
బాబోయ్..డీఎస్సీ
టెట్ కమ్ టీఆర్‌టీ (టీచర్ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి బాబు మార్కు కొర్రీలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో చేసిన మాటల గారడీలో భాగంగా రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలను వంచించిన విధంగానే నిరుద్యోగ యువతతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అభ్యర్థులు వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది..
నెల్లూరు(విద్య) : జిల్లాలో 416 పోస్టులను టెట్, టీఆర్‌టీ (టీచర్ అర్హత పరీక్ష) నోటిఫికేషన్‌లో చూపారు. ఆర్థిక శాఖ ఆమోదం సాకుతో 20 శాతం కుదించారు. ప్రస్తుతం ఉన్న 333 పోస్టుల కు 6వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రతి అభ్యర్థి అర్హత పరీక్ష ఫీజుగా రూ.250 చెల్లించాలి. 6వేల మందికి సుమారు రూ.15 లక్షలు ఒక్క జి ల్లా నుంచే ఖజానాకు రాబడి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 9,061 పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 15 లక్షల మంది నిరుద్యోగులు రూ.250 చొప్పున ప్రభుత్వ ఖజానా నింపేం దుకు తమవంతు బాధ్యతను తమకు తెలియకుండానే భుజాలపైకి ఎత్తుకున్నారు.
నిరుద్యోగులతో చెలగాటం
పరీక్ష రుసుం రూ.250 బ్యాంక్‌లో చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్నెట్ సెం టర్‌లో రూ.30 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. జెరాక్స్ కాపీలకు రూ.20 నుంచి రూ.50 ఖర్చవుతోంది. రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు జెరాక్స్ పత్రాలను విద్యాశాఖకు అందజేసేందుకు రూ.35 నుంచి రూ.50 వెచ్చించాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాల నుంచి నిరుద్యోగులు నెల్లూరుకు చేరుకునేందుకు రూ.100 నుంచి రూ.150 ఖర్చవుతోంది.
ఒక్కో అభ్యర్థి సగటున రూ.400 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలను వారు తప్పుపడుతున్నారు. కాంపిటేటివ్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే ధ్రువపత్రాల జెరాక్స్‌లను అం దజేసే ప్రక్రియ ఎక్కడా లేదని వారు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. దరఖాస్తులను అందజేసేందుకు గర్భిణులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు.
స్పష్టతలేని నోటిఫికేషన్
అర్హత పరీక్షకు వెలువడిన నోటిఫికేషన్‌లో బీఎస్సీ, బీకాం, ఓపెన్ యూనివర్సిటీ, భాషాపండితులు, ఇంటర్ తత్సమాన అర్హత తదితర అం శాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ నెల 16న ముగిసే ఆన్‌లైన్ చెల్లింపుల గడువును బుధవారం వరకు పొడిగించారు. ధ్రువీకరణ పత్రాల స్వీకరణకు ఫిబ్రవరి 5 వరకు నిర్ణయించారు.
సెలవులు రావడంతో గడువు తేదీలను పొడిగించామని ప్ర భుత్వం చెప్పుకుంటోంది. వాస్తవానికి నిరుద్యోగుల నుంచి మరింత సొమ్ము చేసుకునేందుకు ఈ గడువు పనికొస్తుందని అభ్యర్థులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉన్న పోస్టులకు రెండిం తలు, మూడింతలు అభ్యర్థులు దరఖాస్తులు చే సుకోవడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.
విధులకు దూరంగా...
ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు అప్‌లోడ్ చేసిన తర్వాత వాటి ప్రతులను విద్యాశాఖకు అందజేసే క్రమం లో ఉపాధ్యాయ సిబ్బంది డిసెంబర్ నుంచి సా ధారణ విధులకు దూరమయ్యారు. కలెక్షన్ కమిటీలో డిప్యూటీ ఈఓ, ఏడీస్థాయి, గెజిటెడ్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సుమారు 50 మంది ఫిబ్రవరి 5 తేదీ వరకు సాధారణ విధులకు హా జరయ్యే పరిస్థితి లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత జెరాక్స్ కాపీలను స్వీకరిం చడం అర్థంలేని పని.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లోనే వస్తాయనేది సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయం. ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించి భారీ స్థాయిలో సి బ్బందిని దరఖాస్తుల స్వీకరణకు నియమించడం ఎంతవరకు సమంజసమని పలువురు చర్చించుకుంటున్నారు.
పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాఠశాల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తుల స్వీకరణలో నిమగ్నమవడం విద్యార్థులకు తీరని నష్టమని వారి తల్లిదండ్రులు అంటున్నారు.ఇలా సాధ్యం కాని హామీల్లో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఇన్ని అవకతవకల మధ్య డీఎస్సీకి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నిర్వహణ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
డీఎస్సీ దరఖాస్తు పాట్లు
నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో టెట్ కమ్ టీఆర్‌టీ దరఖాస్తుల జెరాక్స్ పత్రాలను అందజేసేందుకు జిల్లావ్యాప్తంగా వచ్చే అభ్యర్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, దరఖాస్తులు ఇచ్చేందుకు చాలాసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వరకు 7,110 దరఖాస్తులు స్వీకరించారు.