సాక్షి, ఖమ్మం: కొందరి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రాంసరీ నోట్లు, చెక్కులు, ఏటీఎం కార్డులు, బంగారం, ఇతర వస్తువులను తనఖా పెట్టుకుని, గిరిగిరి తదితర అక్రమ వడ్డీ వ్యాపారాలతో జిల్లాలోని కొంతమంది కోట్లకు పడగలెత్తారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి వ్యాపారం జిల్లాలో నడుస్తోంది. అవసరానికి డబ్బు తీసుకుని అధిక వడ్డీతో చెల్లించలేక చివరకు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జిల్లాలో జరిగాయి.
సంపదకు మించి అప్పులు చేస్తూ వ్యాపారులు ఐపీ దాఖలు చేస్తుండటంతో వీరికి అప్పులు ఇచ్చిన వారు కూడా గుల్లవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అక్రమ వ్యాపారంపై ఎస్పీ రంగనాథ్ దృష్టి పెట్టారు. దీనిని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా 200 పోలీస్ బృందాలు ఏకకాలంలో 200 చిట్‌ఫండ్‌లు, 300 మంది వడ్డీ వ్యాపారుల కార్యాలయాలపై దాడులు చేశారు. ఖమ్మం, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ఈ దాడులు ఎక్కువగా జరిగాయి. వ్యాపారుల నుంచి వందలాది ఖాళీ ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బ్యాంక్ ఏటీఎం కార్డులు, దస్తావేజులు స్వాధీనపర్చుకున్నారు.
అక్రమంగా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరించే అక్రమ వ్యాపారులపై మరిన్ని తనిఖీలు, సోదాలు జరుగుతాయని పేర్కొన్నారు. వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా అక్రమ వ్యాపారం చేస్తూ సంపదకు మించి అప్పులు చేస్తూ చివరకు కట్టలేని స్థితిలో కోట్ల రూపాయలకు ఐపీ దాఖలు చేస్తూ పారిపోతున్నారని పేర్కొన్నారు.
వీరి వల్ల అనేకమంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల బలహీనతలను సొమ్ముగా చేసుకుని తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై నిఘా ముమ్మరం చేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మైనింగ్ ఉన్న ప్రాంతాల్లో అవసరాలకు తీసుకున్న డబ్బుకు ష్యూరిటీగా ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు పెట్టుకుని కార్మికుల వేతనాన్ని కూడా వడ్డీవ్యాపారులు డ్రా చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, వీటిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు.
ఫైనాన్స్‌పై ఉక్కుపాదం
Published Fri, Aug 22 2014 2:09 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement