిసరుకు గుర్తించారు. ఆదోని పట్టణ శివారులోని ఆలూరు రోడ్డులో ఓ పాత భవనంలో న్యూ ఇండియా క్రాప్ సైన్స్ పేరిట ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు కొనసాగుతున్నట్లు విచారణలో తేలింది. తయారీ కేంద్రం యజమాని నంద్యాలకు చెందిన మధుబాబుగా అధికారులు గుర్తించారు. ఏ ఉత్పత్తులు తయారువుతున్నాయంటే..? వరి, పత్తి, మిరప, ఉల్లితో పాటు పలు పంటలకు పోషకాలు అందించే ద్రవ, గుళికల రూపంలో మందులు తయారు చేస్తున్నారు. ఇందుకు 19:19:19 ఎరువు, మెగ్నీషియం, జిప్సంతో పాటు మరి కొన్ని రసాయనాలను వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. మిశ్రమాలు తయారు చేసే యంత్రాలు, సీల్ చేసే మిషన్లు కూడ గోదాములు ఉన్నాయి. ఉత్పత్తుల్లో వినియోగించే రసాయనాలను గుజరాత్ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఉత్పత్తులను పలు పరిమాణంలో ఉన్న బాటిల్స్, గుళికలను పాక్కెట్లలో నింపి డీలర్ల ద్వార రైతులకు విక్రయిస్తున్నారు. మిశ్రమాల ఉత్పత్తుల్లో పోషకాలు ఏవి, ఏ స్థాయిలో ఉన్నాయో కూడ లేబుల్స్‌పై ముద్రించి బాటిల్స్, పాకెట్స్‌పై అతికించారు. ద్రవ రూపంలో ఉన్న బాటిల్స్‌కు మినిరల్ గ్రాన్యూవల్స్ పాసిన్, పాకెట్లో ఉన్న గుళికల ఉత్పత్తులకు మినిరల్ గ్రాన్యూవల్స్ మినర్వ అని పేరు పెట్టారు. బాటిల్స్, పాక్కెట్స్ పరిమాణాలను బట్టి ఎంఆర్పీ రూ.1200 నుంచి రూ.25,000 వరకు నిర్ణయించినట్లు లేబుల్స్‌లో ముద్రించారు. ఉత్పత్తుల తయారీ, నిల్వ చేసే గోదాము, అమ్మకానికి వ్యవసాయశాఖ అనుమతులు, వాణిజ్య శాఖ అనుమతులు ఉండాలి. బాటిల్స్, పాకెట్స్‌పై ముద్రించిన మేరకు మందులలో పోషకాలు ఉన్నాయని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ ల్యాబ్ రిపోర్టు కూడా ఉత్పత్తి కేంధ్రంలో ఉంచాలి. దాడుల్లో మాత్రం వ్యవసాయశాఖ, వాణిజ్య శాఖ అనుమతులు, ల్యాబ్ రిపోర్ట్స్ లేవని తేలింది. ఉత్పత్తుల లేబుల్‌పై బ్యాచ్, ఎక్స్పైర్ గడువు, తయారీ తేదీ లేవు. అనుమతులు ఉన్నట్లు చెప్పుకొచ్చిన ఇన్చార్జ్ దాడి సమయంలో పంటల పోషకాల తయారీ కేంద్రం ఇన్చార్జ్, సీమ జిల్లాల ఏరియా మేనేజరుగా చెప్పుకున్న భాస్కర్ అక్కడే ఉన్నారు. తమకు పంటల పోషకాల మిశ్రమాల తయారీ, నిల్వ చేసేందుకు గోదాము, అమ్మకానికి వాణిజ్య శాఖ అనుమతులు ఉన్నాయంటూ ఆయన ఏఓతో చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం అనుమతులకు సంబంధించి పేపర్లు తమవద్ద లేవని, త్వరలోనే తెప్పిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో పెద్దగా తమ ఉత్పత్తుల అమ్మకాలు లేవని అత్యధికంగా అనంతపురం జిల్లాకు పంపినట్లు ఆయన చెప్పారు. అయితే ఏ డీలర్‌కు ఎప్పటి నుంచి ఏమేరకు ఉత్పత్తులు అమ్మారో వివరాలు మాత్రం చూపించలేకపోయారు. కాలం చెల్లిన మందులు ఉత్పత్తుల్లో వినియోగించే రసాయనాలు 35బాక్సుల్లో ఉన్నట్లు ఏఓ గుర్తించారు. బాక్సులపై ఎంఎఫ్ఎన్ అనే పేరుముద్రించి ఉంది. గత మేనెలతోనే మందులకు గడువు ముగిసినట్లు ఏఓ గుర్తించారు. వారం గడువు.. : అనుమతులు చూపేందుకు వారం గడువు ఇస్తున్నామని ఏఓ పాపిరెడ్డి తెలిపారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ తయారీ కేంద్రం యజమాని మధుబాబు ఏఓతో ఫోన్లో చెప్పారు. అయితే స్థానికంగా ఉన్న తనకు కాని, ఏడీఏకు గాని తెలియకుండా అనుమతులు ఎవరు ఎలా ఇచ్చారని ఏఓ ప్రశ్నకు తయారీ కేంద్ర యజమాని సమాధానం చెప్పలేదు. తాను ప్రస్తుతం తనకు ఏయేఅనుమతులు ఉన్నాయో తీసుకొచ్చేందుకు కమిషనరేట్‌కు వెళ్లానని త్వరలోనే వాటిని సమర్పిస్తామని, సీజ్ చేయవద్దని యజమాని కోరగా ఇందుకు ఏఓ నిరాకరించారు. అనుమతులు సమర్పించకపోతే యజమానితో పాటు నిర్వాహకులపై కూడా 420 చీటింగ్ కేసు నమోదు చేస్తామని ఏఓ చెప్పారు. కాలంచెల్లిన మందులు తనవేనని చెప్పుకున్న ఓ వ్యాపారి అక్రమ తయారీ కేంద్రం నిర్వహణ వెనుక పేరుమోసిన వ్యక్తులే ఉన్నట్లు సమాచారం. దాదాపు ఏడాదిన్నరగా అక్రమ ఉత్పత్తులు, అమ్మకాలు కొనసాగుతున్నట్లు స్థానికంగా ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తోంది. కాలం చెల్లిన మందులు తనవేనని, తనకు నిల్వ చేసుకునేందుకు గోదాము లేకపోవడంతో అక్కడపెట్టినట్లు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏఓతో చెప్పాడు. ఆ మందులను సీజ్ చేయొద్దని, తాను వెంటనే తన గోదాముకు తరలిస్తానని కూడా ఆ వ్యక్తి ప్రాధేయపడ్డాడు. అయితే ఇందుకు ఏఓ సమ్మతించలేదు. కాలం చెల్లిన మందులు ఉంటే తమకు నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో ఆ వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. ఏఓతో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు కూడా మాట్లాడారు. అనుమతులు ఏవీ చూపించకపోవడంతో తాను ఉత్పత్తులు, ముడిసరుకు, తయారీ కేంద్రంను సీజ్చేస్తున్నానని ఆ మహిళతో చెప్పిన ఏఓ వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. -
కల్తీపై కత్తి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్తీ, నకిలీ, నాణ్యత లేని ఎరువులు, విత్తనాల మాటే వినపడకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల అమలు దిశగా వ్యవసాయ శాఖ ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే డీఏపీ, యూరియా తదితర ముడి సరుకుల్ని తీసుకుని కొందరు వ్యాపారులు తమ సొంత మిక్సింగ్ ప్లాంట్లలో కలగలిపి నైట్రోజన్ (ఎన్), పాస్పరస్ (పీ) పొటాషియం (కె)– (ఎన్పీకే) గుళికల్ని తయారు చేసి రైతులకు విక్రయించే వీలు లేకుండా వ్యవసాయ శాఖ డీ నోటీఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్పీకే గుళికల వ్యాపారానికి కళ్లెం పడనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ విషయానికి ముగింపు పలికేలా వైఎస్ జగన్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యత లేని ఎన్పీకే ఎరువుల గుళికల తయారీకి రాష్ట్రంలో ఇక తెర పడినట్టేనని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంప్లెక్స్ ఎరువులు సమృద్ధిగా తక్కువ ధరలకు లభిస్తున్నప్పుడు అవే రసాయన మిశ్రమాలుండే ఎన్పీకే గుళికల్ని కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సిన అవసరం ఉండబోదని తేల్చి చెబుతున్నారు. గుళికల అసలు కథ ఇదీ.. సుదీర్ఘ కాలం పాటు దేశంలో కాంప్లెక్స్ ఎరువులు– అంటే డై అమోనియం పాస్పేట్, నైట్రోపాస్పేట్, అమోనియం పాస్పేట్ వంటి ద్వితీయ శ్రేణి వృక్ష సంబంధ పోషకాలు లేవు. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత ప్రముఖ ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువులు– మూడు 17 (17–17–17), మూడు 19 (19–19–19) వంటి వాటి తయారీని చేపట్టాయి. అయితే ఈ కంపెనీల నుంచి ముడి పదార్థాలను కొనుగోలు చేసి కొన్ని వ్యాపార సంస్థలు ఎన్పీకే గుళికల తయారీని చేపట్టాయి. కాంప్లెక్స్ ఎరువుల్లో ఎటువంటి పోషకాలు ఉంటాయో అటువంటి పోషకాలే ఉండే మిశ్రమ గుళికల్ని తయారు చేయడం ఎందుకు అనే వాదన మొదలైంది. పైగా ఎన్పీకే గుళికల్లో నాణ్యత, ప్రమాణాలు ఉండడం లేదని, వినియోగించాల్సిన పాళ్లలో నైట్రోజన్, పాస్పరస్, పొటాషియం ఉండడం లేదని, ధర కూడా ఆయా సంస్థల ఇష్టానుసారంగా ఉంటోందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2011లోనే మిక్సింగ్ ప్లాంట్లలో ఎన్పీకే గుళికల తయారీని ఆపాలని అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. కాంప్లెక్స్ ఎరువుల దిగుమతులు ఎక్కువగా ఉన్న తరుణంలో మిక్సింగ్ గుళికల తయారీకి అనుమతులు ఆపాలనుకుంది. అయితే వివిధ కారణాలతో అది ఇంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. డీ నోటిఫై చేసింది ఈ గుళికలనే.. 1985 నాటి ఎరువుల నియంత్రణ (ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్, మిక్సిడ్) ఉత్తర్వు 13వ క్లాజ్‌లోని రెండవ సబ్ క్లాజ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎన్పీకే గుళికల మిశ్రమ ఎరువుల తయారీని డీ నోటిఫై చేసింది. వాటిల్లో 20–20–00, 15–15–15, 17–17–17, 19–19–19, 14–28–14, 14–35–14, 10–26–26, 20–10–10 (చెరకు) ఉన్నాయి. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన రెడ్డి పేరిట ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ తరహా మిశ్రమ గుళికలన్నింటినీ ప్రముఖ ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల పేరిట విక్రయిస్తున్నాయి. మార్కెట్లో అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. పైగా కాంప్లెక్స్ ఎరువులు బాగా పని చేస్తాయనే హామీ ఉంటుంది. అదే మిశ్రమ గుళికలకు ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఎలా పని చేస్తాయో కూడా చివరి వరకు తెలిసే అవకాశం లేదు. మిశ్రమ గుళికలు తయారు చేస్తే చర్యలు వ్యవసాయ శాఖ డీ నోటిఫై చేసిన మిశ్రమ గుళికల్ని మిక్సింగ్ ప్లాంట్లు తయారు చేయకూడదు. చేస్తే చర్యలు తీసుకుంటారు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో 20కి పైగా మిక్సింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మూడు సంస్థలు తమ లైసెన్సులను రెన్యువల్ చేయించుకోలేదు. 17 మాత్రం పని చేస్తున్నట్టు చెబుతున్నా వీటిల్లోనూ పది మాత్రమే చురుగ్గా పని చేస్తున్నాయని వ్యవసాయాధికారులు చెప్పారు. అయితే అనధికార వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 19 మిక్సింగ్ ప్లాంట్లు పని చేస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువులకు, మిశ్రమ ఎన్పీకే ఎరువులకు బస్తాకు 70, 80 రూపాయల తేడా ఉంటుంది. రైతుకు దక్కాల్సిన సబ్సిడీ మిక్సింగ్ ప్లాంట్లకు పోతే ఎలా? మిశ్రమ ఎన్పీకే ఎరువుల తయారీని నిలువరించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని ప్రముఖ ఎరువుల కంపెనీలో కీలక బాధ్యతను నిర్వర్తించిన వ్యవసాయ ఇంజినీరింగ్ నిపుణుడు ఎం.సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్ణయించిన పాళ్లలో నైట్రోజన్, పొటాషియం, పాస్పరస్ కలపకుండా చెత్తా చెదారాలన్నీ కలిపి అందంగా గుళికల్ని తయారు చేసి రంగు రంగు సంచుల్లో పెట్టి రైతుల్ని నట్టేట ముంచుతున్న మిక్సింగ్ ప్లాంట్లకు ఈ నిర్ణయం ఊహించని విఘాతమే. రైతులకు మాత్రమే దక్కాల్సిన సబ్సిడీ ఎరువును కొందరి లాభాలకు ఉపయోగపడకుండా ముకుతాడు వేసినట్టవుతుంది. నిజానికి ఈ సంస్థలు– నాన్ ఫెర్టిలైజర్ ప్రాడక్ట్ కింద కొనుక్కుని మిక్సింగ్ చేసి అమ్ముకోవాలి. కానీ ఆ పని చేయడానికి బదులు లాభాల వేటలో రైతుల్ని దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడా పరిస్థితి ఉండదని సుబ్బారెడ్డి చెబుతున్నారు. సుద్ద, మట్టి, పేడ కలిపి గుళికల తయారీ మిక్సింగ్ ప్లాంట్లలో జరుగుతున్న తతంగం అందరికీ తెలిసినా ఇంతవరకు ఆ దిశగా ఎవరూ చర్యలు చేపట్టలేదని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. వ్యవసాయ శాఖ ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్‌తో చాలా మిక్సింగ్ ప్లాంట్లు మూత పడడమో లేక కొత్త ఉత్పత్తులు తయారు చేసుకోవడమో జరుగుతుందన్నారు. పెద్ద కంపెనీల నుంచి ముడి పదార్థాలు కొనుక్కొని వచ్చి.. వాటికి మట్టి, సుద్ద, పేడ కలిపి.. అందంగా గుళికల్ని తయారు చేసి కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరకు విక్రయించిన ఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆటలు చెల్లవు. రైతులకు ఉపయుక్తం కాంప్లెక్స్ ఎరువుల లభ్యత ఉన్న చోట అదే తరహా మిశ్రమాల తయారీని చేయకుండా ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ నిలువరిస్తుంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా కీలకం. కాంప్లెక్స్ ఎరువుల్లో సమపాళ్లలో పోషకాలు ఉంటాయి. అదే విడివిడిగా కలిపితే ఆ ఎరువులు పంటలపై అంతగా ప్రభావాన్ని చూపలేవు. ఎన్పీకే మిశ్రమ గుళికల్లో నాణ్యత లేకపోవడం వల్ల రైతులు ఇప్పటి వరకు నష్టపోతూ వచ్చారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కాంప్లెక్స్ ఎరువులు లభ్యత లేని చోట మాత్రమే వ్యవసాయ శాఖ అనుమతితో వేరే ఫార్ములా ప్రకారం మిశ్రమ ఎరువుల్ని తయారు చేసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ సలహా. ఈ మేరకు ఇక్కడ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎన్పీకే మిశ్రమ ఎరువుల తయారీని డీ నోటిఫై చేసింది. – అజేయ కల్లం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు సాహసోపేత నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభీష్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం ఇది. ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాతే ఎరువులైనా, పురుగు మందులైనా, విత్తనాలైనా విక్రయించాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఈ దిశగా పడిన తొలి అడుగు ఇది. తూతూ మంత్రంగా ఎన్పీకే పాళ్లను కలిపి సొమ్ము చేసుకోవాలనుకునే మిక్సింగ్ ప్లాంట్ల యాజమాన్యాల ఆశలు ఇకపై నెరవేరవు. కాంప్లెక్స్ ఎరువులు విరివిగా దొరుకుతున్నప్పుడు మళ్లీ ఈ గుళికలు అవసరం లేదు. వ్యవసాయ శాఖాధికారులు ఇకపై చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారనే దానికి ఈ నిర్ణయమే సంకేతం. – ఎంవీఎస్ నాగిరెడ్డి, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ -
ఉప్పు లవణానికి రంగు వేసి..
సాక్షి, అమరావతి బ్యూరో: పొరుగు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్ద ఎత్తున నకిలీ ఎరువులు సరఫరా అవుతున్నట్లు తేలడం కలకలం రేపుతోంది. కల్తీ పొటాష్ ఎరువులను రాయలసీమతోపాటు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతులకు భారీగా విక్రయించినట్లు విజిలెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఎ.ముప్పాళలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో తనిఖీలు జరిపిన విజిలెన్స్ అధికారులు ఇక్కడ నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని తాజాగా ప్రకటించారు. కల్తీ ఎరువులను ఉప్పు, రసాయన రంగులు, ఎరువుల గిడ్డంగుల్లో వ్యర్థాలతో తయారు చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. నరసరావుపేటలోని నాలుగు దుకాణాల్లో... శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో ఈనెల 8, 9వ తేదీల్లో తనిఖీలు జరిపిన విజిలెన్స్ అధికారులు 920 బస్తాల కల్తీ పొటాష్ ఎరువులను సీజ్ చేసి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. వీటి విలువ రూ.5.42 లక్షలుగా గుర్తించారు. ఐపీఎల్ కంపెనీకి చెందిన మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఫెర్టిలైజర్స్ మాదిరిగా ఉండేలా కల్తీ ఎరువులు తయారు చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వినుకొండ, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు జరిపి నమానాలను సేకరించాయి. నరసరావుపేటలోని నాలుగు దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. కల్తీ ఎరువులు 2 వేల టన్నులకుపైనే.. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ లిమిటెడ్ షాపులో చిక్కిన కల్తీ ఎరువులపై విజిలెన్స్ అధికారులు అరా తీయగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతంకంలోని వెంకట సుబ్రమణ్యేశ్వర ట్రేడర్స్, వెంకట రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్ షాపుల నుంచి నడిగడ్డ నాగిరెడ్డి అనే మధ్యవర్తి ద్వారా వినుకొండ, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాలకు కల్తీ ఎరువులు తరలించినట్టు గుర్తించారు. నరసరావుపేటలోని ఓ బ్రోకర్ ద్వారా నాలుగు దుకాణాలకు ఈ ఎరువులు చేరాయి. త్రిపురాంతకం ప్రాంతానికి కడపలోని ఓ బ్రోకర్ ద్వారా కర్ణాటక నుంచి కల్తీ ఎరువులు సరఫరా అయినట్లు వెల్లడైంది. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 2 వేల మెట్రిక్ టన్నులకు పైగా కల్తీ ఎరువులను విక్రయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ చేస్తే అసలు దోషులు చిక్కే అవకాశం ఉంది. కల్తీ ఎరువుల విక్రేతలపై 420 కేసులు.. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దుకాణంలో ఎరువుల శాంపిళ్లను పరీక్షించిన బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆగ్రికల్చర్ ఎఫ్సీఓ ల్యాబ్ వీటిని కల్తీ పొటాష్ ఎరువుగా తేల్చింది. ఎంఓపీ ఎరువులో కె.టు.ఒ 60 శాతానికి బదులు కేవలం 2.86 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఉప్పు లవణానికి రంగులు వేసి దీన్ని తయారు చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ పరీక్షలో కల్తీ పొటాష్ ఎరువుగా నిర్ధారించినట్లు గుంటూరు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, విజిలెన్స్ ఎస్పీ శోభామంజరి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి, ఐపీఎల్ కంపెనీ ఏపీ ఇన్చార్జి రాంబాబు గుంటూరులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కల్తీ ఎరువులు అమ్మిన వారిపై 420 కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. -
నకిలీ ఎరువులూ సృష్టించారు!
సాక్షి, రాజాపూర్ (జడ్చర్ల) : నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. సులువుగా డబ్బులు సంపాదించేందుకు మరిగిన దళారులు.. ఏకంగా నకిలీ ఎరువులనే విక్రయించేందుకు పూనుకుంటున్నారు. సాయిల్ కండీషన్ పేరుతో విక్రయించేందుకు మిక్చర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసి తెలంగాణ విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ ఎరువులను అక్రమార్కులు రైతులకు అంటగడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కో బస్తా రూ.1,200 మండలంలోని చెన్నవెల్లిలో గురువారం కొందరు దళారులు ఎలాంటి అనుమతి లేని నకిలీ ఎరువులను గ్రామాల్లోకి తీసుకువచ్చి డీఏపీ, యూరియాల పనిచేస్తాయని ఒక్కో బస్తాను రూ.1,200లకు అమ్మారు. వాస్తవంగా ఏదైనా వస్తువును మార్కెట్లో విక్రయించాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉండాలి.. లైసెన్స్ ఉన్న పరిధిలోనే విక్రయించాలి. అయితే కర్నూలు జిల్లా ఆదోని శ్రీ ఎంఎస్ బాలాజీ అగ్రికెం కంపెనీ పేరుతో ఎలాంటి అనుమతి, లాట్ నంబర్ లేకుండా నకిలీ ఎరువులను ఏకంగా గ్రామాల్లో రైతులకే నేరుగా అమ్మారు. ఈ నేపథ్యంలో నకిలీ ఎరువులు అని గుర్తించిన రైతులు వెంటనే మండల వ్యవసాయాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఏఓ నరేందర్ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే కంపెనీ నకిలీ ఎరువులను విక్రయిస్తూ ప్రభుత్వానికి 18 పన్ను సైతం ఎగ్గొడుతున్నట్లు తెలిసింది. కఠిన చర్యలు తీసుకోవాలి వర్షాలు సరిగా కురవక, విత్తనాలు నాణ్యమైనవి దొరకక రైతులు పంటలు సాగు చేసి నష్టాలు చవి చూస్తున్నారు. అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక ఎరువులు కూడా నకిలీవి వస్తే ఏం చేయాలి. ఇలాంటి వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. – బచ్చిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, రాజాపూర్ -
నకిలీ ఎరువుల గుట్టు రట్టు
మందస,న్యూస్‌లైన్: అనుమతులు లేవు.. బ్రాం డెడ్ కంపెనీల మందులూ లేవూ..అంతా డూప్లికేటే..పట్టించుకునే నాథుడే కరువవడంతో స్వేచ్ఛగా డూప్లికేట్ జీవ నియంత్రణ ఎరువుల వ్యాపారం సాగిపోతోంది. అందుకోసం ఏకం గా ఓ గోదాంనే ఏర్పాటు చేసుకున్నారు. మరో అడుగు ముందుకేసి..ఎరువులను తయా రు చేస్తున్నారు కూడా.. బోగస్ కంపెనీల పేర్లతో మందుల నిల్వలను చూసి..దాడులు నిర్వహిం చిన అధికారులే అవాక్కయ్యారు. వివరాలివీ.. మందస రాజావారి కోటకు సమీపంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లోని గదిలో నిబంధనలకు విరుద్ధంగా..ఎటువంటి అనుమతులు లేకుం డా.. కల్తీ జీవ నియంత్రణ ఎరువులు తయారు చేస్తున్నారని, ప్రస్తుతం అక్కడ భారీగా అక్రమ నిల్వలు ఉన్నాయని వ్యవసాయ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఏవో పూజారి సత్యనారాయణ గోదాం వద్దకు వెళ్లారు. అక్కడ వ్యవసాయానికి సంబంధించిన జీవ నియంత్రణ ఎరువులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఇద్దరు మహిళలు ప్యాకింగ్ చేస్తున్నట్లు గమనించారు. వెంటనే పోలీసులకు, పలాస ఏడీఏ టి.వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించా రు. అధికారులంతా..కలిసి పక్కా ప్రణాళికతో సోమవారం సాయంత్రం గోదాంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ప్యాకింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఎం.రమేష్ అనే వ్యక్తి పేరుతో గో దాంలో ఓ కవర్ ఉం దని, గోదాం నిర్వాహకుడు ఆయనే అయి ఉండవచ్చని ఏడీఈ అనుమానం వ్యక్తం చేశారు. గోదాంపై సాయి ఆగ్రో అనే పేరుతో బోర్డు ఉందన్నారు. కానీ ఈ పేరుతో ఎటువంటి లెసైన్సులు జారీ చేయలేదని పేర్కొన్నారు. 12 కంపెనీలకు చెందిన లేబుళ్లు.. గోదాంలో 12 రకాల కంపెనీలకు చెందిన లేబుళ్లు ఉన్నాయని, ఆయా పేర్లతో దేశంలో ఎక్కడా కంపెనీలు లేవని అధికారులు పేర్కొన్నారు. పూర్తిగా డూప్లికేట్ ఎరువుల తయారీ గోదాంగా గుర్తించామన్నారు. ఇక్కడ లభ్యమైన ఎరువులు సైతం నకిలీవేనని నిర్ధారించారు. గోదాంలో ఉన్న ఎరువుల విలువ రూ.లక్షల్లో ఉంటుందన్నారు. ఎరువులను ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సామగ్రిని, లేబుళ్లను స్వాధీనం చేసుకుని, గోదాంను సీజ్ చేశామని అధికారులు చెప్పారు. వాటిని సంబంధిత తహశీల్దార్ లేదా కోర్టులు అధీనంలో ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో ఏఈవోలు మెట్ట జ్యోత్స్న, పి.ఉదయ్‌కుమార్, ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వో గౌరీ ప్రసాద్, ట్రైనీ ఎస్సై బి.సురేష్‌బాబు, హెచ్‌సీ మెట్ట విజయ్‌కుమార్ ఉన్నారు.