ఉప్పలగుప్తం/ముమ్మిడివరం : పుట్టిన రోజు తమతో ఆనందంగా గడిపిన యువతి.. అంతలోనే తిరిగిరాని లోకానికి చేరడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. గొల్లవిల్లి పంచాయతీ వాడపర్రుకు చెందిన ఆటోడ్రైవర్ తోరం శ్రీనివాసరావుకు కుమారుడు శివ, కుమార్తె విజయ దుర్గాభవాని(18) ఉన్నారు. శివ ఇంజనీరింగ్ చదువుతుండగా, దుర్గాభవానికి ఇటీవలే బంధువుతో వివాహం నిశ్చయమైంది. కాగా బుధవారం పుట్టిన రోజు కావడంతో దుర్గాభవాని తన ఇంటి వద్ద తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి, అన్న శివతో కలిసి వేడుక జరుపుకొంది.
అక్కడి నుంచి ఐ.పోలవరం మండలం గుత్తెనదీవిలో ఉన్న పెద్దమ్మ ఆశీస్సులు పొందేందుకు శివతో కలిసి ఆమె మోటార్ బైక్‌పై బయలుదేరింది. అక్కడ బంధువులతో ఆనందంగా గడిపిన వారు స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. ముమ్మిడివరం స్టేట్‌బ్యాంక్ సమీపంలో వీరి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ సంఘటనలో దుర్గాభవానికి తీవ్ర గాయాలు కాగా, శివకు స్వల్పగాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అమలాపురం కిమ్స్‌కు, మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఆమె మరణ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వాడపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. ముమ్మిడివరం ఎస్సై అప్పల నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టిన రోజే తిరిగిరాని లోకానికి..
Published Thu, Dec 10 2015 1:32 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement