అక్రమ పోషకాల గుట్టు రట్టు | Fake And Adulterated Fertilizers Identified In Kurnool | Sakshi
Sakshi News home page

అక్రమ పోషకాల గుట్టు రట్టు

Published Fri, Sep 27 2019 9:03 AM | Last Updated on Fri, Sep 27 2019 9:03 AM

Fake And Adulterated Fertilizers Identified In Kurnool - Sakshi

తయారీ కేంద్రంలో ఉత్పత్తులు, రసాయనాలను పరిశీలిస్తున్న ఏఓ పాపిరెడ్డి

సాక్షి, ఆదోని: అనుమతులు లేకుండా తయారు చేస్తున్న పంటల పోషకాల ఉత్పత్తుల గుట్టును ఆదోని వ్యవసాయ అధికారులు రట్టు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మండల వ్యవసాయ అధికారి (ఏఓ) పాపిరెడ్డి, ఎంపీఈఓ వెంకటేష్‌ నాయక్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం తయారీ కేంద్రంపై దాడి చేశారు. దాడుల్లో రూ.40లక్షలకు పైగా విలువ చేసే పోషకాల ఉత్పత్తులు, తయారీకి అవసరం అయిన ముడిసరుకు గుర్తించారు. ఆదోని పట్టణ శివారులోని ఆలూరు రోడ్డులో ఓ పాత భవనంలో న్యూ ఇండియా క్రాప్‌ సైన్స్‌ పేరిట ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు కొనసాగుతున్నట్లు విచారణలో తేలింది. తయారీ కేంద్రం యజమాని నంద్యాలకు చెందిన మధుబాబుగా అధికారులు గుర్తించారు.

ఏ ఉత్పత్తులు తయారువుతున్నాయంటే..?
వరి, పత్తి, మిరప, ఉల్లితో పాటు పలు పంటలకు పోషకాలు అందించే ద్రవ, గుళికల రూపంలో మందులు తయారు చేస్తున్నారు. ఇందుకు 19:19:19 ఎరువు, మెగ్నీషియం, జిప్సంతో పాటు మరి కొన్ని రసాయనాలను వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. మిశ్రమాలు తయారు చేసే యంత్రాలు, సీల్‌ చేసే మిషన్లు కూడ గోదాములు ఉన్నాయి. ఉత్పత్తుల్లో వినియోగించే రసాయనాలను గుజరాత్‌ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఉత్పత్తులను పలు పరిమాణంలో ఉన్న బాటిల్స్, గుళికలను పాక్కెట్లలో నింపి డీలర్ల ద్వార రైతులకు విక్రయిస్తున్నారు. మిశ్రమాల ఉత్పత్తుల్లో పోషకాలు ఏవి, ఏ స్థాయిలో ఉన్నాయో కూడ లేబుల్స్‌పై ముద్రించి బాటిల్స్, పాకెట్స్‌పై అతికించారు.

ద్రవ రూపంలో ఉన్న బాటిల్స్‌కు మినిరల్‌ గ్రాన్యూవల్స్‌ పాసిన్, పాకెట్లో ఉన్న గుళికల ఉత్పత్తులకు మినిరల్‌ గ్రాన్యూవల్స్‌ మినర్వ అని పేరు పెట్టారు. బాటిల్స్, పాక్కెట్స్‌ పరిమాణాలను బట్టి ఎంఆర్‌పీ రూ.1200 నుంచి రూ.25,000 వరకు నిర్ణయించినట్లు లేబుల్స్‌లో ముద్రించారు. ఉత్పత్తుల తయారీ, నిల్వ చేసే గోదాము, అమ్మకానికి వ్యవసాయశాఖ అనుమతులు, వాణిజ్య శాఖ అనుమతులు ఉండాలి. బాటిల్స్, పాకెట్స్‌పై ముద్రించిన మేరకు మందులలో పోషకాలు ఉన్నాయని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ ల్యాబ్‌ రిపోర్టు కూడా ఉత్పత్తి కేంధ్రంలో ఉంచాలి. దాడుల్లో మాత్రం వ్యవసాయశాఖ, వాణిజ్య శాఖ అనుమతులు, ల్యాబ్‌ రిపోర్ట్స్‌ లేవని తేలింది. ఉత్పత్తుల లేబుల్‌పై బ్యాచ్, ఎక్స్‌పైర్‌ గడువు, తయారీ తేదీ లేవు.

అనుమతులు ఉన్నట్లు చెప్పుకొచ్చిన ఇన్‌చార్జ్‌  
దాడి సమయంలో పంటల పోషకాల తయారీ కేంద్రం ఇన్‌చార్జ్, సీమ జిల్లాల ఏరియా మేనేజరుగా చెప్పుకున్న భాస్కర్‌ అక్కడే ఉన్నారు. తమకు పంటల పోషకాల మిశ్రమాల తయారీ, నిల్వ చేసేందుకు గోదాము, అమ్మకానికి వాణిజ్య శాఖ అనుమతులు ఉన్నాయంటూ ఆయన ఏఓతో చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం అనుమతులకు సంబంధించి పేపర్లు తమవద్ద లేవని, త్వరలోనే తెప్పిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో పెద్దగా తమ ఉత్పత్తుల అమ్మకాలు లేవని అత్యధికంగా అనంతపురం జిల్లాకు పంపినట్లు ఆయన చెప్పారు. అయితే ఏ డీలర్‌కు ఎప్పటి నుంచి ఏమేరకు ఉత్పత్తులు అమ్మారో వివరాలు మాత్రం చూపించలేకపోయారు.

కాలం చెల్లిన మందులు 
ఉత్పత్తుల్లో వినియోగించే రసాయనాలు 35బాక్సుల్లో ఉన్నట్లు ఏఓ గుర్తించారు. బాక్సులపై ఎంఎఫ్‌ఎన్‌ అనే పేరుముద్రించి ఉంది. గత మేనెలతోనే మందులకు గడువు ముగిసినట్లు ఏఓ గుర్తించారు.  
వారం గడువు.. : అనుమతులు చూపేందుకు వారం గడువు ఇస్తున్నామని ఏఓ పాపిరెడ్డి తెలిపారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ తయారీ కేంద్రం యజమాని మధుబాబు ఏఓతో ఫోన్‌లో చెప్పారు. అయితే స్థానికంగా ఉన్న తనకు కాని, ఏడీఏకు గాని తెలియకుండా అనుమతులు ఎవరు ఎలా ఇచ్చారని ఏఓ ప్రశ్నకు తయారీ కేంద్ర యజమాని సమాధానం చెప్పలేదు. తాను ప్రస్తుతం తనకు ఏయేఅనుమతులు ఉన్నాయో తీసుకొచ్చేందుకు కమిషనరేట్‌కు వెళ్లానని త్వరలోనే వాటిని సమర్పిస్తామని, సీజ్‌ చేయవద్దని యజమాని కోరగా ఇందుకు ఏఓ నిరాకరించారు. అనుమతులు సమర్పించకపోతే యజమానితో పాటు నిర్వాహకులపై కూడా 420 చీటింగ్‌ కేసు నమోదు చేస్తామని ఏఓ చెప్పారు.

కాలంచెల్లిన మందులు తనవేనని చెప్పుకున్న ఓ వ్యాపారి 
అక్రమ తయారీ కేంద్రం నిర్వహణ వెనుక పేరుమోసిన వ్యక్తులే ఉన్నట్లు సమాచారం. దాదాపు ఏడాదిన్నరగా అక్రమ ఉత్పత్తులు, అమ్మకాలు కొనసాగుతున్నట్లు స్థానికంగా ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తోంది. కాలం చెల్లిన మందులు తనవేనని, తనకు నిల్వ చేసుకునేందుకు గోదాము లేకపోవడంతో అక్కడపెట్టినట్లు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏఓతో చెప్పాడు. ఆ మందులను సీజ్‌ చేయొద్దని, తాను వెంటనే తన గోదాముకు తరలిస్తానని కూడా ఆ వ్యక్తి ప్రాధేయపడ్డాడు. అయితే ఇందుకు ఏఓ సమ్మతించలేదు. కాలం చెల్లిన మందులు ఉంటే తమకు నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడంతో ఆ వ్యక్తి ఫోన్‌ కట్‌ చేశాడు. ఏఓతో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు కూడా మాట్లాడారు. అనుమతులు ఏవీ చూపించకపోవడంతో తాను ఉత్పత్తులు, ముడిసరుకు, తయారీ కేంద్రంను సీజ్‌చేస్తున్నానని ఆ మహిళతో చెప్పిన ఏఓ వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement