సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్తీ, నకిలీ, నాణ్యత లేని ఎరువులు, విత్తనాల మాటే వినపడకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల అమలు దిశగా వ్యవసాయ శాఖ ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే డీఏపీ, యూరియా తదితర ముడి సరుకుల్ని తీసుకుని కొందరు వ్యాపారులు తమ సొంత మిక్సింగ్ ప్లాంట్లలో కలగలిపి నైట్రోజన్ (ఎన్), పాస్పరస్ (పీ) పొటాషియం (కె)– (ఎన్‌పీకే) గుళికల్ని తయారు చేసి రైతులకు విక్రయించే వీలు లేకుండా వ్యవసాయ శాఖ డీ నోటీఫికేషన్ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్‌పీకే గుళికల వ్యాపారానికి కళ్లెం పడనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ విషయానికి ముగింపు పలికేలా వైఎస్ జగన్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యత లేని ఎన్‌పీకే ఎరువుల గుళికల తయారీకి రాష్ట్రంలో ఇక తెర పడినట్టేనని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంప్లెక్స్ ఎరువులు సమృద్ధిగా తక్కువ ధరలకు లభిస్తున్నప్పుడు అవే రసాయన మిశ్రమాలుండే ఎన్‌పీకే గుళికల్ని కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సిన అవసరం ఉండబోదని తేల్చి చెబుతున్నారు.
గుళికల అసలు కథ ఇదీ..
సుదీర్ఘ కాలం పాటు దేశంలో కాంప్లెక్స్ ఎరువులు– అంటే డై అమోనియం పాస్పేట్, నైట్రోపాస్పేట్, అమోనియం పాస్పేట్ వంటి ద్వితీయ శ్రేణి వృక్ష సంబంధ పోషకాలు లేవు. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత ప్రముఖ ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువులు– మూడు 17 (17–17–17), మూడు 19 (19–19–19) వంటి వాటి తయారీని చేపట్టాయి. అయితే ఈ కంపెనీల నుంచి ముడి పదార్థాలను కొనుగోలు చేసి కొన్ని వ్యాపార సంస్థలు ఎన్‌పీకే గుళికల తయారీని చేపట్టాయి. కాంప్లెక్స్ ఎరువుల్లో ఎటువంటి పోషకాలు ఉంటాయో అటువంటి పోషకాలే ఉండే మిశ్రమ గుళికల్ని తయారు చేయడం ఎందుకు అనే వాదన మొదలైంది.
పైగా ఎన్‌పీకే గుళికల్లో నాణ్యత, ప్రమాణాలు ఉండడం లేదని, వినియోగించాల్సిన పాళ్లలో నైట్రోజన్, పాస్పరస్, పొటాషియం ఉండడం లేదని, ధర కూడా ఆయా సంస్థల ఇష్టానుసారంగా ఉంటోందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2011లోనే మిక్సింగ్ ప్లాంట్లలో ఎన్‌పీకే గుళికల తయారీని ఆపాలని అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. కాంప్లెక్స్ ఎరువుల దిగుమతులు ఎక్కువగా ఉన్న తరుణంలో మిక్సింగ్ గుళికల తయారీకి అనుమతులు ఆపాలనుకుంది. అయితే వివిధ కారణాలతో అది ఇంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
డీ నోటిఫై చేసింది ఈ గుళికలనే..
1985 నాటి ఎరువుల నియంత్రణ (ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్, మిక్సిడ్) ఉత్తర్వు 13వ క్లాజ్‌లోని రెండవ సబ్ క్లాజ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎన్‌పీకే గుళికల మిశ్రమ ఎరువుల తయారీని డీ నోటిఫై చేసింది. వాటిల్లో 20–20–00, 15–15–15, 17–17–17, 19–19–19, 14–28–14, 14–35–14, 10–26–26, 20–10–10 (చెరకు) ఉన్నాయి. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన రెడ్డి పేరిట ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ తరహా మిశ్రమ గుళికలన్నింటినీ ప్రముఖ ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల పేరిట విక్రయిస్తున్నాయి. మార్కెట్‌లో అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. పైగా కాంప్లెక్స్ ఎరువులు బాగా పని చేస్తాయనే హామీ ఉంటుంది. అదే మిశ్రమ గుళికలకు ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఎలా పని చేస్తాయో కూడా చివరి వరకు తెలిసే అవకాశం లేదు.
మిశ్రమ గుళికలు తయారు చేస్తే చర్యలు
వ్యవసాయ శాఖ డీ నోటిఫై చేసిన మిశ్రమ గుళికల్ని మిక్సింగ్ ప్లాంట్లు తయారు చేయకూడదు. చేస్తే చర్యలు తీసుకుంటారు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో 20కి పైగా మిక్సింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మూడు సంస్థలు తమ లైసెన్సులను రెన్యువల్ చేయించుకోలేదు. 17 మాత్రం పని చేస్తున్నట్టు చెబుతున్నా వీటిల్లోనూ పది మాత్రమే చురుగ్గా పని చేస్తున్నాయని వ్యవసాయాధికారులు చెప్పారు. అయితే అనధికార వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో 19 మిక్సింగ్ ప్లాంట్లు పని చేస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువులకు, మిశ్రమ ఎన్‌పీకే ఎరువులకు బస్తాకు 70, 80 రూపాయల తేడా ఉంటుంది.
రైతుకు దక్కాల్సిన సబ్సిడీ మిక్సింగ్ ప్లాంట్లకు పోతే ఎలా?
మిశ్రమ ఎన్‌పీకే ఎరువుల తయారీని నిలువరించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని ప్రముఖ ఎరువుల కంపెనీలో కీలక బాధ్యతను నిర్వర్తించిన వ్యవసాయ ఇంజినీరింగ్ నిపుణుడు ఎం.సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్ణయించిన పాళ్లలో నైట్రోజన్, పొటాషియం, పాస్పరస్ కలపకుండా చెత్తా చెదారాలన్నీ కలిపి అందంగా గుళికల్ని తయారు చేసి రంగు రంగు సంచుల్లో పెట్టి రైతుల్ని నట్టేట ముంచుతున్న మిక్సింగ్ ప్లాంట్లకు ఈ నిర్ణయం ఊహించని విఘాతమే. రైతులకు మాత్రమే దక్కాల్సిన సబ్సిడీ ఎరువును కొందరి లాభాలకు ఉపయోగపడకుండా ముకుతాడు వేసినట్టవుతుంది. నిజానికి ఈ సంస్థలు– నాన్ ఫెర్టిలైజర్ ప్రాడక్ట్ కింద కొనుక్కుని మిక్సింగ్ చేసి అమ్ముకోవాలి. కానీ ఆ పని చేయడానికి బదులు లాభాల వేటలో రైతుల్ని దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడా పరిస్థితి ఉండదని సుబ్బారెడ్డి చెబుతున్నారు.
సుద్ద, మట్టి, పేడ కలిపి గుళికల తయారీ
మిక్సింగ్ ప్లాంట్లలో జరుగుతున్న తతంగం అందరికీ తెలిసినా ఇంతవరకు ఆ దిశగా ఎవరూ చర్యలు చేపట్టలేదని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. వ్యవసాయ శాఖ ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్‌తో చాలా మిక్సింగ్ ప్లాంట్‌లు మూత పడడమో లేక కొత్త ఉత్పత్తులు తయారు చేసుకోవడమో జరుగుతుందన్నారు. పెద్ద కంపెనీల నుంచి ముడి పదార్థాలు కొనుక్కొని వచ్చి.. వాటికి మట్టి, సుద్ద, పేడ కలిపి.. అందంగా గుళికల్ని తయారు చేసి కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరకు విక్రయించిన ఘటనలూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆటలు చెల్లవు.
రైతులకు ఉపయుక్తం
కాంప్లెక్స్ ఎరువుల లభ్యత ఉన్న చోట అదే తరహా మిశ్రమాల తయారీని చేయకుండా ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ నిలువరిస్తుంది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా కీలకం. కాంప్లెక్స్ ఎరువుల్లో సమపాళ్లలో పోషకాలు ఉంటాయి. అదే విడివిడిగా కలిపితే ఆ ఎరువులు పంటలపై అంతగా ప్రభావాన్ని చూపలేవు. ఎన్‌పీకే మిశ్రమ గుళికల్లో నాణ్యత లేకపోవడం వల్ల రైతులు ఇప్పటి వరకు నష్టపోతూ వచ్చారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కాంప్లెక్స్ ఎరువులు లభ్యత లేని చోట మాత్రమే వ్యవసాయ శాఖ అనుమతితో వేరే ఫార్ములా ప్రకారం మిశ్రమ ఎరువుల్ని తయారు చేసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ సలహా. ఈ మేరకు ఇక్కడ కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎన్‌పీకే మిశ్రమ ఎరువుల తయారీని డీ నోటిఫై చేసింది.
– అజేయ కల్లం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు
సాహసోపేత నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభీష్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం ఇది. ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాతే ఎరువులైనా, పురుగు మందులైనా, విత్తనాలైనా విక్రయించాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఈ దిశగా పడిన తొలి అడుగు ఇది. తూతూ మంత్రంగా ఎన్‌పీకే పాళ్లను కలిపి సొమ్ము చేసుకోవాలనుకునే మిక్సింగ్ ప్లాంట్ల యాజమాన్యాల ఆశలు ఇకపై నెరవేరవు. కాంప్లెక్స్ ఎరువులు విరివిగా దొరుకుతున్నప్పుడు మళ్లీ ఈ గుళికలు అవసరం లేదు. వ్యవసాయ శాఖాధికారులు ఇకపై చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారనే దానికి ఈ నిర్ణయమే సంకేతం.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, అగ్రిమిషన్ వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment