ఏడాది స్నేహం.. మూడు నెలల జీవనం.. | one year friend... three months life.. | Sakshi
Sakshi News home page

ఏడాది స్నేహం.. మూడు నెలల జీవనం..

Published Fri, Dec 12 2014 7:37 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

ఏడాది స్నేహం.. మూడు నెలల జీవనం.. - Sakshi

ఏడాది స్నేహం.. మూడు నెలల జీవనం..

జీవితానికి శాశ్వత సెలవ్
పుంగనూరు: ఏడాది క్రితం అనుకోకుండా ఒకరికొకరు తారసపడ్డారు. ఆ పరిచయంతో సెల్‌ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత వారి మధ్య సాగిన మాటలు స్నేహానికి దారితీశాయి. మూడు నెలల పాటు సహజీవనం ప్రారంభించారు. ఏమైందో ఏమో వారిద్దరూ ఈ జీవితం చాలించుకోవాలనుకున్నారు. ఇద్దరూ కొత్తదుస్తులు ధరించారు. దేవునికి పూజలు చేశారు.  కావాల్సిన తినుబండరాలు తెచ్చుకుని ఇద్దరూ కలసి తిన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో విషం తాగి తనువు చాలించిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో గురువారం వెలుగుచూసింది.
 
పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని కొత్తయిండ్లలో నివాసం ఉన్న శమంతకమణి కుమారుడు రాజ్‌కుమార్ (36) గంగవరం మండలం కీలపట్ల జెడ్పీ హైస్కూల్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గత ఏడాది రాజ్‌కుమార్ వైఎస్‌ఆర్ జిల్లాకు పనిపై వెళ్లాడు. ఆ జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన ఓబయ్య భార్య సుగుణ (34) తారసపడింది. వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ పరిచయం సహజీవనం వరకు వచ్చింది.

అక్టోబర్‌లో సుగుణ పుంగనూరులోని కొత్తయిండ్లలో ఉన్న రాజ్‌కుమార్ ఇంటికి వచ్చింది. అలా కలిసి జీవిస్తుండగా సుగుణ తల్లిదండ్రులతో పాటు భర్త ఓబయ్య ఆ ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పుంగనూరుకు వచ్చి సుగుణ, రాజ్‌కుమార్‌ను తీసుకెళ్లారు. విచారణలో తన భర్త ఓబయ్య చెడు అలవాట్లకు బానిసై, తనను వేధిస్తున్నాడని తెలిపింది. తనకు భర్త అవసరం లేదని పెద్దమనుషుల సమక్షంలో తెగేసి చెప్పి, తిరిగి పుంగనూరుకు చేరుకుంది. దీంతో ఆ కేసును కడప జిల్లా పోలీసులు మూసివేశారు.

ఇలావుండగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రాజ్‌కుమార్ మద్యానికి బానిసకావడం, సుగుణ పెళ్లైయిన విషయాన్ని దాచిపెట్టడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీసినట్లు తెలిసింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.  బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం రాత్రి 11 గంటలకు నిద్రించేందుకు గదిలోకి వెళ్లారు. కొద్దిసేపటికి ఇరువురు విషం తాగారు. ఆ బాధ భరించలేక సుగుణ కేకలువేస్తూ బయటకు పరుగులుతీసింది.

అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాజ్‌కుమార్‌తో పాటు సుగుణను చుట్టుపక్కల వారు 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరువురూ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇరువురి శవాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి తల్లి శమంతకమణి ఫిర్యాదు మేరకు  ఎస్‌ఐ గంగిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement