వివాదం రేపిన ‘డిష్’.. ఒకరికి తీవ్రగాయాలు
Published Thu, Mar 23 2017 8:23 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
అనంతపురం: కేబుల్ డిష్ విషయంలో జరిగిన ఘర్షణలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నగరంలోని రామకృష్ణకాలనీకి చెందిన రాజేశ్‌కుమార్, రూపాదేవి భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కొన్ని రోజుల నుంచి ఇంట్లోని డిష్ వైర్‌కు కరెంట్ సరఫరా అవుతోంది. పలుమార్లు షాక్ కూడా కొట్టింది. ఇదే విషయాన్ని డిష్ నిర్వాహకుడు రాజు అలియాస్ చిన్నాకు రాజేశ్‌కుమార్ తెలియజేశాడు. దీంతో బుధవారం రాత్రి పొద్దుపోయాక అతడు ఇంటి వద్దకు వచ్చిన సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రాజు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు.
కాసేపటి తర్వాత రాజు అక్కడికి చేరుకుని తలుపు తట్టాడు. కటింగ్ ప్లేయర్ తీసుకు రావడంతో రిపేరు చేస్తాడేమోనని వారు తలుపుతెరిచారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కొడవలిని తీసి రాజేశ్ గొంతుపై నరికాడు. అడ్డు వచ్చిన రూపాదేవిపై దాడి చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులను ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఎస్‌ఎస్ వార్డుకు తరలించారు. కాగా దాడికి పాల్పడిన రాజు కూడా తనను కొట్టారంటూ ఆస్పత్రికి వద్దకు చేరుకోవడంతో కాసేపు ఘర్షణ జరిగింది. ఔట్‌పోస్ట్ పోలీసులు జోక్యం చేసుకుని రాజును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడికి స్వల్ప గాయాలు ఉన్నట్లు గుర్తించి అత్యవసర విభాగంలో చికిత్స అందించారు.
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి డిష్ బిల్లు ఇవ్వలేదని, అడగడానికి వెళితే దాడి చేశారని తెలిపాడు. కాగా ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. రాశేష్‌కుమార్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం కాగా రాజు టీడీపీ నేత జయరాం నాయుడు వర్గానికి చెందిన వాడుగా తెలిసింది. రాజకీయంగా నేతల మధ్య ఉన్న వైరం కూడా గొడవ ఇంత పెద్దదిగా మారడానికి కారణమని తెలుస్తోంది.
Advertisement
Advertisement