Fake seeds packing
-
నకిలీ విత్తనంపై నిఘా
కరీంనగర్‌రూరల్: నకిలీ విత్తనాల విక్రయాలపై ఇటు వ్యవసాయ శాఖ.. అటు పోలీసు శాఖ అధికారులు నిఘా వేశారు. నకిలీ విత్తనాలు సాగు చేసి రైతులు నష్టపోకుండా ఉండేందుకు విత్తన దుకాణాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో పత్తి సాగు చేసేందుకు రైతులు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1,37,500 ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఒక ఎకరానికి రైతులు 2 ప్యాకెట్ల పత్తి విత్తనాలు వేస్తారు. ఈ లెక్కన మొత్తం 2.75లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయి. ఎకరానికి రూ.1460 చొప్పున రైతులు విత్తనాలకు ఖర్చు చేస్తారు. సాధారణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తుంటారు. అధికారుల కంటే విత్తన డీలర్ల మాటలనే రైతులు ఎక్కువగా నమ్ముతుంటారు. డీలర్లు సైతం కమీషన్‌కు ఆశపడి రైతులకు నకిలీ, కల్తీ విత్తనాలను అంటగడుతున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ అధికారులతో కలిపి ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ముగ్గురు ఏడీఏలు, ముగ్గురు సీఐలు ఉన్నారు. మండల స్థాయిలో ఏవో, ఎస్సైలతో ప్రత్యేకంగా నిఘా కమిటీలను ఏర్పాటు చేసి విత్తన దుకాణాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేస్తున్నా దాదాపు 70శాతం మంది రైతులు విత్తన దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేస్తారు. నిఘా కమిటీ సభ్యులు తమ పరిధిలోని విత్తన దుకాణాలను తనిఖీ చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా... ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ, నిషేధిత విత్తనాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. కొంతమంది బ్రోకర్లు ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు దిగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలో పత్తి సాగు ఎక్కువయ్యే ప్రాంతాల్లో విత్తనాలను నిల్వ చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా విత్తన డీలర్లతోపాటు కొంతమంది రైతుల సాయంతో కమీషన్ పద్ధతిలో విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో హుజూరాబాద్‌లో రూ.70లక్షల విలువైన 60క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై పీడీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ విక్రయదారులపై పీడీ చట్టం నకిలీ, కల్తీ విత్తనాల విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లాలో రెండు కేసులు నమోదు చేశాం. నకిలీ విత్తనాల అమ్మకాలను నియంత్రించేందుకు జిల్లా, మండల స్థాయిల్లో పోలీస్, వ్యవసాయ అధికారులతో కలిపి నిఘా కమిటీలను ఏర్పాటు చేశాం. రైతులు విత్తన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేసి తప్పనిసరిగా రశీదు పొందాలి. – వాసిరెడ్డి శ్రీధర్,జిల్లా వ్యవసాయాధికారి -
రైతు మెడపై నకిలీ కత్తి
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో మళ్లీ నకిలీ పత్తివిత్తనాలు జోరందుకున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తివిత్తనాలతో పాటు, నకిలీ విత్తనాలు కూడా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. విత్తన వ్యాపారులు, జిన్నింగ్‌మిల్లుల నిర్వాహకులు, దళారులు ఈ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ఈ విత్తనాలను రైసుమిల్లులు, జిన్నింగ్‌మిల్లుల్లో నిలువ ఉంచి, రైతులతో తమకున్న సంబంధాలను వినియోగించుకొని అంటగడుతూ మోసగిస్తున్నారు. ఓ వైపు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నా.. మరోవైపు నకిలీ, నిషేధిత విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో సత్యనారాయణ అనే రైసుమిల్లు యజమాని ఇంట్లో వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పోలీసులు సోదాలు నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచారనే సమాచారంతో ఈనెల 13న దాడులు చేయగా.. బియ్యం బస్తాల్లో దాచి ఉంచిన 120 కిలోల నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.40 లక్షలు. వాటిని రైతులకు విక్రయించడానికి సిద్ధమైన సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో పత్తి పంట సాగుకు అధిక శాతం రైతులు మొగ్గుచూపుతుంటారు. గత సంవత్సరం 1.39లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా. ఈ ఏడాది 1.51లక్షల ఎకరాల్లో సాగుచేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సాగు కోసం దాదాపు 3.10లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని గుర్తించారు. సాధారణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తుంటారు. కానీ అధికారులకన్నా.. ఏటా కొనుగోలు చేసే విత్తన వ్యాపారులనే రైతులు నమ్ముతుంటారు. రైతుల నమ్మకాన్ని ఆసరగా తీసుకుని విత్తన వ్యాపారులు వారిని నిండాముంచుతున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలతో పాటు, నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. నకిలీ, నిషేధిత విత్తనాల అమ్మకాలు జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలతో పాటు, నాసిరకం విత్తనాలకు రంగులు అద్ది నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. పర్యావరణం దెబ్బతినడం, క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం గ్లైసిల్ పత్తివిత్తనాలు, గ్లైఫోసిట్ మందులను నిషేధించింది. నిషేధించి సంవత్సరాలు గడుస్తున్నా అమ్మకాలను మాత్రం అరికట్టలేకపోతోంది. ఈ సీజన్లో మళ్లీ నిషేధిత గ్లైసిల్, గ్లైఫోసెట్ అమ్మకాలు గ్రామాల్లో జోరందుకుంటున్నాయి. వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. ఈ విత్తనాలు వాడితే పత్తిలో కలుపు సమస్య ఉండదని, గులాబీ పురుగు నివారణకు మెరుగ్గా పనిచేస్తుందని నమ్మబలికి రైతులకు అంటగడుతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. విత్తనాలు, ఎరువుల దుకాణాల ద్వారానే ఈ వ్యాపారం ఎక్కువగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. చీడను తట్టుకుంటుందని, కలుపు తీయడానికి కూలీల సమస్య ఉండదనే కారణంగా రైతులు ఈ నిషేధిత పత్తి విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిషేధించినప్పటికీ గ్రామాల్లో కొనుగోళ్లు జరగడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు. అలాగే నకిలీ విత్తనాల దందా జిల్లాలో సాగుతోంది. నాసిరకం విత్తనాలకు రంగులు అద్ది, ఆకర్షణీయమైన సంచుల్లో విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచే... ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ, నిషేధిత విత్తనాలు జిల్లాకు దిగుమతవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి ఈ విత్తనాలు జిల్లాకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన నకిలీ, నిషేధిత విత్తనాలను జిల్లాలోని రైసుమిల్లులు, జిన్నింగ్‌మిల్లుల్లో నిలువ ఉంచారు. రబీలోనే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు తెప్పించుకుని నిల్వ ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో గోదాముల్లో దాచి ఉంచిన విత్తనాలను మార్కెట్లకు తరలిస్తున్నారు. అలాగే గ్రామాల్లోని కొంతమంది రైతులు, దళారులకు కమీషన్ ఇచ్చి వారి ని ఈ దందాలో భాగస్వామ్యులను చేస్తున్నారు. ప్యాకెట్లతోపాటు విడిగా కిలోల చొప్పున కూడా తేలిగ్గా విక్రయిస్తున్నారు. ఓ ముఠాగా ఏర్పడిన కొంతమంది వ్యాపారులు నకిలీ, నిషేధిత విత్తనాల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మార్చి నెలలో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, తాళ్లగురిజాల, నెన్నెల, కన్నెపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 13 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.65 లక్షల విలువైన నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనపరచుకున్నారు. నకిలీ, నిషేధిత పత్తివిత్తనాల దందాను మరో 20 మంది వ్యాపారులు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన జిల్లాలో చాలా పెద్ద ముఠాయే ఈ కార్యకలాపాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నకిలీ, విత్తన దందా సాగిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే విత్తనాలకు నకిలీ చీడ తగిలి దిగుబడి రాక అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. -
‘నకిలీ’పై ఉక్కుపాదం
మెదక్ మున్సిపాలిటీ: కోట్లాది ప్రజల కడుపు నింపే రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఎస్పీ చందనాదీప్తి అన్నారు. నకిలీ విత్తనాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేలను నమ్ముకున్న రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానమని, పంటలు పండించడమే తప్ప వాటిని లాభనష్టాలతో బేరీజు వేసే నైజానికి వారు దూరమన్నారు. తొలకరి జల్లులు పడగానే కోటి ఆశలతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని ఈ రోజు మన నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే అదంతా రైతు కష్టమేనన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతు బాగుండాలని, దేశానికి అన్నం పెట్టే వారే రైతులన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కారణంగా రైతు కంట కన్నీరు తప్ప వారికి ఆనందం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేదం చిందించి సేద్యం చేసి పచ్చని పంట పండించే రైతన్న నేడు నకిలీ విత్తనాలతో మోసానికి గురవుతున్నాడన్నారు. రైతులేని దేశాన్ని ఉహించలేమని, అందుకే రైతును కాపాడుకుంటేనే దేశం సస్యశ్యామలమవుతుందన్నారు. రైతులను మోసం చేస్తే చర్యలు ఇకపై రైతులను మోసాలు చేసేవారిపై కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాను శాశ్వతంగా అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నడుంబిగించిందని తెలిపారు. రైతులు తీసుకున్న విత్తనాలను నిజమైనవా, నకిలీవా? అని గుర్తించే విధానం గురించి, నకిలీ విత్తనాలను అమ్ముతున్న దళారుల మీద, కంపెనీలపై కేసులు నమోదు చేసే విధానం గురించి, నకిలీ విత్తనాలపై రైడింగ్‌చేసే విధానంపై పోలీసు అధికారులకు వివరించారు. ఆ కేసులకు సంబంధించి కోర్టులో చార్జ్‌షీట్ వేసే విధానంపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో చర్చించి వారి సహాయ సహకారాలతో నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ షాపు యజమానులు తమ దుకాణాల్లో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించరాదని, అలా అమ్మితే యజమానులపై చట్టపరైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నకిలీ ఎరువులూ సృష్టించారు!
సాక్షి, రాజాపూర్ (జడ్చర్ల) : నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే అంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. సులువుగా డబ్బులు సంపాదించేందుకు మరిగిన దళారులు.. ఏకంగా నకిలీ ఎరువులనే విక్రయించేందుకు పూనుకుంటున్నారు. సాయిల్ కండీషన్ పేరుతో విక్రయించేందుకు మిక్చర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసి తెలంగాణ విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ ఎరువులను అక్రమార్కులు రైతులకు అంటగడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కో బస్తా రూ.1,200 మండలంలోని చెన్నవెల్లిలో గురువారం కొందరు దళారులు ఎలాంటి అనుమతి లేని నకిలీ ఎరువులను గ్రామాల్లోకి తీసుకువచ్చి డీఏపీ, యూరియాల పనిచేస్తాయని ఒక్కో బస్తాను రూ.1,200లకు అమ్మారు. వాస్తవంగా ఏదైనా వస్తువును మార్కెట్లో విక్రయించాలంటే ముందుగా అన్ని అనుమతులు ఉండాలి.. లైసెన్స్ ఉన్న పరిధిలోనే విక్రయించాలి. అయితే కర్నూలు జిల్లా ఆదోని శ్రీ ఎంఎస్ బాలాజీ అగ్రికెం కంపెనీ పేరుతో ఎలాంటి అనుమతి, లాట్ నంబర్ లేకుండా నకిలీ ఎరువులను ఏకంగా గ్రామాల్లో రైతులకే నేరుగా అమ్మారు. ఈ నేపథ్యంలో నకిలీ ఎరువులు అని గుర్తించిన రైతులు వెంటనే మండల వ్యవసాయాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఏఓ నరేందర్ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే కంపెనీ నకిలీ ఎరువులను విక్రయిస్తూ ప్రభుత్వానికి 18 పన్ను సైతం ఎగ్గొడుతున్నట్లు తెలిసింది. కఠిన చర్యలు తీసుకోవాలి వర్షాలు సరిగా కురవక, విత్తనాలు నాణ్యమైనవి దొరకక రైతులు పంటలు సాగు చేసి నష్టాలు చవి చూస్తున్నారు. అరకొరగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఇక ఎరువులు కూడా నకిలీవి వస్తే ఏం చేయాలి. ఇలాంటి వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. – బచ్చిరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, రాజాపూర్ -
డ్వామా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అక్రమార్కులను వెనకేసుకు రావడంలో డ్వామా అధికారులు బరితెగించారు. అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల పట్ల నిస్సంకోచంగా ‘రాజును మించిన రాజ భక్తి’ చాటుకుంటున్నారు. అసలు వీరు ప్రభుత్వ అధికారులా.. లేక ఆ రూపంలో ఉన్న కాంట్రాక్టర్లా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థలో చిరుధాన్యాల మినీ కిట్స్ పంపిణీ తయారైంది. శనివారం నగరంలో నకిలీ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో కళ్లకు కట్టినట్లు అక్రమాలు బయటపడ్డా... సదరు కాంట్రాక్టరుపై ఈగ కూడా వాలకుండా డ్వామా ఏపీడీ పోలీసుల వద్ద కూడా వాంగ్మూలం ఇచ్చారంటే అక్రమార్కులు, అధికారుల మధ్య బంధం ఎంత గట్టిగా పెనవేసుకు పోయిందో అర్థమవుతోంది. ‘డ్వామా’లో విత్తనాల సరఫరాను పర్యవేక్షించే ఏపీడీ నాగభూషణం కాంట్రాక్టరును వెనకేసుకొస్తున్న వైనం చూసి సంస్థలో సిబ్బందే ఆశ్చర్యపోతున్నారు. శనివారం నగరంలో అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ స్థావరంలో ‘డ్వామా’ పేరుతో ప్లాస్టిక్ కవర్లు ఉండటంతో డ్వామా అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరం యజమాని, కంట్రాక్టరు అయిన శ్రీధర్ రెడ్డికి కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే కాంట్రాక్టరు మాత్రం ఆ ఛాయలకు రాలేదు. డ్వామా ఏపీడీ మాత్రం హాజరై విత్తనాల ప్యాకింగ్‌లో ఎలాంటి అక్రమాలు లేవని, అంతా సవ్యంగానే జరుగుతోందంటూ వాదించారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి ధ్రువీకరణ లేని ధాన్యాన్ని విత్తనాల కింద సరఫరా చేయడం అక్రమమే అని తేల్చి చెప్పారు. ఆ మేరకు అక్కడున్న ధాన్యాన్ని సీజ్ చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. సంబంధిత కాంట్రాక్టరుపై కేసు నమోదుకు సంబంధించి త్రీ టౌన్ ఎస్ఐ తమీమ్ అహ్మద్‌ని ‘సాక్షి’ సంప్రదించగా.. విత్తనాల ప్యాకింగ్ అంతా సవ్యంగానే జరుగుతోందని, అక్రమాలు లేవని డ్వామా ఏపీడీ వాంగ్మూలం ఇవ్వడంతో ఆ విషయాలనే ‘జనరల్ డైరీ’(జీడీ)లో నమోదు చేసుకున్నామని, ఫిర్యాదు లేక కేసు నమోదు చేయలేదని తెలిపారు. అసలు టెండర్లే పిలవలేదు : విత్తనాల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టరుతో డ్వామా కుదుర్చుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ కాపీ ఇవ్వాల్సిందిగా ‘సాక్షి’ సంబంధిత ఏపీడీని మంగళవారం కోరింది. అందుకు సంబంధించిన వివరాలు సాయంత్రం ఇస్తానన్న అధికారి, తీరా సాయంత్రం అసలు విషయం బయట పెట్టారు. విత్తనాల సరఫరాకు సంబంధించి తామేమీ టెండర్లు పిలవలేదని, ఇండెంట్‌పై నేరుగా సంబంధిత డీలర్ నుంచి ఒక్కో మినీ కిట్ రూ.350 చొప్పున 11 వేల మినికిట్స్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కిట్ రూ.350 చొప్పున 11 వేల కిట్లకు రూ.37.50 లక్షలు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపేటప్పుడు టెండర్ లేకుండా ఎలా చేశారని ప్రశ్నిస్తే.. డ్వామాలో ఇలా టెండర్లు లేకుండానే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందంటూ తన చర్యను సమర్థించుకున్నారు. అసలు విలువ : టెండర్ల విషయం అటుంచి.. వాస్తవంగా కాంట్రాక్టరు సరఫరా చేస్తున్న చిరుధాన్యాల విలువ ఎంత? అందుకు డ్వామా చెల్లిస్తోందెంత? అన్న వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగక మానవు. ప్రతి మినీ కిట్‌లో జొన్న, మొక్క జొన్న, సజ్జ, కొర్రలు అరకేజీ చొప్పున ఉంచి సరఫరా చేస్తున్నారు. ఈ చిరు ధాన్యాలు మార్కెట్ ధర కిలోకు.. జొన్న రూ.22, మొక్క జొన్న రూ.14, సజ్జ రూ.18, కొర్ర రూ.40 గా ఉన్నాయి. ఈ లెక్కన కాంట్రాక్టర్ మినీ కిట్‌లో ఉంచే నాలుగు రకాల ధాన్యం ధర రూ.47. సంచి, రవాణా ఖర్చులు మరో రూ.15 వేసుకున్నా మొత్తం ఖర్చు రూ.62. ఒక్కో కిట్‌పై వీరికి మిగిలేది రూ.288. 11వేల కిట్లకు రూ.31.68 లక్షలు. ఒక్క చిరుధాన్యాల సరఫరాలోనే రూ.31.68 లక్షలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందంటే.. ఇక మిగతా ‘డ్వామా’ పథకాల్లో ఎంత అవినీతి చోటు చేసుకుని ఉంటుందో అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతా సక్రమమేనంటూ వితండవాదం : ఈ విషయమై సంబంధిత ఏపీడీ నాగభూషణంను సంప్రదించగా.. విత్తనాల సరఫరాలో అక్రమాలు ఏమీ లేవని, మీరు సరైన అవగాహన లేక వార్త రాశారన్నారు. ఈ విషయమై తాము కలెక్టర్‌కు కూడా రెండు పేజీల వివరణ పంపుతున్నామని తెలిపారు. కలెక్టర్‌కు పంపిన నివేదిక ప్రతిని అడగ్గా దాన్ని యథాతథంగా ఇవ్వలేనని, కలెక్టర్‌కు పంపిన లేఖ సారాంశాన్ని తెలుగులో రాసి ‘సాక్షి’కి మెయిల్ చేశారు. తమకు విత్తనాలు సరఫరా చేసే కాంట్రాక్టరు లెసైన్సుడు విత్తన డీలర్ అని, లెసైన్సుడు డీలర్ తన గోడౌన్లో లూజు విత్తనాలను ప్యాకింగ్ చేయడంలో ఎలాంటి చట్ట వ్యతిరేకతకు పాల్పడలేదన్నారు. ఆ విత్తనాలను ధ్రువీకరణ లే ని విత్తనాలుగా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొనడం దురదృష్టకరమం టూ.. వారిపైనా తన కడుపు మంటను వెళ్లగక్కారు. ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేకుండా ప్యాక్ చేస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? రూ.37.50 లక్షల విలువైన పనిని టెండర్లు నిర్వహించకుడానే ఒక కాంట్రాక్టరుకు ఎందుకు కట్టబెట్టినట్లు? సప్లై కాంట్రాక్టరు నిబంధనల మేరకు సర్టిఫైడ్ సీడ్ కాకుండా మండీలో ధాన్యాన్ని చిన్న ప్యాకెట్లలో పెట్టి సరఫరా చేస్తే ఎందుకు ‘డ్వామా’ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నలకు ‘డ్వామా’ ఏపీడీ సమాధానం దాట వేయడం గమనార్హం.