నకిలీ ఎరువులను తీసుకువచ్చిన వాహనాన్ని పోలీసులకు అప్పగిస్తున్న రైతులు (ఫైల్)
సాక్షి, రాజాపూర్ (జడ్చర్ల) : నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. సులువుగా డబ్బులు సంపాదించేందుకు మరిగిన దళారులు.. ఏకంగా నకిలీ ఎరువులనే విక్రయించేందుకు పూనుకుంటున్నారు. సాయిల్ కండీషన్ పేరుతో విక్రయించేందుకు మిక్చర్‌లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసి తెలంగాణ విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ ఎరువులను అక్రమార్కులు రైతులకు అంటగడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒక్కో బస్తా రూ.1,200
మండలంలోని చెన్నవెల్లిలో గురువారం కొందరు దళారులు ఎలాంటి అనుమతి లేని నకిలీ ఎరువులను గ్రామాల్లోకి తీసుకువచ్చి డీఏపీ, యూరియాల పనిచేస్తాయని ఒక్కో బస్తాను రూ.1,200లకు అమ్మారు. వాస్తవంగా ఏదైనా వస్తువును మార్కెట్‌లో విక్రయించాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉండాలి.. లైసెన్స్ ఉన్న పరిధిలోనే విక్రయించాలి. అయితే కర్నూలు జిల్లా ఆదోని శ్రీ ఎంఎస్ బాలాజీ అగ్రికెం కంపెనీ పేరుతో ఎలాంటి అనుమతి, లాట్ నంబర్ లేకుండా నకిలీ ఎరువులను ఏకంగా గ్రామాల్లో రైతులకే నేరుగా అమ్మారు. ఈ నేపథ్యంలో నకిలీ ఎరువులు అని గుర్తించిన రైతులు వెంటనే మండల వ్యవసాయాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఏఓ నరేందర్ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే కంపెనీ నకిలీ ఎరువులను విక్రయిస్తూ ప్రభుత్వానికి 18 పన్ను సైతం ఎగ్గొడుతున్నట్లు తెలిసింది.
కఠిన చర్యలు తీసుకోవాలి
వర్షాలు సరిగా కురవక, విత్తనాలు నాణ్యమైనవి దొరకక రైతులు పంటలు సాగు చేసి నష్టాలు చవి చూస్తున్నారు. అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక ఎరువులు కూడా నకిలీవి వస్తే ఏం చేయాలి. ఇలాంటి వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.
– బచ్చిరెడ్డి, రైతు సమన్వయ సమితి
అధ్యక్షుడు, రాజాపూర్
Comments
Please login to add a commentAdd a comment