– వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం
– భర్త అదృశ్యంపై భార్య అనుమానాలు
– ఫిర్యాదు తీసుకునేందుకు కోడుమూరు పోలీసుల నిరాకరణ
కోడుమూరు: మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడి కుమారుడు దాదాపు రూ.26 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు, రైతులు ఇలా ఎవ్వరినీ వదలకుండా అధిక వడ్డీ ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షల్లో అప్పు తీసుకుని కన్పించకుండా పోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వర్కూరు గ్రామంలోనే దాదాపు రూ.3 కోట్లు అప్పులిచ్చినట్లు తెలిసింది. ఇంతటి ఘరానా మోసం వెలుగులోకి రావడంతో మండలంలో సంచలనమైంది. అప్పులు చేసి పరారైన వ్యక్తి పదేళ్ల నుంచి కర్నూలులో నివాసముంటున్నాడు. తండ్రి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాడు. తండ్రి వారసత్వం నుంచి వచ్చిన నగదుతో సదరు వ్యక్తి కర్నూలులో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్లుగా ఆ వ్యక్తి విచ్చలవిడిగా అప్పులు చేసినట్లు బంధువులు తెలియజేస్తున్నారు. ఇటీవల చెడు వ్యసనాలకు అలవాటు పడటంతోనే విచ్చలవిడిగా అప్పులు చేసినట్లు తెలిసింది.
ఆందోళనల్లో అప్పులిచ్చినోళ్లు..
అప్పులు తీసుకుని వ్యక్తి పరారు కావడంతో అప్పులిచ్చినోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కొక్కరూ రూ.60 లక్షలు, రూ.70 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వడ్డీలకిచ్చారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇవ్వకపోయినా పరవాలేదు కానీ, తమ పేర్లు బయటికి చెప్పొద్దంటూ సదరు వ్యక్తి బంధువుల వద్ద బాధితులు ప్రాధేయపడుతున్నట్లు తెలిసింది. భారీ ఎత్తున వడ్డీలకు ఇచ్చినట్లు బయటపడితే ఇన్‌కమ్‌ట్యాక్స్ అ«ధికారుల నుంచి సమస్యలు ఎదురవుతాయని వారంతా ఆందోళన చెందుతున్నారు.
వ్యక్తి అదృశ్యంపై అనుమానాలు
రూ.26 కోట్లు అప్పులు ఉన్నట్లు సదరు వ్యక్తి బంధువులే ఇటీవల లెక్కలు వేశారు. పరారైన వ్యక్తి బంధువులు ఇళ్లకు తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఆ వ్యక్తి అదృశ్యంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా లెక్కకట్టి తిరిగిస్తానని అప్పున్న వ్యక్తి ఫోన్ చేయడంతో రిటైర్ట్ ప్రధానోపాధ్యాయుడి కుమారుడు కర్నూలు కొత్తబస్టాండ్‌లో పార్కింగ్ స్థలంలో ద్విచక్ర వాహనాన్ని పెట్టి వెళ్లాడు. అప్పటి నుంచి కన్పించడంలేదని బంధువులు తెలియజేస్తున్నారు. అప్పులు చేసి పరారైన వ్యక్తి భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా, అప్పులు తీసుకున్న వారి నుంచి ఏదైనా ముప్పు వాటిల్లిందా, కోట్లకు కోట్లు ఎందుకు అప్పులు చేశాడు, తీసుకున్న డబ్బులు వ్యసనాలకు ఖర్చయ్యాయా, లేదంటే డబ్బులు మూటగట్టుకుని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడా, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలిస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావని బంధువులు తెలియజేస్తున్నారు.
ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరణ
తన భర్త కన్పించడంలేదని, కేసు నమోదు చేసుకోవాలని భార్య రెండురోజుల క్రితం కోడుమూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. కేసు నమోదు చేసుకునేందుకు కోడుమూరు పోలీసులు నిరాకరించారు. కర్నూలులో నివాసముంటున్నాడు. ఇక్కడ ఫిర్యాదు తీసుకోమని చెప్పినట్లు తెలిసింది. అయితే తమకు సంబంధించిన ఆస్థులు, ఇల్లు, చేసిన అప్పులు ఈ ప్రాంతానికే చెందినందున కేసు నమోదు చేసుకోవాలని ఆమె పోలీసులను బతిమలాడినప్పటికీ కనికరించకుండా కఠినంగా వ్యవహరించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.