అప్పు చేసి టూరుకెళతారా..?
⇒ అధిక వడ్డీ రేట్లకు రుణాలు వద్దు
⇒ విదేశాల్లో క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండండి
⇒ ప్లానింగ్‌ను బట్టి ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి
విహార యాత్ర.. టూర్.. హాలిడే ట్రిప్.. వంటి పదాలు మనకు కొత్తేమీ కాదు. ఇవి మనకు సుపరిచితమే. రోజూవారి కార్యకలాపాలకు కొద్ది విరామం ఇచ్చి కొత్తదనం కోసం ఆహ్లాదంగా గడపడానికి టూర్లకు వెళ్తాం. దేశీ విహారానికైతే 3-4 నెలలు, అదే విదేశీ విహారమైతే 6-8 నెలల ప్లానింగ్ అవసరం. నిజానికి అక్కడికి వెళ్లాలి... ఇక్కడకు వెళ్లాలి.. అని అందరికీ ఉంటుంది. కానీ అది అందరికీ సాధ్యపడదు. దీనికి అనేక కారణాలు అడ్డొస్తాయి. వాటిల్లో ప్రధానమైనది డబ్బు. ప్రతి ఒక్కరూ ప్లానింగ్ చేస్తారు. కానీ వీటి కన్నా ముఖ్యమైనదిడబ్బు. టూర్‌ను బాగా ప్లాన్ చేయడమే కాదు. దాని కోసం కొంత మొత్తాన్ని కూడా పొదుపు చేస్తూ రావాలి. అది ఎందుకో చూద్దాం...
రుణం వద్దు.. క్రెడిట్ కార్డుకు దూరం
బ్యాంకులు వ్యక్తిగత రుణాలకు 13-30% మధ్యలో చార్జ్ చేస్తాయి. 15 రోజుల విహారయాత్ర కోసం తొందరపడి రుణం తీసుకుని వెళితే.. తర్వాత కొన్ని నెలలపాటు ఈఎంఐ భారం మోయాలి. ఇది అవసరమేమో ఆలోచించండి. హాలిడే ఖర్చుల కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించడం కూడా తెలివైన పని కాదు. మీరు రివార్డు పాయింట్లను, క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. కానీ 18-45% వడ్డీనీ చెల్లిస్తున్నారనే విషయాన్ని మరువొద్దు. విదేశాల్లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరుపుతున్నారంటే.. కరెన్సీ మార్పుకు అదనపు భారం మోయల్సిందే. ఇది ఒక లావాదేవీకి 1-3 శాతంగా ఉండొచ్చు.
ప్రత్యేక మూలధనం ఏర్పాటు చేసుకోండి
విహారయాత్రలు, టూర్లువంటి తదితర వాటికి ప్రత్యేకంగా మూలధనాన్ని సమకూర్చుకోండి. కొత్త ప్రదేశాలకు వెళ్లిన తర్వాత ఎక్కువగా ఖర్చు పెట్టకండి. కొద్దిగా నియంత్రణ పాటించండి. మీరు టూర్ ప్రణాళికలు ముందే వేయండి. అప్పుడే టికెట్స్, కరెన్సీ మార్పు వం టి అంశాల్లో గందరగోళం ఉండదు. హోటళ్లను, ట్రావెల్ టికెట్స్‌ను అప్పటికప్పుడు అనుకొని బుక్ చేసుకోవడానికీ.. ముందే రిజర్వు చేసుకోవడానికి అయ్యే ఖర్చుల్లో చాలా వ్యత్యాసం 13-15% ఉంటుంది.
ముందస్తు ప్రణాళికలు అవసరం
టూర్ వెళ్లడానికి ముందే ప్లాన్ చేసుకుంటే.. దానికనువుగా ఇన్వెస్ట్‌మెంట్లను ప్రారంభించొచ్చు. ఉదాహరణ కు ఈక్విటీ పెట్టుబడులనే తీసుకోండి. ఇవి దీర్ఘకాలంలో అధిక రాబడిని అందిస్తాయి. ప్రతి నెలా కొంచెం తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంటే మూడేళ్ల తర్వాత విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అదే ఏడాదిలోపు టూర్‌కు వెళ్లాలనుకుంటే.. డెట్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి తక్కువ రాబడిని అందిస్తాయి. అంటే ప్రతినెలా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ రావడం ముఖ్యమని గుర్తుంచుకోండి.
టూరిజం సంస్థల ప్రత్యేక పథకాలు...
పర్యాటక కంపెనీలు విహారయాత్రలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులతో కలిసి పలు రకాల పథకాలను ఆవిష్కరిస్తున్నాయి. థామస్‌కుక్ హాలిడేస్ కోసం పొదుపు చేసుకోవడానికి వీలుగా ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లతో జతకట్టి ‘హాలిడే సేవిం గ్స్ అకౌంట్’లను ప్రారంభించింది. ఇక ఎస్‌ఓటీసీ ఇండియా కూడా కొటక్ మహీంద్రా బ్యాంక్‌తో కలిసి ‘హాలిడే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్’ను ఆవిష్కరించింది. ఈ పథకాల ప్రకారం.. మీకు వెళ్లాల్సిన ప్రదేశం కోసం ఏడాదిపాటు (12 నెలలు) కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఇక 13వ నెల మొత్తాన్ని లేదా బ్యాంక్ వడ్డీని ట్రావెల్ కంపెనీ మీకు అదనంగా చెల్లిస్తుంది. ఈ మొత్తంతో మీరు టూర్‌కు వెళ్లి రావొచ్చు. ఉదాహరణకు మీరు దుబాయ్‌లో 4 రోజులు గడపాలనుకున్నారు. మీరు నెలకు రూ.3,600 పొదుపు చేయాలి. బ్యాంకు మీ పొదుపునకు 7.9% వడ్డీ ఇస్తే, మీకు ఏడాది చివరిలో మెచ్యురిటీ మొత్తంగా రూ.45,083తోపాటు 13వ ఇన్‌స్టాల్‌మెంట్ (రూ.3,600) అదనంగా వస్తుంది. ఆయా సంస్థల పథకాలకనుగుణంగా మీకు వచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది.