పందుల కాపరి.. దొంగ బాబా!
నిన్న మొన్నటి వరకు పందులను మేపుతూ బతికేవాడు. మూడేళ్ల క్రితం ఉన్నట్టుండి బాబా అవతారం ఎత్తాడు. అతగాడిది మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామం. పేరు ఎరుకల ఎల్లయ్య. ఇప్పుడు మాత్రం ఎల్లం బాబా. ఆశ్రమం కట్టాడు, ప్రచారం చేయించాడు అంతే.. వైద్యం ప్రారంభించాడు. అక్కడకు ఎవరైనా వస్తే చాలు.. చేతబడి సోకిందంటాడు. అది పోవాటంటే మంత్రాలు చెబుతున్నట్లుగా ఒళ్లంతా రుద్దేస్తాడు!! సమస్య తీవ్రంగా ఉందంటూ చికిత్స చేయాలంటూ రహస్య శరీర భాగాలపై చేతితో మర్ధన చేస్తాడు. నెమ్మదిగా మహిళలను లోబరుచుకుని కామ వాంఛ తీర్చుకుంటాడు. ఎదురుతిరిగితే ఇక ఇంతే సంగతులు, చేతబడి చేస్తానంటూ భయపెడతాడు.
ఇంతకీ సదరు ఎల్లంబాబా ఇచ్చే మందు ఏంటో తెలుసా? లాలా జలం!! ఏరోగమైనా సరే ఇదే మందంటాడు. అతనికి అక్షరజ్ఞానం లేదు గానీ ఆరోగ్యాలను కాపాడే డాక్టరుగా చెలామణి అవుతున్నాడు. మొన్నటి వరకు పందులు కాసేవాడు కాస్తా, ఇప్పుడు ప్రాణాలు కాపాడే వైద్యుడినంటునంటున్నాడు. వైద్యం ముసుగులో ఆడవారి పై దారుణాలకు ఒడిగడుతున్నాడు.
''మీకు సంతానం లేదా, ఏవైనా సమస్యలతో బాధపడుతున్నారా... గ్రహబలం సరిగాలేక కష్టాలు పడుతున్నారా... మీ సమస్య ఎలాంటిదైనా సరే, తీర్చే బాధ్యత నాకు వదిలేయండి... ఒక్కసారి నా చేయి మీ ఒంటిపై పడిందంటే చాలు ఎంతటి జటిల సమస్య అయినా పటాపంచలు కావలసిందే" అంటూ చిత్రవిచిత్ర విన్యాసాలు, మోసాలు, ఘోరాలతో ప్రజలను నమ్మించి వంచిస్తున్న ఓ దొంగ బాబా బండారాన్ని సాక్షి బయటపెట్టింది.
చింపిరి జుట్టుతో కుర్చీలో కూర్చుండి పిచ్చిగీతలు గీసే వ్యక్తే డాక్టర్ బాబా. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లయ్య. ఇతడి దగ్గరకు వచ్చేవారిని చేతబడి, ఇతర పేర్లతో భయపెట్టి, నోటికొచ్చిన మంత్రాలు చదువుతూ ఒళ్లంతా రుద్దుతూ అసభ్యంగా ప్రవర్తిస్తాడు. సమస్య తీవ్రంగా ఉంది, ఇంకా చికిత్స చేయాలంటూ ఆడవారి రహస్య భాగాలపై చేతితో మర్దన చేస్తాడు... ఇలా నీచంగా ప్రవర్తిస్తూ మహిళలను లోబరుచుకోని తన కామవాంఛ తీర్చుకుంటాడు .
ఎల్లంబాబా తన వద్దకు వచ్చేవారికి ఇచ్చే దివ్యౌషధం తన లాలాజలం. ఏ రోగమైనా ఇదే మందంటాడు . కవర్లో గానీ, బాటిల్లో గానీ నీళ్లు తెప్పించి అందులో ఉమ్మి, రోజూ మూడు పూటలా తాగాలంటాడు. ఇతడి దారుణాలు అందరికీ తెలిసినా, శాపాలు పెట్టి క్షుద్ర పూజలు చేస్తాడేమోనని భయపడి ఎవరూ ధైర్యం చేయట్లేదు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు . సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సొంత గ్రామానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ దొంగబాబా దారుణాలు, అత్యాచారాలకు అడ్డుకట్టపడుతుందని ఆశిద్దాం.