వారంతా నిరుపేదకూలీలు. కాయకష్టం చేసి బతికెటోళ్లు. నిరక్షరాస్యులైన వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. పేరున్న సంస్థల్లో బీమా చేయిస్తానని ముందుకొచ్చాడో వ్యక్తి. ఇలా ఐదువేల మంది పేదల నుంచి సుమారు రూ.కోటిన్నర వసూలు చేసి.. చివరకు బోర్డు తిప్పేశాడు. తాము మోసపోయామని గుర్తించిన పేదలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : వరంగల్ జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్ రాజ్‌కమల్ ఏజెన్సీస్ పేరిట మూడేళ్ల క్రితం హుస్నాబాద్‌లో దుకాణం తెరిచాడు. తమ సంస్థలో పని చేసేందుకు ఏజెంట్లు కావాలని ప్రకటనలు జారీ చేశాడు. తమకు ఉపాధి దొరుకుతుందని నమ్మి 60 మంది ఏజెంట్లు ఇందులో చేరారు. నెలకు రూ.వంద నుంచి పొదుపు చేస్తామని, పొదుపు చేస్తున్న సమయంలో ఎవరైనా మరణిస్తే వేలరూపాయలు వస్తాయని, ఐదేళ్ల కాల పరిమితి తర్వాత రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఏజెంట్లు నమ్మారు.
ఈ డబ్బు లు బజాజ్ ఎలియంజ్, ఎల్‌ఐసీ, టాటా, రిలయన్స్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెడతామని చెప్పడంతో వేలాదిమందిని సభ్యులుగా చేర్పించారు. రెండున్నరేళ్లపాటు ఇలా సభ్యుల నుంచి సేకరించిన సొమ్మును స్వాహా చేయడం మొదలుపెట్టారు. అనేకమందికి బీమాబాండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే డబ్బులు సొంతానికి వాడుకున్నారు.
ప్రతీ నెల ఐదో తేదీ వరకు ఏజెంట్లు వచ్చి డబ్బులు తీసుకెళ్లేవారు. ఈ నెలలో రాకపోవడంతో పలువురు హుస్నాబాద్‌లోని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కార్యాలయం మూసి ఉండడంతో అనుమానం వచ్చి ఈప్రాంత ఏజెంట్ సత్యనారాయణ వద్దకు వెళ్లారు. సంస్థ వారు రావడం లేదని చెప్పడంతో మోసపోయామని గుర్తించిన వారు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సంస్థ తమను మోసం చేసిందంటూ ఏజెంట్ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నీ తప్పులే..
ప్రజల డబ్బులను ఆయా బీమా కంపెనీల్లో కట్టాల్సిన సంతోష్ తనే స్వాహాచేశాడు. పేరుకు మాత్రం ఆయా కంపెనీల్లో చెల్లిస్తున్నట్లు తన సంస్థ రశీదులు ఇచ్చాడు. సభ్యుల చిరునామాలను సైతం తప్పుగానే చూపించాడు. మండలంలోని రామవరం, చిగురుమామిడి గ్రామాలకు చెందిన పలువురి చిరునామాను హుస్నాబాద్‌గా చూపించాడు. వీరిలో కొంతమంది డబ్బులు మాత్రమే చెల్లించాడు. అదీ వెంటనే జమచేయకుండా ఆరు నెలల అనంతరం జమచేశాడు. ఇలా అనేకరకాలుగా ప్రజలను సంస్థ మోసం చేసింది.
ఎవరీ సంతోష్..
వరంగల్ జిల్లాకు చెందిన సంతోష్ ఆ జిల్లాకేంద్రంలోని ఓ బీమా కంపెనీలో కొద్ది కాలం పని చేసినట్లు తెలిసింది. అనంతరం తానే స్వయంగా బీమా కంపెనీ పేరిట డబ్బులు దండుకునేందుకు దుకాణం తెరిచి ప్రజలను మోసం చేశాడు. పైగా సభ్యులు చెల్లించిన డబ్బులను ఓ వ్యక్తికి ఇచ్చానంటూ పోలీసులను నమ్మించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. కోటిరూపాయలకుపైగా వసూలు చేసిన సంతోష్ తాను మాత్రం రూ. అరవై లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు చెబుతున్నాడు.
సంతోష్‌పై కేసు నమోదు
ప్రజలను మోసం చేసి అకినపల్లి సంతోష్‌పై కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై శ్రీరాములు తెలిపారు. ర్యాకల సత్యనారాయణ అనే ఏజెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సంతోష్ రూ. 1.12కోట్లు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడని తెలిపారు.
కూలీ చేసిన పైసలు కట్టాం..
మూడేళ్ల నుంచి నెలకు రెండు వందల దాకా కట్టిన. కూలీ పని చేసి తెచ్చిన పైసలు ఎందుకన్న అక్కరకు వత్తయని కట్టిన. మా వాడకు అందరూ కడితే నేను కూడా ఇచ్చిన. ఇట్ల చేత్తడనుకోలే. - చాంద్‌బీ, రామవరం
పైసలత్తయని చెప్పిండు
నెలకు వంద రూపాలసొప్పు న ఇరువై ఎనిమిది నెలలు క ట్టినం. నా భర్త దసరా పండుగప్పుడు సచ్చిపోయిండు. పదమూడువేలు అత్తయి అని చెప్పిండ్రు. ఖాతాతీయుమంటే తీసిన. కానీ పైసలింకా రాలేదు.
- బొమ్మ యాదవ్వ, రామవరం
ఐదేండ్లకే తొమ్మిదివేలు ఇత్తమన్నరు
నెలకు వంద సొప్పున మూడువేల ఆరువందల దాకా కట్టిన. ఐదేండ్లకే తొమ్మిది వేలు ఇత్తమన్నరు. ఈ నెలల ఈడికచ్చిసూత్తే ఆఫీసు మూసి ఉంది. ఎంజెయ్యాల్నో అర్థమైతలేదు. దాసుకున్న పైసలు గిట్ల ఎత్తుకపోయిండ్రు.
- జాతరబోయిన ఎల్లవ్వ
రూ.కోటిన్నర టోపీ
Published Sat, Jan 18 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement