‘రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితుల్లో.. సీఎం చంద్రబాబునాయుడు తీరుతో పూర్తిగా నష్టపోయిన ప్రజలకు భరోసా ఇస్తూ ముందడుగు వేస్తున్నా’.. అంటూ వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ వద్ద 2017 నవంబరు 6న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు మంగళవారంతో ఒక ఏడాది పూర్తికానుంది. ఈ 12నెలల కాలంలో జగన్ 11 జిల్లాలు పూర్తి చేసుకుని 12వ జిల్లాలో యాత్రను కొనసాగిస్తూ జనంతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకోవడంలోనూ.. ప్రజలను కలుసుకోవడంలోనూ ఆయన చూపుతున్న చొరవ ప్రదర్శిస్తున్న ఓర్పు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. కేసులకు భయపడే ప్రసక్తి లేదు.. నాకున్నది ఒక్కటే కసి.. అది నేను చనిపోయిన తరువాతా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి, ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పంచాలన్నదే నా కసి, ఆ కసి నాలో ఉంది కాబట్టే ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే నా కసి’.. అని పాదయాత్ర తొలి రోజున వ్యక్తీకరించిన సంకల్పం అడుగడుగునా ప్రస్ఫుటిస్తోంది.
వైఎస్సార్ జిల్లాలో ప్రారంభమైన యాత్రను కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైఎస్ జగన్ ముగించుకుని ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 25న హైదరాబాద్‌కు బయల్దేరగా విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. దీని నుంచి తృటిలో తప్పించుకున్నప్పటికీ భుజానికి లోతైన గాయం కావడంతో జగన్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా మళ్లీ ప్రజల చెంతకు వెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు.
‘నవరత్నాల’పై ప్రజల్లో అవగాహన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, గృహ నిర్మాణం, 108 వంటి అనేక సంక్షేమ పథకాలకు ఊపిరులూది దేశంలోనే సంక్షేమ విప్లవానికి నాంది పలికిన తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కంటే రెండడుగులు ముందుకు వేయాలనే కృతనిశ్చయంతో ఉన్న జగన్ తన ఆశయాలకు అనుగుణంగా ‘నవరత్నాలు’ను రూపొందించారు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
జనప్రభంజనంతో ఆలస్యం
వాస్తవానికి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ తలపెట్టిన పాదయాత్రను ఆరేడు నెలల్లోపు పూర్తిచేయాలని జగన్ తొలుత సంకల్పించారు. కానీ, యాత్ర ప్రారంభమైన నాటి నుంచీ రోజు రోజుకూ వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో అడుగుతీసి అడుగువేయడం కష్టమైపోతోంది. అందుకే 12 జిల్లాలు పూర్తికాకుండానే ఏడాది గడిచిపోయింది. మరో నెలన్నర దాకా యాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ఏ ఊరికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. బహిరంగ సభలకైతే ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివస్తున్నారు. అందువల్లే అనుకున్న దానికంటే యాత్ర ఆలస్యమవుతోంది.
తీర్చగలిగే వాటిపైనే హామీలు
జగన్ ఇప్పటికే 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఇబ్బడి ముబ్బడిగా తనను కలుసుకోవడానికి వస్తున్న ప్రజాసంఘాలు, తటస్థులతో భేటీ అవుతూ తీర్చగలిగిన వారి సమస్యలపై ఆయన విస్పష్టమైన హామీలిస్తున్నారు. జగన్ మాట ఇస్తే తప్పరన్న నమ్మకం కలుగుతుండడంతో వారంతా ఆనందంతో వెనుదిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎక్కడికెళ్లినా జనం పోటెత్తుతున్న తీరు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా మహిళలు, యువకులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది సెల్ఫీలు తీసుకున్నారు. ఇక అవ్వాతాతలు తమ సొంత మనవడే తమ వద్దకు వచ్చినట్లుగా ఆనందిస్తూ జగన్‌ను ఆశీర్వదిస్తున్నారు.
ప్రజా సంకల్పానికి ఏడాది
Published Tue, Nov 6 2018 4:47 AM | Last Updated on Tue, Nov 6 2018 9:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment