పొదుపు పేరిట కుచ్చుటోపీ
బోర్డు తిప్పేసిన రోస్ వ్యాలీ
నారాయణఖేడ్ : తమ వద్ద పొదుపు చేస్తే అధిక వడ్డీ ఇస్తామని, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా రెట్టింపు డబ్బులిస్తామంటూ నమ్మించిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతానికి చెందిన రోస్‌వ్యాలీ హోటల్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ సంస్థ హాలీడే మెంబర్‌షిప్ టైం షేర్‌గా పేర్కొంటూ మనూరు మండలం గూడూరు, మనూరు, దన్వార్, ముక్టాపూర్ గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలను 500 మందిని సభ్యులుగా చేర్చుకుంది. రూ.500 మొదలుకొని రూ.1,100 వరకు నెలసరి చెల్లించే పద్ధతిన సభ్యత్వం చేసుకొని హాలీడే మెంబర్‌షిప్ ప్లాన్ సర్టిఫికెట్‌ను బాండ్‌గా పేర్కొంటూ జారీచేశారు.
మహిళలు నిరక్షరాస్యులు కావడంతో సంస్థ సభ్యులు ఇచ్చిన కాగితాన్ని తమ వద్ద ఉంచుకొని ఏడాదిన్నరగా ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలా ఐదేళ్ల పాటు చెల్లిస్తే రూ. లక్ష వరకు అందజేస్తామని సంస్థ చెప్పింది. ఈ మేరకు సదరు సంస్థ నారాయణఖేడ్‌లో కార్యాలయాన్ని తెరిచింది. అయితే, ఇటీవల ఏజెంట్లు సక్రమంగా ఉండకపోవడం, కార్యాలయం సైతం మూసి ఉండడంతో మహిళలు రెండు మూడు నెలలుగా డబ్బులు చెల్లించడం నిలిపివేశారు.
మంగళవారం కార్యాలయం తెరచి ఉండడం, అందులో కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఏజెంట్ గంగావార్ రమేష్ ఉండడంతో అతన్ని ఘెరావ్ చేశారు. తానే ఏజెంట్‌ను మాత్రమేనని, తమ సంస్థ ఎండీ సుబమయ్యదత్తు అని పవన్‌కుమార్ అనే మరో ఏజెంట్ ఉన్నాడని తెలిపారు. మహిళలు, స్థానికులు ఏజెంట్ రమేశ్‌ను ఘెరావ్ చేస్తూ తమ డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.