అమ్మో.. వడ్డీ బకారుసులు..! | OMG .. .. Interest devils! | Sakshi
Sakshi News home page

అమ్మో.. వడ్డీ బకారుసులు..!

Published Mon, Jun 29 2015 4:23 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

OMG .. .. Interest devils!

‘తీసుకున్న అప్పు రూ. 12లక్షలు.. చెల్లించిన వడ్డీ రూ. 18లక్షలు.. అసలు తీరలేదు సరికదా వడ్డీ కూడా పూర్తికాలేదు.. వడ్డీ బకాసురుడి వేధింపులు అధికం కావడంతో బాధిత కుటుంబం జిల్లా ఎస్పీని ఆశ్రయించాల్సి వచ్చింది’.     
- ఎమ్మిగనూరు
 
 అప్పు పెనుముప్పుగా మారి ప్రాణాలనే హరించే వరకు వ స్తోంది.. ఏకంగా కుటుంబాలనే బలికొంటోంది. అవసరానికి అప్పే గాని దానినే వ్యాపారంగా మలుచుకొని ఎమ్మిగనూరులో వడ్డీ బకాసురులు చెలరేగిపోతున్నారు. రోజు వడ్డీ, వారం వడ్డీ, పక్షం, నెల వడ్డీల పేరుతో అనధికారిక ఫైనాన్స్ దుకాణాలు తెరిచి రెండు చేతులా సంపాదిస్తున్నారు. రూ. 100కి రూ. 9 మొదలు రూ. 30 వరకు వడ్డీ చొప్పున వసూలు చేస్తూ చిరుద్యోగులు, వ్యాపారుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. ప్రశాంతతకు, అభివృద్ధికి ఆనవాళ్లుగా మారిన ఎమ్మిగనూరులో మూడేళ్లుగా ఈ వ్యాపారం జోర ందుకుంది. గీతానగర్‌కు చెందిన ఓ వ్యాపారి వాల్మీకి విగ్రహం వద్ద ఉన్న ఓ ఎరువుల దుకాణం అధినేత నుంచి రూ. 12లక్షల అప్పు తీసుకున్నాడు.

దినసరి వడ్డీ చెల్లింపు కింద ఇప్పటి వరకు రూ. 18లక్షలు చెల్లించాడు. అసలు అలాగే ఉంది. వడ్డీ కూడా తీరలేదు. ఇదేమంటే రోజు వారి వడ్డీయే నూటికి రూ. 9 అని తీరిగ్గా చెబుతున్నారు. అన్న చేసిన అప్పు తీరలేదని తమ్ముడి చేత కూడా ప్రో నోటు రాయించుకోవడం మరీ విడ్డూరం. వడ్డీ పేరుతో అటు అన్నను ఇటు తమ్ముడిని నిత్యం వేధిస్తుండడంతో చివరకు బాధితుడు భార్యాపిల్లలతో సహా తమ మృతికి సాయిరాం ట్రేడర్స్‌కు చెందిన వ్యక్తే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి అఘాయిత్యానికి ప్రయత్నించగా అయినవారు వారించడంతో ప్రాణాలు నిలిచాయి.

 అధికార పార్టీ నుంచి వత్తాసు..
 నాలుగు రోజుల క్రితం బాధితుడు ఎస్పీ వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఎస్పీ ఆదేశాలు ఎమ్మిగనూరు పోలీసులకు చేరకముందే అధికార పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడి ఫోన్ కాల్ మోగింది. ఆ వడ్డీ వ్యాపారి ‘మాకులపోడే’నని, చూసీ చూడనట్లు వెళ్లం డంటూ హుకూం. ఇక పోలీసులు చేసేదేమిలేక దర్యాప్తు కొనసాగింపు అంటూ కేసు నమోదు చేయకుండానే అలా ముందుకెళుతున్నారు.

 ఒకరా.. ఇద్దరా..
 నాగమణి బాధితులు, పంచలోహ బుద్ధ విగ్రహ వ్యాపారులు, జీరోలో సెల్ వ్యాపారం చేసే వ్యక్తులు, ఎరువుల వ్యాపారులు.. ఇలా చాలా మంది ఆ వడ్డీ బకాసురుడి నుంచి సుమారు రూ. 1.5 కోట్ల వరకు అప్పు తీసుకుని వడ్డీ చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ప్రతి రోజు వడ్డీ రూపంలోనే ఆ వ్యాపారికి రూ. 4.5లక్షలు వసూలవుతుందంటే పరిస్థితి అర్థమవుతుంది. ఇతడితో పాటు మరో ముగ్గురు కీలక వ్యక్తులున్నారు.

ఆటో - మినీ లారీ యూనియన్ ప్రతినిధిగా చెప్పుకుంటూ తనకు తానే సోకాల్డ్ రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి ఇంటి వద్దే అధిక వడ్డీలతో దర్బార్ నడుపుతున్నాడు. మరో వ్యక్తి స్థానిక వీవర్స్‌కాలనీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉండగా, ఇంకో వ్యక్తి ఎమ్మిగనూరుకు చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్‌కు దందాలు చేసిన చోటా వ్యాపారి. వీరితో పాటు పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై జిల్లా పోలీసులు, నిఘా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది.

 అధిక వడ్డీలతో అఘాయిత్యాలు..
  గత ఏడాది ఓ ఎరువుల వ్యాపారి, ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన పైపుల వ్యాపారి, ఓ పాల వ్యాపారి, ఓ మాంసపు వ్యాపారి అధిక వడ్డీలకు బలవన్మరణం పొందినవారే. రామచంద్రా ఎంపోరియంకు చెందిన రవిప్రసాద్ రూ. 5.6 కోట్లు, ఆయిల్ డిగర్ వ్యాపారి అతావుల్లా రూ. 2.8 కోట్లకు ఇప్పటికే ఐపీ దాఖలు చేశారు. మరో నలుగురు వ్యాపారులు పరారిలో ఉండి ఐపీ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి  పట్టణ ఎస్‌ఐ శంకరయ్యను వివరణ కోరగా గీతానగర్ వాసి రాజు ఎస్పీని ఆశ్రయించి సాయిరాం ట్రేడర్స్ ప్రసాద్‌పై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేయలేదని, విచారిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement