డ్వామా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అక్రమార్కులను వెనకేసుకు రావడంలో డ్వామా అధికారులు బరితెగించారు. అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల పట్ల నిస్సంకోచంగా ‘రాజును మించిన రాజ భక్తి’ చాటుకుంటున్నారు. అసలు వీరు ప్రభుత్వ అధికారులా.. లేక ఆ రూపంలో ఉన్న కాంట్రాక్టర్లా అనిపించేలా వ్యవహరిస్తున్నారు.
దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థలో చిరుధాన్యాల మినీ కిట్స్ పంపిణీ తయారైంది. శనివారం నగరంలో నకిలీ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో కళ్లకు కట్టినట్లు అక్రమాలు బయటపడ్డా... సదరు కాంట్రాక్టరుపై ఈగ కూడా వాలకుండా డ్వామా ఏపీడీ పోలీసుల వద్ద కూడా వాంగ్మూలం ఇచ్చారంటే అక్రమార్కులు, అధికారుల మధ్య బంధం ఎంత గట్టిగా పెనవేసుకు పోయిందో అర్థమవుతోంది.
‘డ్వామా’లో విత్తనాల సరఫరాను పర్యవేక్షించే ఏపీడీ నాగభూషణం కాంట్రాక్టరును వెనకేసుకొస్తున్న వైనం చూసి సంస్థలో సిబ్బందే ఆశ్చర్యపోతున్నారు. శనివారం నగరంలో అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరంపై పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ స్థావరంలో ‘డ్వామా’ పేరుతో ప్లాస్టిక్ కవర్లు ఉండటంతో డ్వామా అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్రమ విత్తనాల ప్యాకింగ్ స్థావరం యజమాని, కంట్రాక్టరు అయిన శ్రీధర్ రెడ్డికి కూడా పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే కాంట్రాక్టరు మాత్రం ఆ ఛాయలకు రాలేదు. డ్వామా ఏపీడీ మాత్రం హాజరై విత్తనాల ప్యాకింగ్‌లో ఎలాంటి అక్రమాలు లేవని, అంతా సవ్యంగానే జరుగుతోందంటూ వాదించారు.
అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి ధ్రువీకరణ లేని ధాన్యాన్ని విత్తనాల కింద సరఫరా చేయడం అక్రమమే అని తేల్చి చెప్పారు. ఆ మేరకు అక్కడున్న ధాన్యాన్ని సీజ్ చేసి కలెక్టర్‌కు నివేదిక పంపారు. సంబంధిత కాంట్రాక్టరుపై కేసు నమోదుకు సంబంధించి త్రీ టౌన్ ఎస్‌ఐ తమీమ్ అహ్మద్‌ని ‘సాక్షి’ సంప్రదించగా.. విత్తనాల ప్యాకింగ్ అంతా సవ్యంగానే జరుగుతోందని, అక్రమాలు లేవని డ్వామా ఏపీడీ వాంగ్మూలం ఇవ్వడంతో ఆ విషయాలనే ‘జనరల్ డైరీ’(జీడీ)లో నమోదు చేసుకున్నామని, ఫిర్యాదు లేక కేసు నమోదు చేయలేదని తెలిపారు.
అసలు టెండర్లే పిలవలేదు : విత్తనాల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టరుతో డ్వామా కుదుర్చుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్ కాపీ ఇవ్వాల్సిందిగా ‘సాక్షి’ సంబంధిత ఏపీడీని మంగళవారం కోరింది. అందుకు సంబంధించిన వివరాలు సాయంత్రం ఇస్తానన్న అధికారి, తీరా సాయంత్రం అసలు విషయం బయట పెట్టారు. విత్తనాల సరఫరాకు సంబంధించి తామేమీ టెండర్లు పిలవలేదని, ఇండెంట్‌పై నేరుగా సంబంధిత డీలర్ నుంచి ఒక్కో మినీ కిట్ రూ.350 చొప్పున 11 వేల మినికిట్స్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కిట్ రూ.350 చొప్పున 11 వేల కిట్లకు రూ.37.50 లక్షలు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు జరిపేటప్పుడు టెండర్ లేకుండా ఎలా చేశారని ప్రశ్నిస్తే.. డ్వామాలో ఇలా టెండర్లు లేకుండానే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుందంటూ తన చర్యను సమర్థించుకున్నారు.
అసలు విలువ : టెండర్ల విషయం అటుంచి.. వాస్తవంగా కాంట్రాక్టరు సరఫరా చేస్తున్న చిరుధాన్యాల విలువ ఎంత? అందుకు డ్వామా చెల్లిస్తోందెంత? అన్న వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగక మానవు. ప్రతి మినీ కిట్‌లో జొన్న, మొక్క జొన్న, సజ్జ, కొర్రలు అరకేజీ చొప్పున ఉంచి సరఫరా చేస్తున్నారు.
ఈ చిరు ధాన్యాలు మార్కెట్ ధర కిలోకు.. జొన్న రూ.22, మొక్క జొన్న రూ.14, సజ్జ రూ.18, కొర్ర రూ.40 గా ఉన్నాయి. ఈ లెక్కన కాంట్రాక్టర్ మినీ కిట్‌లో ఉంచే నాలుగు రకాల ధాన్యం ధర రూ.47. సంచి, రవాణా ఖర్చులు మరో రూ.15 వేసుకున్నా మొత్తం ఖర్చు రూ.62. ఒక్కో కిట్‌పై వీరికి మిగిలేది రూ.288. 11వేల కిట్లకు రూ.31.68 లక్షలు. ఒక్క చిరుధాన్యాల సరఫరాలోనే రూ.31.68 లక్షలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందంటే.. ఇక మిగతా ‘డ్వామా’ పథకాల్లో ఎంత అవినీతి చోటు చేసుకుని ఉంటుందో అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అంతా సక్రమమేనంటూ వితండవాదం : ఈ విషయమై సంబంధిత ఏపీడీ నాగభూషణంను సంప్రదించగా.. విత్తనాల సరఫరాలో అక్రమాలు ఏమీ లేవని, మీరు సరైన అవగాహన లేక వార్త రాశారన్నారు. ఈ విషయమై తాము కలెక్టర్‌కు కూడా రెండు పేజీల వివరణ పంపుతున్నామని తెలిపారు. కలెక్టర్‌కు పంపిన నివేదిక ప్రతిని అడగ్గా దాన్ని యథాతథంగా ఇవ్వలేనని, కలెక్టర్‌కు పంపిన లేఖ సారాంశాన్ని తెలుగులో రాసి ‘సాక్షి’కి మెయిల్ చేశారు. తమకు విత్తనాలు సరఫరా చేసే కాంట్రాక్టరు లెసైన్సుడు విత్తన డీలర్ అని, లెసైన్సుడు డీలర్ తన గోడౌన్‌లో లూజు విత్తనాలను ప్యాకింగ్ చేయడంలో ఎలాంటి చట్ట వ్యతిరేకతకు పాల్పడలేదన్నారు. ఆ విత్తనాలను ధ్రువీకరణ లే ని విత్తనాలుగా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొనడం దురదృష్టకరమం టూ.. వారిపైనా తన కడుపు మంటను వెళ్లగక్కారు.
ప్రభుత్వ విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేకుండా ప్యాక్ చేస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? రూ.37.50 లక్షల విలువైన పనిని టెండర్లు నిర్వహించకుడానే ఒక కాంట్రాక్టరుకు ఎందుకు కట్టబెట్టినట్లు? సప్లై కాంట్రాక్టరు నిబంధనల మేరకు సర్టిఫైడ్ సీడ్ కాకుండా మండీలో ధాన్యాన్ని చిన్న ప్యాకెట్లలో పెట్టి సరఫరా చేస్తే ఎందుకు ‘డ్వామా’ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ ప్రశ్నలకు ‘డ్వామా’ ఏపీడీ సమాధానం దాట వేయడం గమనార్హం.