చీరాల.. ఐపీ ఖిల్లా | chirala c/o Ip | Sakshi
Sakshi News home page

చీరాల.. ఐపీ ఖిల్లా

Published Tue, May 23 2017 7:30 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

చీరాల.. ఐపీ ఖిల్లా

చీరాల.. ఐపీ ఖిల్లా

► పక్కాగా నమ్మించి డబ్బు తీసుకుని మోసం
► రూ.7 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఓ ఫైనాన్స్‌ వ్యాపారి
► వడ్డీలకు ఆశపడి అసలు కూడా నష్టపోతున్న అభాగ్యులు


చీరాల : చీరాల పట్టణం మోసాలకు అడ్డాగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు రకరకాల మోసాలు. మోసపోయేవాళ్లు ఉండాలేగానీ మోసం చేయడానికి మాత్రం ఇక్కడ కోకొల్లలుగా ఉంటారు. కాకపోతే.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. ప్రస్తుతం చీరాల్లో ఐపీ మోసాలు కొనసాగుతున్నాయి. ఐపీలు పెట్టేవారు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారం కోసం అప్పులు తెస్తారు. చాలామంది వ్యాపారులు, చిరువ్యాపారులు దాచుకున్న డబ్బు బ్యాంకుల్లో వేసుకుంటే వడ్డీ తక్కువ వస్తుందని భావించి ఎక్కువ వడ్డీ కోసం ఆశపడి అడిగిందే తడవుగా మోసగాళ్లకు అప్పులిస్తారు. కొన్ని రోజులు నమ్మకంగా వడ్డీలు చెల్లించే మోసగాళ్లు.. ఎక్కువ మంది వద్ద కోట్లాది రూపాయలు అప్పు చేసి చివరకు ఐపీ పేరుతో అప్పులిచ్చిన వారికి కుచ్చుటోపీ పెడతారు. వడ్డీ సంగతి అలా ఉంచితే.. చివరకు అసలు కూడా కోల్పోయి అప్పులిచ్చిన వారు రోడ్డున పడతారు. ఈ తరహా మోసాలు ప్రస్తుతం చీరాల్లో అధికంగా జరుగుతున్నాయి.

ఫైనాన్స్‌ వ్యాపారం పేరుతో దగా...
స్థానిక ఎంజీసీ మార్కెట్‌లో ఒక వ్యక్తి దశాబ్ద కాలంగా ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా వ్యాపారం చేస్తుండటంతో స్థానిక వ్యాపారులతో పాటు పట్టణంలోని మధ్యతరగతి కుటుంబాల వారు సైతం అడిగిందే తడవుగా అతనికి అప్పులిచ్చారు. అలాగే నోట్ల రద్దు సమయంలో ఎక్కువ మొత్తంలో వ్యాపారులు ఫైనాన్స్‌ రూపంలో ఇచ్చేశారు. జనం వద్ద రూ.100కి రూ.2 చొప్పున వడ్డీకి తీసుకుని అతను మాత్రం ఇతరులకు రూ.100కి రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీకి ఇచ్చి వసూలు చేసేవాడు. తనవద్ద అప్పు తీసుకున్న వారు ఎవరైనా సకాలంలో డబ్బు చెల్లించకుంటే అంతే సంగతులు. తనవద్ద ఉండే యువకులను పంపి బెదిరించి భయపెట్టి వసూలు చేసేవాడు. అలా కోట్లలోనే వడ్డీలకు తిప్పేవాడు. ఫైనాన్స్‌ వ్యాపారంలో బాగా సంపాదించాడు. అయితే ఏమైందోఏమోగానీ కొద్దిరోజుల క్రితం ఏకంగా రూ.7 కోట్లకు ఎగనామం పెట్టి కనిపించకుండా పోయాడు. దీంతో అతనికి అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. బాగా సంపాదించాడు కదా తాము ఇచ్చిన డబ్బులో అసలైనా వస్తాయని ఆశించారు. కానీ, అప్పులిచ్చిన వారికి కొద్దిరోజులకు ఐపీ నోటీసులు ఇంటికి పంపాడు. మొత్తం రూ.7 కోట్లకుగానూ రూ.5 కోట్లకు ఐపీ నోటీసులు పంపినట్లు సమాచారం. కొద్దిరోజులు మొహం చాటేసిన ఆ ఫైనాన్స్‌ వ్యాపారి.. ఐపీ నోటీసులు ఇచ్చిన తరువాత  మరలా చీరాల వచ్చి తనకు రావాల్సిన బకాయిలను దర్జాగా వసూలు చేసుకుంటున్నాడు. అయితే ఈ ఫైనాన్స్‌ వ్యాపారి జనం సొమ్మును కొంత దాచిపెట్టడంతో పాటు మరికొంత సొమ్ముతో తన తనయుడితో వ్యాపారం చేసుకునేందుకు వచ్చినట్లు సమాచారం. అంటే జనం సొమ్ముతో జల్సా అన్నమాట.

మోసగాళ్లు ఎంతో మంది...
నమ్మించి అప్పుచేయడం.. ఆ తరువాత కోట్లకు ఐపీలు పెట్టి మోసం చేయడం. చీరాల్లో చాలామందికి ఇది పరిపాటిగా మారింది. ప్రస్తుతం పట్టణంలోని ఒక వస్త్రవ్యాపారి తనయుడు ఒక ప్రైవేట్‌ వైద్యశాలలో వాటాదారుడిగా ఉండి రూ.3 కోట్లకుపైగా ఐపీ పెట్టినట్లు సమాచారం. సదరు వ్యాపారి కొద్దిరోజులుగా చీరాలలో కనిపించకుండా వేరే ప్రాతంలో తిరుగుతున్నట్లు సమాచారం. అప్పులిచ్చిన వ్యక్తులు అతని కోసం తిరుగుతున్నారు. అలాగే గొల్లపాలేనికి చెందిన వస్త్రవ్యాపారి కూడా కొద్దిరోజుల క్రితం రాత్రికిరాత్రే తన దుకాణంలోని వస్త్రాలను బయటకు పంపి దుకాణం మూసేశాడు. సదరు వ్యాపారి అప్పులిచ్చిన వారికి రూ.2 కోట్లకు ఎగనామం పెట్టేశాడు. కేవలం ఎక్కువ వడ్డీ వస్తుందని అశపడిన చాలామంది జనం చీరాల్లో ఐపీల బారినపడి చివరకు రోడ్డున పడుతున్నారు.

రోడ్డున పడిన బాధితులు...
ఐపీ పెట్టిన ఫైనాన్స్‌ వ్యాపారికి కొంతమంది వస్త్రవ్యాపారులు అప్పులివ్వగా చాలామంది మాత్రం చిరువ్యాపారులు, మధ్య తరగతి వారు ఉన్నారు. ముంతావారిసెంటర్‌లో రోడ్ల పక్కన హోటళ్లు, ఇతర చిరువ్యాపారులు చేసేవారు తీవ్రంగా మోసపోయారు. ఒకరు తన కూతురు వివాహం కోసం అక్కరకు వస్తాయని ఆశించి ఇచ్చిన డబ్బును మోసపోయారు. బ్యాంకులో ఇస్తే రూపాయి కూడా వడ్డీ రాదని భావించి రూ.2 వడ్డీకి ఫైనాన్స్‌ వ్యాపారికి ఇచ్చి అన్యాయమయ్యారు. ఐపీ నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు. వడ్డీవద్దు.. అసలైనా ఇప్పించండని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement