
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఈ ముగ్గురే కాదు ఇప్పు డు జిల్లా అధికార యంత్రాంగం అంతా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పలు రకాలైన ఉద్యోగ బాధ్యతలు చేస్తూ పనిఒత్తిడీ తప్పట్లేదు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. కింది స్థాయి ఉద్యోగి నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకూ, చివరకు తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకాధికారులుగా వచ్చిన ఐఏఎస్ అధికారుల వరకూ అందరూ ఏదోరకంగా పని, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నవారే. అంతేకాదు మూడు వారాలుగా సొంత కార్యాలయాలు, కుటుం బాలకు దూరంగా ఉన్న వారంతా పలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ పరిస్థితి ఒక్కోసారి విషమించి ప్రాణాల మీదకు వస్తోంది. తుపాను తాకిడితో జిల్లాలో 38 మండలాలు దెబ్బతి న్నాయి. వాటిలో ముఖ్యంగా టెక్కలి డివిజన్‌లోని ఉద్దానం ప్రాంతం మరింతగా కకావికలమైంది. తీరప్రాంత గ్రామాలు, గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతంలోని గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి.
దీంతో ఇక్కడ సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లాలోని వివిధ శాఖల నుంచి సిబ్బంది, అధికారులనే గాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అధికారులను రప్పించింది. అంతేకాదు 38 మంది సివిల్స్ సర్వీసు అధికారులను, 177 మంది డిప్యూటీ కలెక్టరు స్థాయి అధికారులను కూడా తీసుకొచ్చింది. వారంతా గత మూడు వారాలుగా తమకు కేటాయించినప్రాంతాల్లోనే సేవలందిస్తున్నారు. దసరా పండుగ విరామం కూడా లేదు. వచ్చే దీపావళి పండుగకు కూడా ఇంటికి వెళ్తారనీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, 15 మంది మంత్రులు, కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారులు సైతం స్థానికంగా ఉండటంతో మరీ ఒత్తిడి పెరుగుతోంది. దీనికితోడు ఎవరికి ఎప్పుడు కోపం వస్తే సస్పెన్షన్ చేస్తారేమోననే భయం ఎక్కువైంది. ఇదే సమయంలో తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఎక్కడా సరైన సౌకర్యాలు లేకపోవడం, దోమలు సమస్య పెరగడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తడం వంటివన్నీ ఉద్యోగుల్లో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలోనూ సెలవులు పెట్టుకునే అవకాశం ఇవ్వకపోవడం కూడా వారి సమస్యలను మరింత పెంచుతోంది.
అనారోగ్యం వెంట పరుగు...
జిల్లాలో ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. సారవకోట మండలంలో ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహించేందుకు వచ్చిన డిప్యూటీ కలెక్టర్ వెంకటేష్ ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. మరో ప్రత్యేకాధికారి పి.అరుణ్‌బాబు కూడా అనారోగ్యానికి గురై ఐదు రోజులపాటు వైద్య సేవలు తీసుకొన్నారు. మళ్లీ విధులకు హాజరయ్యారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పైడి అజయ్ అస్వస్థతకు గురై పలాస సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎచ్చెర్ల మండలంలోని ఇబ్రహీంబాద్‌కు చెందిన ఆయన గత 20 రోజులుగా పలాస మండలం బ్రాహ్మాణతర్ల గ్రామంలో సహాయకచర్యలలో ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో నలుగురు పంచాయతీ సెక్రటరీలు అనారోగ్యం పాలయ్యారు. విద్యుత్ శాఖకు సంబంధించి పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న సిబ్బంది, ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్నారు. పలాసలో ఒక ఏఈకి పాము కాటు వేయడంతో ఆసుపత్రిలో చేరారు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. ఇలాంటి సమస్యలు అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, సిబ్బందిలోనూ కనిపిస్తున్నాయి. చివరకు ఐఏఎస్ అధికారులు కూడా ఆహారం పడకపోవడం, వాతావరణ పరిస్థితులు తదితర కారణాలతో అనారోగ్యానికి గురవుతున్నారు.
సస్పెన్షన్లతో మరింత ఒత్తిడి...
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు తొలిసారి పర్యటించిన సందర్భంలో కవిటి ఎంపీడీఓ ఎస్.రామకష్ణ, ఎంఈఓ ధనుంజయ్ మజ్జిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాను పర్యటనకు వచ్చినప్పుడు స్థానికంగా అందుబాటులో లేరనే కారణంతో వారిపై ఈ చర్య తీసుకున్నారు. సోంపేట మేజర్ పంచాయతీ ఈవో జ్యోతీశ్వర్‌రెడ్డిని పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో విఫలమయ్యారనే కారణంతో సస్పెండ్ చేశారు. ఇదే మండలంలోని గొల్లగండి పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావు ప్రజలకు సహాయ సహాకారాలు అందించడంలో విఫలం చెందారని సస్పెండ్ చేశారు. నరసన్నపేట పంచాయతీ అధికారి మధుసూదన్‌ను కూడా పారిశుద్ధ్య నిర్వహణ విఫలమయ్యారనే కారణంతోనే సస్పెండ్ చేశారు.
మందసలో డెప్యుటేషన్‌పై విధులకు వచ్చిన రణస్థలం మండల పంచాయతీ కార్యదర్శి బేగమ్ కూడా సస్పెండ్ అయ్యారు. భామిని మండల వ్యవసాయాధికారి (ఏఓ) జి.మురళీకృష్ణను పంటల గణాంకాల విషయంలో తేడాలు ఉండటంతో విధుల నుంచి తప్పించారు. ఇంకా విద్యాశాఖలో ఇద్దరు ఎంఈఓలు, ఒక హెచ్‌ఎంను సస్పెండ్ చేశారు. ఇలా వేటు పడుతున్న అధికారులు, సిబ్బంది జాబితా ఇంకా ఉంది. టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యం, జన్మభూమి కమిటీల అనధికార పెత్తనం కూడా అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. మాట వినకపోతే ఫిర్యాదులు చేసిమరీ సస్పెండ్ చేయిస్తున్నారు. ఫలితంగా చాలామంది తప్పనిసరి పరిస్థితిలో తప్పులకు కారణమవుతున్నారు. ఇవి వెలుగుచూస్తే దాని ఫలితం అధికారులు, సిబ్బందిపైనే పడుతోంది. ఇదంతా మానసిక ఒత్తిళ్లకు దారితీస్తోంది. ఉద్యానవన శాఖలో 13 జిల్లాల నుంచి హెచ్‌ఓలను, ఎంపీఈఓలను తుఫాను విధులకు ప్రభుత్వం నియమిస్తే, ఇక్కడి విపత్కర పరిస్థితుల్లో తాము పనిచేయలేమని రెండుమూడు రోజుల్లోనే వెనుదిరగడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment