తాండూరు, న్యూస్‌లైన్: పేద వృద్ధులకు భరోసా.. పింఛన్. చాలా మంది నెలవారీ ఖర్చులకు దానిపైనే ఆధారపడతారు. బీపీ, షుగర్ మాత్రలు వాటితోనే కొనుక్కుంటారు. ఉన్నట్టుండి అది ఆగిపోవడంతో వృద్ధులు కలవరానికి గురవుతున్నారు. మా పింఛన్ ఎందుకు తీసేశారంటూ నిలదీసేందుకు వారంతా బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయానికి వెల్లువలా వచ్చారు. పింఛన్లు కావాలంటే ధ్రువపత్రాలు సమర్పించాలని మెలిక పెట్టడమే ఈ గందరగోళానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.
తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతినెలా సుమారు 5,804 మంది పింఛన్ తీసుకుంటారు. అందులో 3,553 మంది వృద్ధులు కాగా 461 వికలాంగులు. మరో 1,790 వితంతు పింఛన్లు కూడా ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి నెల రూ.12లక్షలు పింఛన్ల రూపంలో పంపిణీ అయ్యేవి. అయితే ఈ 5,804 మంది పింఛన్‌దారుల్లో ప్రస్తుతం 1,600మందికి మాత్రమే బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ అవుతున్నాయి. ఇక మిగిలిన 4,204 మంది పింఛన్లకు బ్రేక్ పడింది.
‘లింకు’లే ముంచాయా?
పింఛన్‌దారుల పూర్తి వివరాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డుతోపాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు కావాలని డీఆర్‌డీఏ పెట్టిన మెలిక కారణంగా మున్సిపాలిటీలో చాలా మంది వృద్ధుల పింఛన్లకు కోత పడింది. నెలలుగా బ్యాంకులు, మున్సిపాలిటీల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు రేపుమాపు.. అని కాలయాపన చేయడంతో మూడు నెలలుగా పింఛన్లు రావడం లేదని వృద్ధులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కార్యాలయంలో నిర్వహించిన ఐడెంటిఫికేషన్ క్యాంపులో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇతర ఆధారాలను సమర్పించిన వారికి కూడా పింఛన్లు నిలిచిపోయాయి. చాలా మంది వికలాంగులు తమకు ఎందుకు పింఛన్లు నిలిచిపోయాయో తెలుసుకునేందుకు బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. నిలబడే ఓపిక లేక వృద్ధులు, నడిచే వీలులేక వికలాంగులు కార్యాలయం బయట అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నెలనెలా వచ్చే రూ.200 పింఛనే ఆధారమని, అది కూడా తీసేస్తే ఎలా బతికేదని తుల్జమ్మ అనే వృద్ధురాలు వాపోయింది.
పండుటాకుల పింఛన్ గోస
Published Thu, Oct 31 2013 12:52 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement