high interest
-
వడ్డీ ఆశచూపి.. నట్టేట ముంచి..
బంజారాహిల్స్: వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకుని మోసం చేసిన మహిళపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–14లోని శ్రీ వేంకటేశ్వరనగర్ బస్తీలో కొడాలి శ్రీలక్ష్మి అనే మహిళ 15 ఏళ్లుగా అద్దెకు ఉంటూ స్థానికంగా నమ్మకంగా ఉంటోంది. వడ్డీలు ఇస్తానంటూ పలువురి నుంచి డబ్బులు తీసుకునేది. మొదటి రెండు నెలలు వడ్డీ సక్రమంగా ఇచ్చి ఇతరులకు ఆశ లు పెంచేది. దీంతో చాలామంది వడ్డీ వస్తుందనే ఆశతో డబ్బులు ఇచ్చేవారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీలక్ష్మీ ఇదే ఆస్పత్రిలో పనిచేస్తున్న చాలామందిని సైతం మోసం చేసింది. తన కొడుకు ఫీజు చెల్లించాలంటూ వట్టికొండ రంగనాథ్ నుంచి రూ.4.75 లక్షలు అప్పుగా తీసుకుని ప్రాంసరీ నోట్ రాసిచి్చంది. అయితే ఏళ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోగా భర్త సత్యప్రకాశ్‌తో కలిసి బెదిరింపులకు పాల్పడేది. వీరికి ఇంటి యజమానురాలు పద్మ కూడా వంతపాడేది. డబ్బులు ఇచి్చన వారు ఇంటికి వస్తే పద్మ వారిని బెదిరింపులకు గురిచేసేది. బస్తీతో పాటు బసవతారకం ఆస్పత్రి ఉద్యోగుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి బిచాన ఎత్తేసింది. మోసపోయామని గ్రహించిన సుమారు 50 మంది బాధితులు ఆధారాలతో సహా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారు శ్రీలక్ష్మీతో పాటు ఆమె భర్త సత్యప్రసాద్, ఇంటి యజమానురాలు పద్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుడ్‌న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు
Amrit Kalash Deposit Scheme Deadline Extended: కష్టపడి పోగుచేసుకున్న సొమ్మును భద్రపరచుకునేందుకు ఉత్తమమైన మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అయితే వడ్డీ రేట్లు పొదుపుచేసే కాలానికి (టెన్యూర్) అనుగుణంగా ఉంటాయి. అలాగే సాధారణ ప్రజలు, మహిళలు, సీనియర్ సిటిజెన్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వడ్డీ రేటుతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అత్యధిక వడ్డీని ఇచ్చే ‘అమృత్ కలశ్’ (Amrit Kalash) స్కీమును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని నెలల క్రితం ప్రకటించింది. ప్రత్యేక పథకం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ప్రత్యేక అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని మరోసారి పొడిగించింది. సాధారణ ప్రజలు, సీనియర్ సిటిజన్లకు అందించే అన్ని రకాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లోనూ అత్యధిక వడ్డీని అందించే పథకం ఇదే. ఎస్బీఐ అమృత్ కలశ్ అనేది 400 రోజుల ప్రత్యేక టెన్యూర్ స్కీమ్. ఈ పథకం 2023 ఏప్రిల్ 12 నుంచి అమలవుతోంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తుంది. గత ఫిబ్రవరి 15న అధికారింగా లాంచ్ అయిన ఈ స్పెషల్ స్కీమ్ గడువును ఎస్బీఐ పలుసార్లు పెంచుతూ వచ్చింది. ఆగస్ట్ 15వ తేదీతోనే గడువు ముగిసినప్పటికీ తాజాగా మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచుతున్నట్లు బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి: శ్రావణమాస వేళ శుభవార్త: తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి -
ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి!
సీనియర్ సిటిజన్ల పొదుపునకు సంబంధించి ఓ అద్భుతమైన పథకం ఉంది. దాని పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. దీని కింద సంవత్సరానికి 8 శాతం వడ్డీ లభిస్తుంది. మదుపు సొమ్ము 5 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు . అయితే దీనిపై అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ పథకంలో రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు వడ్డీ కింద నెలకు రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఒక వేళ భార్యాభర్తలిద్దరూ కలిపి డిపాజిట్ చేస్తే నెలకు రూ. 40,000 వరకు రాబడి లభిస్తుంది. వడ్డీ రేటు మరింత పెరిగేనా? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం మరింత పెంచవచ్చని సీనియర్ సిటిజన్లు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా జరగనున్న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల తదుపరి సవరణను దృష్టిలో ఉంచుకుని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే డిసెంబర్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును మార్చింది. ప్రస్తుతం ఇది 8 శాతంగా ఉంది. అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు మరింత పెరిగే అవకాశం లేదని ఎస్ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా చెబుతున్నారు. మై ఫండ్ బజార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో వినిత్ ఖండారే కూడా ఈ వడ్డీ రేటు మరింత పెంచే అవకాశం లేదన్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ దిగుబడిలో పెరుగుదల కారణంగా ప్రభుత్వం స్వల్పకాలిక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును పెంచవచ్చని భావిస్తున్నప్పటికీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ఇటీవలే సవరించిన నేపథ్యంలో మరో సారి సవరణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
రూ.100కి 20 రూపాయల వడ్డీ.. దిక్కుతోచని స్థితిలో..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): క్రికెట్ బెట్టింగ్ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. చేసిన అప్పులకు వందకు రూ.20 వడ్డీ చెల్లించలేక ఏం చేయాలో పాలుపోని ఆ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద జరిగింది. ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చదవండి: కూర విషయంలో భార్యతో గొడవ.. స్నేహితుడి ఇంటికి వచ్చి.. పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్ సొరంగం సమీపంలోని కటికల మస్తాన్ వీధికి చెందిన జొన్నలగడ్డ బాలస్వాతి, శ్రీనివాసరావు(42) భార్యాభర్తలు. వీరికి అన్నపూర్ణ, అజయ్‌కుమార్ సంతానం. శ్రీనివాసరావు పెయింటింగ్ పని చేస్తూ క్రికెట్ బెట్టింగులు ఆడుతుంటాడు. బాలస్వాతి పంజా సెంటర్లో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంటుంది. గత కొద్ది రోజులుగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాసరావుకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. వందకు రూ.20 చొప్పున వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో అర్ధం కాక మానసికంగా కుంగిపోయాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ హుక్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తండ్రిని చూసి భయంతో కేకలు వేశారు. వెంటనే తేరుకుని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శుక్రవారం ఉదయం మృతుని నివాసానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. -
తిరుపతి వ్యాపారి రమేశ్ కేసులో కదులుతోన్న డొంక
-
నిండా ముంచేశాడు..!
తొలుత అతనో కానిస్టేబుల్.. ఆపై మరొకరితో పరీక్ష రాయించి ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు.. ఆ మోసం బయటపడడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.. అనంతరం కొందరి సహకారంతో అధిక వడ్డీ ఆశచూపి వసూళ్ల పర్వానికి తెరలేపాడు.. మొదట నమ్మకంగా వ్యవహరించి ఆపై అందినకాడికి దోచుకున్నాడు.. ఇదీ.. ఐపీ దాఖలు చేసిన నకిలీ ఎస్ఐ ఘరానా మోసం. చిలుకూరు (కోదాడ): చిలుకూరు మండలం పాత కొండాపురం గ్రామానికి చెందిన శ్రీరాం చిన గోపాల కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటు వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఇతను తొలుత కానిస్టేబుల్. 2009లో ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. అ తరువాత పైలటింగ్‌లో ఎస్ఐ ఉద్యోగం సాధించినట్లుగా ఆధారాలు లభ్యకావడంతో అతన్ని 2013 ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతోంది.కాగా అనాటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు వడ్డీలకు డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు ఇస్తామని ఆయన బంధువులను, స్నేహితులను పూర్తిగా నమ్మిం చాడు. ప్రారంభంలో డబ్బులు తీసుకుని సక్రమంగా ఇవ్వడంతో అతనిపై పూర్తి స్థాయిలో నమ్మకం కలిగింది. దీనిని ఆసరగా చేసుకుని చిలుకూరు మండలంలోని పాత, కొత్త కొండాపురం గ్రామాలు, రామాపురం, పోలేనిగూడెం, బేతవోలు, హుజూర్నగర్ గ్రామాల పరిధిలో, హైదరాబాద్‌లో తన బంధువుల వద్ద నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం, లిక్కర్ బిజినెస్, ఇళ్లు కట్టించి అమ్మడం లాంటి బిజినెస్‌లు చేస్తున్నారని నిమ్మించి వారి వద్ద నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తీసుకున్నాడు. రూ. 7.50 కోట్లుకు ఐపీ దాఖలు డబ్బులు తీసుకొన్న వారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో అతని 43 మందికి రూ.7.50 కోట్లుకు ఐపీ దాఖలు చేశాడు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు 43 మంది రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఆరుగురి అరెస్ట్ బాధితుల ఫిర్యాదు మేరకు ఖాకీలు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూత్రధారి శ్రీరాం చిన గోపాల్కృష్ణతో సహా అతడికి సహకిరం అందించిన చిలుకూరు మండలం కొండా పురం గ్రామానికి చెందిన పిల్లుట్ల వెంకటి, నారా యణపురం గ్రామానికి చెందిన తిప్పన నరసింహారావు, కీతవారిగూడెం గ్రామానికి చెందిన కీత వెంకటరమణ, పెన్‌పహాడ్ మండలానికి చెందిన యర్రంశెట్టి సతీష్, నూనవత్ అశోక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు తెలిసింది. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తన్వీ క్రియేషన్స్ పేరుతో.. తన్వీ క్రియేషన్స్ పేరుతో మల్క్పేట, హైదరాబాద్‌లో ఒక కార్యలయంలో ప్రారంబించా డు. ఈ పేరుతో ఉద్యగాలు ఇప్పిస్తామని, డబ్బులు పెట్టుబడులు పెడితే రిటన్స్ మంచి లాభాలు ఉన్నాయని నమ్మించాడు. ప్రారంభంలో డబ్బులు ఇచ్చిన వారికి లాభాలు అధిక మొత్తంలో ఇచ్చాడు. దీంతో అతనిపై నమ్మకం పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని ఆయా గ్రామాల వారి బంధువులు, స్నేహితుల వద్ద నుంచి రూ.50 కోట్ల వరకు వడ్డీకి డబ్బులు తీసుకొన్నట్లుగా తెలసింది. వీరిలో సుమారుగా ఆయా గ్రామాల్లో 150 నుంచి 200 మంది వరకు బాధితులు ఉన్నట్లుగా తెలిసింది. -
చీరాల.. ఐపీ ఖిల్లా
► పక్కాగా నమ్మించి డబ్బు తీసుకుని మోసం ► రూ.7 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఓ ఫైనాన్స్ వ్యాపారి ► వడ్డీలకు ఆశపడి అసలు కూడా నష్టపోతున్న అభాగ్యులు చీరాల : చీరాల పట్టణం మోసాలకు అడ్డాగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు రకరకాల మోసాలు. మోసపోయేవాళ్లు ఉండాలేగానీ మోసం చేయడానికి మాత్రం ఇక్కడ కోకొల్లలుగా ఉంటారు. కాకపోతే.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ప్రస్తుతం చీరాల్లో ఐపీ మోసాలు కొనసాగుతున్నాయి. ఐపీలు పెట్టేవారు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారం కోసం అప్పులు తెస్తారు. చాలామంది వ్యాపారులు, చిరువ్యాపారులు దాచుకున్న డబ్బు బ్యాంకుల్లో వేసుకుంటే వడ్డీ తక్కువ వస్తుందని భావించి ఎక్కువ వడ్డీ కోసం ఆశపడి అడిగిందే తడవుగా మోసగాళ్లకు అప్పులిస్తారు. కొన్ని రోజులు నమ్మకంగా వడ్డీలు చెల్లించే మోసగాళ్లు.. ఎక్కువ మంది వద్ద కోట్లాది రూపాయలు అప్పు చేసి చివరకు ఐపీ పేరుతో అప్పులిచ్చిన వారికి కుచ్చుటోపీ పెడతారు. వడ్డీ సంగతి అలా ఉంచితే.. చివరకు అసలు కూడా కోల్పోయి అప్పులిచ్చిన వారు రోడ్డున పడతారు. ఈ తరహా మోసాలు ప్రస్తుతం చీరాల్లో అధికంగా జరుగుతున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం పేరుతో దగా... స్థానిక ఎంజీసీ మార్కెట్లో ఒక వ్యక్తి దశాబ్ద కాలంగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా వ్యాపారం చేస్తుండటంతో స్థానిక వ్యాపారులతో పాటు పట్టణంలోని మధ్యతరగతి కుటుంబాల వారు సైతం అడిగిందే తడవుగా అతనికి అప్పులిచ్చారు. అలాగే నోట్ల రద్దు సమయంలో ఎక్కువ మొత్తంలో వ్యాపారులు ఫైనాన్స్ రూపంలో ఇచ్చేశారు. జనం వద్ద రూ.100కి రూ.2 చొప్పున వడ్డీకి తీసుకుని అతను మాత్రం ఇతరులకు రూ.100కి రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీకి ఇచ్చి వసూలు చేసేవాడు. తనవద్ద అప్పు తీసుకున్న వారు ఎవరైనా సకాలంలో డబ్బు చెల్లించకుంటే అంతే సంగతులు. తనవద్ద ఉండే యువకులను పంపి బెదిరించి భయపెట్టి వసూలు చేసేవాడు. అలా కోట్లలోనే వడ్డీలకు తిప్పేవాడు. ఫైనాన్స్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. అయితే ఏమైందోఏమోగానీ కొద్దిరోజుల క్రితం ఏకంగా రూ.7 కోట్లకు ఎగనామం పెట్టి కనిపించకుండా పోయాడు. దీంతో అతనికి అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. బాగా సంపాదించాడు కదా తాము ఇచ్చిన డబ్బులో అసలైనా వస్తాయని ఆశించారు. కానీ, అప్పులిచ్చిన వారికి కొద్దిరోజులకు ఐపీ నోటీసులు ఇంటికి పంపాడు. మొత్తం రూ.7 కోట్లకుగానూ రూ.5 కోట్లకు ఐపీ నోటీసులు పంపినట్లు సమాచారం. కొద్దిరోజులు మొహం చాటేసిన ఆ ఫైనాన్స్ వ్యాపారి.. ఐపీ నోటీసులు ఇచ్చిన తరువాత మరలా చీరాల వచ్చి తనకు రావాల్సిన బకాయిలను దర్జాగా వసూలు చేసుకుంటున్నాడు. అయితే ఈ ఫైనాన్స్ వ్యాపారి జనం సొమ్మును కొంత దాచిపెట్టడంతో పాటు మరికొంత సొమ్ముతో తన తనయుడితో వ్యాపారం చేసుకునేందుకు వచ్చినట్లు సమాచారం. అంటే జనం సొమ్ముతో జల్సా అన్నమాట. మోసగాళ్లు ఎంతో మంది... నమ్మించి అప్పుచేయడం.. ఆ తరువాత కోట్లకు ఐపీలు పెట్టి మోసం చేయడం. చీరాల్లో చాలామందికి ఇది పరిపాటిగా మారింది. ప్రస్తుతం పట్టణంలోని ఒక వస్త్రవ్యాపారి తనయుడు ఒక ప్రైవేట్ వైద్యశాలలో వాటాదారుడిగా ఉండి రూ.3 కోట్లకుపైగా ఐపీ పెట్టినట్లు సమాచారం. సదరు వ్యాపారి కొద్దిరోజులుగా చీరాలలో కనిపించకుండా వేరే ప్రాతంలో తిరుగుతున్నట్లు సమాచారం. అప్పులిచ్చిన వ్యక్తులు అతని కోసం తిరుగుతున్నారు. అలాగే గొల్లపాలేనికి చెందిన వస్త్రవ్యాపారి కూడా కొద్దిరోజుల క్రితం రాత్రికిరాత్రే తన దుకాణంలోని వస్త్రాలను బయటకు పంపి దుకాణం మూసేశాడు. సదరు వ్యాపారి అప్పులిచ్చిన వారికి రూ.2 కోట్లకు ఎగనామం పెట్టేశాడు. కేవలం ఎక్కువ వడ్డీ వస్తుందని అశపడిన చాలామంది జనం చీరాల్లో ఐపీల బారినపడి చివరకు రోడ్డున పడుతున్నారు. రోడ్డున పడిన బాధితులు... ఐపీ పెట్టిన ఫైనాన్స్ వ్యాపారికి కొంతమంది వస్త్రవ్యాపారులు అప్పులివ్వగా చాలామంది మాత్రం చిరువ్యాపారులు, మధ్య తరగతి వారు ఉన్నారు. ముంతావారిసెంటర్లో రోడ్ల పక్కన హోటళ్లు, ఇతర చిరువ్యాపారులు చేసేవారు తీవ్రంగా మోసపోయారు. ఒకరు తన కూతురు వివాహం కోసం అక్కరకు వస్తాయని ఆశించి ఇచ్చిన డబ్బును మోసపోయారు. బ్యాంకులో ఇస్తే రూపాయి కూడా వడ్డీ రాదని భావించి రూ.2 వడ్డీకి ఫైనాన్స్ వ్యాపారికి ఇచ్చి అన్యాయమయ్యారు. ఐపీ నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు. వడ్డీవద్దు.. అసలైనా ఇప్పించండని వేడుకుంటున్నారు. -
రూ.26 కోట్లకు కుచ్చుటోపీ
– వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం – భర్త అదృశ్యంపై భార్య అనుమానాలు – ఫిర్యాదు తీసుకునేందుకు కోడుమూరు పోలీసుల నిరాకరణ కోడుమూరు: మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడి కుమారుడు దాదాపు రూ.26 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు, రైతులు ఇలా ఎవ్వరినీ వదలకుండా అధిక వడ్డీ ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షల్లో అప్పు తీసుకుని కన్పించకుండా పోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వర్కూరు గ్రామంలోనే దాదాపు రూ.3 కోట్లు అప్పులిచ్చినట్లు తెలిసింది. ఇంతటి ఘరానా మోసం వెలుగులోకి రావడంతో మండలంలో సంచలనమైంది. అప్పులు చేసి పరారైన వ్యక్తి పదేళ్ల నుంచి కర్నూలులో నివాసముంటున్నాడు. తండ్రి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాడు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన నగదుతో సదరు వ్యక్తి కర్నూలులో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్లుగా ఆ వ్యక్తి విచ్చలవిడిగా అప్పులు చేసినట్లు బంధువులు తెలియజేస్తున్నారు. ఇటీవల చెడు వ్యసనాలకు అలవాటు పడటంతోనే విచ్చలవిడిగా అప్పులు చేసినట్లు తెలిసింది. ఆందోళనల్లో అప్పులిచ్చినోళ్లు.. అప్పులు తీసుకుని వ్యక్తి పరారు కావడంతో అప్పులిచ్చినోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కొక్కరూ రూ.60 లక్షలు, రూ.70 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వడ్డీలకిచ్చారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇవ్వకపోయినా పరవాలేదు కానీ, తమ పేర్లు బయటికి చెప్పొద్దంటూ సదరు వ్యక్తి బంధువుల వద్ద బాధితులు ప్రాధేయపడుతున్నట్లు తెలిసింది. భారీ ఎత్తున వడ్డీలకు ఇచ్చినట్లు బయటపడితే ఇన్‌కమ్‌ట్యాక్స్ అ«ధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయని వారంతా ఆందోళన చెందుతున్నారు. వ్యక్తి అదృశ్యంపై అనుమానాలు రూ.26 కోట్లు అప్పులు ఉన్నట్లు సదరు వ్యక్తి బంధువులే ఇటీవల లెక్కలు వేశారు. పరారైన వ్యక్తి బంధువులు ఇళ్లకు తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఆ వ్యక్తి అదృశ్యంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా లెక్కకట్టి తిరిగిస్తానని అప్పున్న వ్యక్తి ఫోన్ చేయడంతో రిటైర్ట్ ప్రధానోపాధ్యాయుడి కుమారుడు కర్నూలు కొత్తబస్టాండ్‌లో పార్కింగ్ స్థలంలో ద్విచక్ర వాహనాన్ని పెట్టి వెళ్లాడు. అప్పటి నుంచి కన్పించడంలేదని బంధువులు తెలియజేస్తున్నారు. అప్పులు చేసి పరారైన వ్యక్తి భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా, అప్పులు తీసుకున్న వారి నుంచి ఏదైనా ముప్పు వాటిల్లిందా, కోట్లకు కోట్లు ఎందుకు అప్పులు చేశాడు, తీసుకున్న డబ్బులు వ్యసనాలకు ఖర్చయ్యాయా, లేదంటే డబ్బులు మూటగట్టుకుని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడా, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలిస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావని బంధువులు తెలియజేస్తున్నారు. ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరణ తన భర్త కన్పించడంలేదని, కేసు నమోదు చేసుకోవాలని భార్య రెండురోజుల క్రితం కోడుమూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. కేసు నమోదు చేసుకునేందుకు కోడుమూరు పోలీసులు నిరాకరించారు. కర్నూలులో నివాసముంటున్నాడు. ఇక్కడ ఫిర్యాదు తీసుకోమని చెప్పినట్లు తెలిసింది. అయితే తమకు సంబంధించిన ఆస్థులు, ఇల్లు, చేసిన అప్పులు ఈ ప్రాంతానికే చెందినందున కేసు నమోదు చేసుకోవాలని ఆమె పోలీసులను బతిమలాడినప్పటికీ కనికరించకుండా కఠినంగా వ్యవహరించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
అప్పు చేసి టూరుకెళతారా..?
⇒ అధిక వడ్డీ రేట్లకు రుణాలు వద్దు ⇒ విదేశాల్లో క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి ⇒ ప్లానింగ్‌ను బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి విహార యాత్ర.. టూర్.. హాలిడే ట్రిప్.. వంటి పదాలు మనకు కొత్తేమీ కాదు. ఇవి మనకు సుపరిచితమే. రోజూవారి కార్యకలాపాలకు కొద్ది విరామం ఇచ్చి కొత్తదనం కోసం ఆహ్లాదంగా గడపడానికి టూర్లకు వెళ్తాం. దేశీ విహారానికైతే 3-4 నెలలు, అదే విదేశీ విహారమైతే 6-8 నెలల ప్లానింగ్ అవసరం. నిజానికి అక్కడికి వెళ్లాలి... ఇక్కడకు వెళ్లాలి.. అని అందరికీ ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యపడదు. దీనికి అనేక కారణాలు అడ్డొస్తాయి. వాటిల్లో ప్రధానమైనది డబ్బు. ప్రతి ఒక్కరూ ప్లానింగ్ చేస్తారు. కానీ వీటి కన్నా ముఖ్యమైనదిడబ్బు. టూర్‌ను బాగా ప్లాన్ చేయడమే కాదు. దాని కోసం కొంత మొత్తాన్ని కూడా పొదుపు చేస్తూ రావాలి. అది ఎందుకో చూద్దాం... రుణం వద్దు.. క్రెడిట్ కార్డుకు దూరం బ్యాంకులు వ్యక్తిగత రుణాలకు 13-30% మధ్యలో చార్జ్ చేస్తాయి. 15 రోజుల విహారయాత్ర కోసం తొందరపడి రుణం తీసుకుని వెళితే.. తర్వాత కొన్ని నెలలపాటు ఈఎంఐ భారం మోయాలి. ఇది అవసరమేమో ఆలోచించండి. హాలిడే ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించడం కూడా తెలివైన పని కాదు. మీరు రివార్డు పాయింట్లను, క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. కానీ 18-45% వడ్డీనీ చెల్లిస్తున్నారనే విషయాన్ని మరువొద్దు. విదేశాల్లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరుపుతున్నారంటే.. కరెన్సీ మార్పుకు అదనపు భారం మోయల్సిందే. ఇది ఒక లావాదేవీకి 1-3 శాతంగా ఉండొచ్చు. ప్రత్యేక మూలధనం ఏర్పాటు చేసుకోండి విహారయాత్రలు, టూర్లువంటి తదితర వాటికి ప్రత్యేకంగా మూలధనాన్ని సమకూర్చుకోండి. కొత్త ప్రదేశాలకు వెళ్లిన తర్వాత ఎక్కువగా ఖర్చు పెట్టకండి. కొద్దిగా నియంత్రణ పాటించండి. మీరు టూర్ ప్రణాళికలు ముందే వేయండి. అప్పుడే టికెట్స్, కరెన్సీ మార్పు వం టి అంశాల్లో గందరగోళం ఉండదు. హోటళ్లను, ట్రావెల్ టికెట్స్‌ను అప్పటికప్పుడు అనుకొని బుక్ చేసుకోవడానికీ.. ముందే రిజర్వు చేసుకోవడానికి అయ్యే ఖర్చుల్లో చాలా వ్యత్యాసం 13-15% ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు అవసరం టూర్ వెళ్లడానికి ముందే ప్లాన్ చేసుకుంటే.. దానికనువుగా ఇన్వెస్ట్మెంట్లను ప్రారంభించొచ్చు. ఉదాహరణ కు ఈక్విటీ పెట్టుబడులనే తీసుకోండి. ఇవి దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి. ప్రతి నెలా కొంచెం తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంటే మూడేళ్ల తర్వాత విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అదే ఏడాదిలోపు టూర్‌కు వెళ్లాలనుకుంటే.. డెట్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి తక్కువ రాబడిని అందిస్తాయి. అంటే ప్రతినెలా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ రావడం ముఖ్యమని గుర్తుంచుకోండి. టూరిజం సంస్థల ప్రత్యేక పథకాలు... పర్యాటక కంపెనీలు విహారయాత్రలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులతో కలిసి పలు రకాల పథకాలను ఆవిష్కరిస్తున్నాయి. థామస్‌కుక్ హాలిడేస్ కోసం పొదుపు చేసుకోవడానికి వీలుగా ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లతో జతకట్టి ‘హాలిడే సేవిం గ్స్ అకౌంట్’లను ప్రారంభించింది. ఇక ఎస్ఓటీసీ ఇండియా కూడా కొటక్ మహీంద్రా బ్యాంక్‌తో కలిసి ‘హాలిడే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ను ఆవిష్కరించింది. ఈ పథకాల ప్రకారం.. మీకు వెళ్లాల్సిన ప్రదేశం కోసం ఏడాదిపాటు (12 నెలలు) కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఇక 13వ నెల మొత్తాన్ని లేదా బ్యాంక్ వడ్డీని ట్రావెల్ కంపెనీ మీకు అదనంగా చెల్లిస్తుంది. ఈ మొత్తంతో మీరు టూర్‌కు వెళ్లి రావొచ్చు. ఉదాహరణకు మీరు దుబాయ్‌లో 4 రోజులు గడపాలనుకున్నారు. మీరు నెలకు రూ.3,600 పొదుపు చేయాలి. బ్యాంకు మీ పొదుపునకు 7.9% వడ్డీ ఇస్తే, మీకు ఏడాది చివరిలో మెచ్యురిటీ మొత్తంగా రూ.45,083తోపాటు 13వ ఇన్స్టాల్మెంట్ (రూ.3,600) అదనంగా వస్తుంది. ఆయా సంస్థల పథకాలకనుగుణంగా మీకు వచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. -
పొదుపు పేరిట కుచ్చుటోపీ
బోర్డు తిప్పేసిన రోస్ వ్యాలీ నారాయణఖేడ్ : తమ వద్ద పొదుపు చేస్తే అధిక వడ్డీ ఇస్తామని, ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా రెట్టింపు డబ్బులిస్తామంటూ నమ్మించిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతానికి చెందిన రోస్‌వ్యాలీ హోటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ హాలీడే మెంబర్షిప్ టైం షేర్‌గా పేర్కొంటూ మనూరు మండలం గూడూరు, మనూరు, దన్వార్, ముక్టాపూర్ గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలను 500 మందిని సభ్యులుగా చేర్చుకుంది. రూ.500 మొదలుకొని రూ.1,100 వరకు నెలసరి చెల్లించే పద్ధతిన సభ్యత్వం చేసుకొని హాలీడే మెంబర్షిప్ ప్లాన్ సర్టిఫికెట్‌ను బాండ్‌గా పేర్కొంటూ జారీచేశారు. మహిళలు నిరక్షరాస్యులు కావడంతో సంస్థ సభ్యులు ఇచ్చిన కాగితాన్ని తమ వద్ద ఉంచుకొని ఏడాదిన్నరగా ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలా ఐదేళ్ల పాటు చెల్లిస్తే రూ. లక్ష వరకు అందజేస్తామని సంస్థ చెప్పింది. ఈ మేరకు సదరు సంస్థ నారాయణఖేడ్‌లో కార్యాలయాన్ని తెరిచింది. అయితే, ఇటీవల ఏజెంట్లు సక్రమంగా ఉండకపోవడం, కార్యాలయం సైతం మూసి ఉండడంతో మహిళలు రెండు మూడు నెలలుగా డబ్బులు చెల్లించడం నిలిపివేశారు. మంగళవారం కార్యాలయం తెరచి ఉండడం, అందులో కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఏజెంట్ గంగావార్ రమేష్ ఉండడంతో అతన్ని ఘెరావ్ చేశారు. తానే ఏజెంట్‌ను మాత్రమేనని, తమ సంస్థ ఎండీ సుబమయ్యదత్తు అని పవన్‌కుమార్ అనే మరో ఏజెంట్ ఉన్నాడని తెలిపారు. మహిళలు, స్థానికులు ఏజెంట్ రమేశ్‌ను ఘెరావ్ చేస్తూ తమ డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
వడ్డీల వనజాక్షి
అధిక వడ్డీలతో నిలువు దోపిడీ ఏటీఎం కార్డులు, బ్యాంకు బుక్‌లు లాక్కుని వడ్డీ కింద జమ రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు రేణిగుంట : ఆకలి బాధలతో అల్లాడుతున్న పంచాయతీ కాంట్రాక్టు కార్మికులే అధి క వడ్డీల బకాసురులకు టార్గెట్. వారికి అప్పు ఆశ చూపి ఆపై ప్రతాపం చూపిస్తారు. అప్పు తీసుకున్న వారి నుంచి బ్యాంకు పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు లాక్కుని నూటికి రూ.10 నుంచి రూ.12 వరకు వడ్డీ కింద జమ చేసుకుంటారు. తిండికి లేక ఇబ్బందులు పడుతున్నా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. ఇలా అప్పులు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 మంది రేణిగుంట పం చాయతీ కాంట్రాక్టు కార్మికులు రెండు రోజుల క్రితం రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి పల్లె వీధికి చెందిన వనజాక్షి సుమారు రూ.10 లక్షలకుపైగా రేణిగుంట పంచాయతీ కార్మికులకు అప్పుగా ఇచ్చి దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేణిగుంట ఎస్ఐ రఫీ విచారణ చేపట్టారు. ఏటీఎంలు ఆమె వద్దనే... రేణిగుంట గ్రామ పంచాయతీ, తిరుచానూరు, తూకివాకం, తిరుపతి రూరల్, అవిలాల, మంగళంతోపాటు దాదాపు 12 పంచాయతీలలోని పారిశుధ్య కార్మికులకు వనజాక్షి దాదాపు 2.20 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి 108 మంది ఏటీఎం కార్డులు ఈమె వద్దనే ఉంచుకుని జీతం వచ్చిన వెంటనే సొమ్ము డ్రా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఈమె ఇద్దరి కుమారులతో పాటు మరికొంత మంది రౌడీలను పంపి దౌర్జన్యం చేస్తున్నట్లు సమాచారం. వీరికి అధికార పార్టీ అండదండలు ఉండడంతో ఎవరైనా ప్రశ్నించినా వారి గొంతు నొక్కుతున్నట్లు పారిశు ద్య కార్మికులు వాపోతున్నారు. ప్రస్తు తం రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఈమెపై కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
అమ్మో.. వడ్డీ బకారుసులు..!
‘తీసుకున్న అప్పు రూ. 12లక్షలు.. చెల్లించిన వడ్డీ రూ. 18లక్షలు.. అసలు తీరలేదు సరికదా వడ్డీ కూడా పూర్తికాలేదు.. వడ్డీ బకాసురుడి వేధింపులు అధికం కావడంతో బాధిత కుటుంబం జిల్లా ఎస్పీని ఆశ్రయించాల్సి వచ్చింది’. - ఎమ్మిగనూరు అప్పు పెనుముప్పుగా మారి ప్రాణాలనే హరించే వరకు వ స్తోంది.. ఏకంగా కుటుంబాలనే బలికొంటోంది. అవసరానికి అప్పే గాని దానినే వ్యాపారంగా మలుచుకొని ఎమ్మిగనూరులో వడ్డీ బకాసురులు చెలరేగిపోతున్నారు. రోజు వడ్డీ, వారం వడ్డీ, పక్షం, నెల వడ్డీల పేరుతో అనధికారిక ఫైనాన్స్ దుకాణాలు తెరిచి రెండు చేతులా సంపాదిస్తున్నారు. రూ. 100కి రూ. 9 మొదలు రూ. 30 వరకు వడ్డీ చొప్పున వసూలు చేస్తూ చిరుద్యోగులు, వ్యాపారుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. ప్రశాంతతకు, అభివృద్ధికి ఆనవాళ్లుగా మారిన ఎమ్మిగనూరులో మూడేళ్లుగా ఈ వ్యాపారం జోర ందుకుంది. గీతానగర్‌కు చెందిన ఓ వ్యాపారి వాల్మీకి విగ్రహం వద్ద ఉన్న ఓ ఎరువుల దుకాణం అధినేత నుంచి రూ. 12లక్షల అప్పు తీసుకున్నాడు. దినసరి వడ్డీ చెల్లింపు కింద ఇప్పటి వరకు రూ. 18లక్షలు చెల్లించాడు. అసలు అలాగే ఉంది. వడ్డీ కూడా తీరలేదు. ఇదేమంటే రోజు వారి వడ్డీయే నూటికి రూ. 9 అని తీరిగ్గా చెబుతున్నారు. అన్న చేసిన అప్పు తీరలేదని తమ్ముడి చేత కూడా ప్రో నోటు రాయించుకోవడం మరీ విడ్డూరం. వడ్డీ పేరుతో అటు అన్నను ఇటు తమ్ముడిని నిత్యం వేధిస్తుండడంతో చివరకు బాధితుడు భార్యాపిల్లలతో సహా తమ మృతికి సాయిరాం ట్రేడర్స్‌కు చెందిన వ్యక్తే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి అఘాయిత్యానికి ప్రయత్నించగా అయినవారు వారించడంతో ప్రాణాలు నిలిచాయి. అధికార పార్టీ నుంచి వత్తాసు.. నాలుగు రోజుల క్రితం బాధితుడు ఎస్పీ వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఎస్పీ ఆదేశాలు ఎమ్మిగనూరు పోలీసులకు చేరకముందే అధికార పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడి ఫోన్ కాల్ మోగింది. ఆ వడ్డీ వ్యాపారి ‘మాకులపోడే’నని, చూసీ చూడనట్లు వెళ్లం డంటూ హుకూం. ఇక పోలీసులు చేసేదేమిలేక దర్యాప్తు కొనసాగింపు అంటూ కేసు నమోదు చేయకుండానే అలా ముందుకెళుతున్నారు. ఒకరా.. ఇద్దరా.. నాగమణి బాధితులు, పంచలోహ బుద్ధ విగ్రహ వ్యాపారులు, జీరోలో సెల్ వ్యాపారం చేసే వ్యక్తులు, ఎరువుల వ్యాపారులు.. ఇలా చాలా మంది ఆ వడ్డీ బకాసురుడి నుంచి సుమారు రూ. 1.5 కోట్ల వరకు అప్పు తీసుకుని వడ్డీ చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ప్రతి రోజు వడ్డీ రూపంలోనే ఆ వ్యాపారికి రూ. 4.5లక్షలు వసూలవుతుందంటే పరిస్థితి అర్థమవుతుంది. ఇతడితో పాటు మరో ముగ్గురు కీలక వ్యక్తులున్నారు. ఆటో - మినీ లారీ యూనియన్ ప్రతినిధిగా చెప్పుకుంటూ తనకు తానే సోకాల్డ్ రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్న ఓ వ్యక్తి ఇంటి వద్దే అధిక వడ్డీలతో దర్బార్ నడుపుతున్నాడు. మరో వ్యక్తి స్థానిక వీవర్స్‌కాలనీ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఉండగా, ఇంకో వ్యక్తి ఎమ్మిగనూరుకు చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్‌కు దందాలు చేసిన చోటా వ్యాపారి. వీరితో పాటు పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై జిల్లా పోలీసులు, నిఘా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. అధిక వడ్డీలతో అఘాయిత్యాలు.. గత ఏడాది ఓ ఎరువుల వ్యాపారి, ఎస్ఎంటీ కాలనీకి చెందిన పైపుల వ్యాపారి, ఓ పాల వ్యాపారి, ఓ మాంసపు వ్యాపారి అధిక వడ్డీలకు బలవన్మరణం పొందినవారే. రామచంద్రా ఎంపోరియంకు చెందిన రవిప్రసాద్ రూ. 5.6 కోట్లు, ఆయిల్ డిగర్ వ్యాపారి అతావుల్లా రూ. 2.8 కోట్లకు ఇప్పటికే ఐపీ దాఖలు చేశారు. మరో నలుగురు వ్యాపారులు పరారిలో ఉండి ఐపీ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పట్టణ ఎస్ఐ శంకరయ్యను వివరణ కోరగా గీతానగర్ వాసి రాజు ఎస్పీని ఆశ్రయించి సాయిరాం ట్రేడర్స్ ప్రసాద్‌పై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేయలేదని, విచారిస్తున్నామని వివరించారు. -
అధికవడ్డీ కట్టలేక టవరెక్కిన రైతన్న
తీసుకున్న అసలు కన్నా వడ్డీలు ఎక్కువగా కడుతున్న ఒక రైతు చివరకు ఎటూ దారిలేక ఆత్మహత్య చేసుకోవడానికి సెల్‌ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడెపల్లి మండలం పెనమాక గ్రామంలో జరిగింది. పెనమాకకు చెందిన పాతూరి సత్తిబాబు అవసరాల నిమిత్తం గ్రామానికే చెందిన వడ్డీ వ్యాపారి అంకమ్మ రెడ్డి నుంచి రూ.40 వేలు అప్పుగా తీసుకున్నాడు. కాగా, అంకమ్మరెడ్డి ప్రతి నెల వడ్డీ పేరుతో అదనంగా వసూలు చేయడంతో పాటు, బలవంతంగా తన ఇంటిని రాయించుకోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సత్తిబాబు ఆత్మహత్యే తనకు మార్గమని సెల్‌ఫోన్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు రైతు సత్తిబాబుతో మాట్లాడి బుజ్జగించి కిందకు దించారు. -
295 కోట్ల రోజ్‌వ్యాలీ ఆస్తుల జప్తు
దేశంలోనే అతిపెద్ద అటాచ్మెంట్గా రికార్డు సాక్షి, భువనేశ్వర్: అధిక వడ్డీ ఆశ చూపి అనధికారికంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన ఒడిశాలోని రోజ్‌వ్యాలీ గ్రూపుపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. ఆ సంస్థకు చెందిన రూ.295 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ కోల్‌కతా జోనల్ ఈడీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద అటాచ్మెంట్గా పేర్కొంటున్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో రోజ్‌వ్యాలీ కి చెందిన 2,807 బ్యాంకు అకౌంట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పొంజి స్కాంలో రోజ్‌వ్యాలీ అతిపెద్ద భాగస్వామి. ఇది అధిక వడ్డీ ఆశ చూపించి రూ.15 వేల కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించింది. ఒక్క ఒడిశాలోనే డిపాజిటర్లకు రూ.400 కోట్లు తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైందని ఈడీ పేర్కొంది. 27 కంపెనీల పేర్లతో డిపాజిట్లు సేకరించడంతోపాటు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. దీంతో బ్యాంకు ఖాతాలతో పాటు రోజ్‌వ్యాలీ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, రోజ్‌వ్యాలీ హోటల్-ఎంటర్టైన్మెంట్ ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ సంస్థకు ఒడిశాలోనే 65 బ్రాంచ్‌లు ఉన్నాయి. -
ఫైనాన్స్‌పై ఉక్కుపాదం
సాక్షి, ఖమ్మం: కొందరి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రాంసరీ నోట్లు, చెక్కులు, ఏటీఎం కార్డులు, బంగారం, ఇతర వస్తువులను తనఖా పెట్టుకుని, గిరిగిరి తదితర అక్రమ వడ్డీ వ్యాపారాలతో జిల్లాలోని కొంతమంది కోట్లకు పడగలెత్తారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి వ్యాపారం జిల్లాలో నడుస్తోంది. అవసరానికి డబ్బు తీసుకుని అధిక వడ్డీతో చెల్లించలేక చివరకు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జిల్లాలో జరిగాయి. సంపదకు మించి అప్పులు చేస్తూ వ్యాపారులు ఐపీ దాఖలు చేస్తుండటంతో వీరికి అప్పులు ఇచ్చిన వారు కూడా గుల్లవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అక్రమ వ్యాపారంపై ఎస్పీ రంగనాథ్ దృష్టి పెట్టారు. దీనిని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా 200 పోలీస్ బృందాలు ఏకకాలంలో 200 చిట్ఫండ్లు, 300 మంది వడ్డీ వ్యాపారుల కార్యాలయాలపై దాడులు చేశారు. ఖమ్మం, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ఈ దాడులు ఎక్కువగా జరిగాయి. వ్యాపారుల నుంచి వందలాది ఖాళీ ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, దస్తావేజులు స్వాధీనపర్చుకున్నారు. అక్రమంగా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరించే అక్రమ వ్యాపారులపై మరిన్ని తనిఖీలు, సోదాలు జరుగుతాయని పేర్కొన్నారు. వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారం చేస్తూ సంపదకు మించి అప్పులు చేస్తూ చివరకు కట్టలేని స్థితిలో కోట్ల రూపాయలకు ఐపీ దాఖలు చేస్తూ పారిపోతున్నారని పేర్కొన్నారు. వీరి వల్ల అనేకమంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల బలహీనతలను సొమ్ముగా చేసుకుని తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై నిఘా ముమ్మరం చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మైనింగ్ ఉన్న ప్రాంతాల్లో అవసరాలకు తీసుకున్న డబ్బుకు ష్యూరిటీగా ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు పెట్టుకుని కార్మికుల వేతనాన్ని కూడా వడ్డీవ్యాపారులు డ్రా చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, వీటిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. -
నలుగురిని బలిగొన్న ‘వడ్డీ’ వ్యాపారం!
విజయవాడ, న్యూస్‌లైన్ : ‘అధిక వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాను.. నా భార్య పేరిట ఉన్న ఆస్తి ఇమ్మని వేడుకున్నా.. పిల్లల ముఖం చూసైనా ఇవ్వండి అన్నా.. అత్త వెంకటేశ్వరమ్మ, బావమరిది గోపాలకృష్ణ ఇవ్వకపోగా వేధింపులకు గురిచేస్తున్నారు. కొద్ది రోజులుగా మనస్థాపానికి గురైన మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. అత్త, బావమరిదిపై కఠిన చర్యలు తీసుకోండి’ అంటూ కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడిన రాము రాసినట్టుగా చెపుతున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని గులాబీతోట నేతాజీ రోడ్డుకు చెందిన పిన్నింటి రాము (29) చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు వంతెన సమీపంలో శ్రీసాయి బాలాజీ పెరల్స్ అండ్ బెంటెక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఏడేళ్ల కిందట మచిలీపట్నానికి చెందిన లతతో అతనికి వివాహమైంది. కొద్దిరోజులకే వీరి మధ్య మనస్ఫర్థలు రావడంతో విడిపోయారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఏప్రిల్ నాలుగున కోర్టు వాయిదా ఉన్నట్టు చెపుతున్నారు. వారు విడిపోయిన తర్వాత అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన భాగ్యలక్ష్మి (25)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు యశ్వంత్ (5), రోషిణి (3). సీతారామరాజు వంతెన సమీపంలోనే తల్లిదండ్రులు, సోదరులు ఉంటున్నా.. భార్యతో కలిసి గులాబీతోటలో రాము ఉంటున్నాడు. షాపు సమీపంలో అవసరం కోసం వచ్చే వారి వద్ద బంగారు నగలు కుదువ పెట్టుకొని వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. వీరి వద్ద తీసుకున్న నగలు పాతబస్తీలో కుదువ పెడుతున్నట్టు పలువురు చెపుతున్నారు. ఇటీవల కొంతకాలంగా నగలు కుదువ పెట్టిన పలువురు తీసుకునేందుకు రాగా.. ఎన్నికల తర్వాత ఇస్తానంటూ చెప్పసాగాడు. అనేక మంది తమ వద్ద డబ్బులు అయిపోతాయని చెప్పినా, ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేయసాగాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆరు గంటలైనా ఇంట్లోనుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా విగతజీవులై పడివున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న సెంట్రల్ జోన్ ఏసీపీ కె.లావణ్య లక్ష్మి, మాచవరం ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణారెడ్డి హుటాహుటిన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. అధిక వడ్డీలే కారణమా రాము ఇక్కడి పలువురు మహిళల నుంచి నగలు తీసుకొని పాతబస్తీలో కుదువ పెట్టి సొమ్ము తీసుకొచ్చి ఇస్తుంటాడు. వీరు అడిగిన మొత్తం కంటే ఎక్కువ తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో వడ్డీ చెల్లించిన వారి నగలు తీసుకొచ్చేందుకు కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయించి ఉండొచ్చని తెలుస్తోంది. లేదా అక్కడ తీసుకొచ్చిన మొత్తంతో భారీ ఎత్తున కాల్‌మనీ వ్యాపారం చేసి ఉంటాడని, ఇటీవల పోలీసుల చర్యలతో అప్పులు ఇచ్చిన వాళ్లు తిరిగి చెల్లించి ఉండకపోవచ్చని స్థానికులు చెపుతున్నారు. దీంతో కుదువపెట్టిన నగలు విడిపించలేని స్థితిలో వాయిదాలు వేస్తూ వచ్చి ఉండొచ్చని.. ఈలోగా భార్య వాటాగా వచ్చిన స్థలాలు అమ్మేసి అప్పులు తీర్చేద్దామని నిర్ణయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. వెంటనే ఆస్తులు అమ్మి సొమ్ము ఇచ్చేందుకు అత్తింటి వారు అంగీకరించకపోవడంతో పిల్లలు, భార్య సహా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని చెబుతున్నారు. రాము ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పడు తమ పరిస్థితేమిటని నగలు కుదువపెట్టిన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.