
25న కలెక్టరేట్ ఎదుట నిరసన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి
వీరపునాయునిపల్లె : రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈ నెల 25వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని సంగాలపల్లె గ్రామంలో మండల కన్వీనర్ స్వగృహంలో ఆపార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాదరెడ్డితో కలసి విలేఖరులతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో రైతు పంట రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, దీనితో పాటు మరెన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి వాటిని గాలికి వదలివేశారని విమర్శించారు. ఈనాడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నా రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతు సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా 25న చేపట్టే నిరసన కార్యక్రమానికి రైతులు తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తప్పించుకోలేరన్నారు. రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండడ్‌గా దొరికాడని, ఇందులో చంద్రబాబు ప్రమేయం లేకపోతే రేవంత్‌రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆపార్టీ నంద్యాల నాయకుడు రామలింగారెడ్డి, మండల కన్వీనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.