నత్తే నయం!
కొనసాగుతున్న అభివృద్ధి పనులు
కానరాని నాణ్యత {పమాణాలు
పూర్తికాని రోడ్ల విస్తరణ
అధికారుల తీరుపై మేయర్ గుర్రు
విజయవాడ సెంట్రల్ : నగరంలో అభివృద్ధి పనులు నీరసంగా సాగుతున్నాయి. సమగ్ర ప్రణాళిక లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. దీంతో అంచనాలు పెరిగిపోయి నగరపాలక సంస్థపై ఆర్థిక భారం పడుతోంది. కొండ ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి నెలకొంది. పుష్కలంగా నిధులు మంజూరైనప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. ఫలితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. జరిగిన పనుల్లోనూ నాణ్యత లోపించిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
కమిషనర్‌కే మస్కా
13వ ఆర్థిక సంఘం, ప్లాన్, నాన్‌ప్లాన్, ఇరిగేషన్ గ్రాంట్లు, స్టేట్‌ఫైనాన్స్, నగరపాలక సంస్థ జనరల్ గ్రాంట్ల ద్వారా నగరంలోని మూడు సర్కిళ్లలో రూ. 158.28 కోట్లతో 750 పనులను నాలుగు నెలల కిందట చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ పూర్తికావాల్సి ఉంది. ఇందులో 494 పనులు పూర్తికాగా, 138 అభివృద్ధి దశలో ఉన్నాయి. 82 ప్రారంభ దశలో ఉండగా, 36 పనులు ఇంకా టెండర్ దశలో కునారిల్లుతున్నట్లు ఇంజినీరింగ్ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతంటే అదీ అనుమానమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ దెబ్బతింటోంది. సర్కిల్-1 పరిధిలో పనులు ప్రారంభం కాకుండానే తప్పుడు రికార్డులతో కమిషనర్‌ను పక్కదారి పట్టించేందుకు ఏఈ, డీఈలు యత్నించారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో వారిని విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ తరహాలో కొందరు ఏఈలు కాగితాలపైనే పనులు జరిగినట్లు చూపిస్తూ మస్కా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నాణ్యతకు తిలోదకాలు
ఇప్పటివరకు జరిగిన పనులను నిశితంగా పరిశీలిస్తే 40 శాతం పనులు నాసిరకంగా ఉన్నాయనే వాదనలున్నాయి. సర్కిల్-3 చేపట్టిన డ్రెయినేజీ పనుల్లో నాణ్యత లోపించడంపై మేయర్ కోనేరు శ్రీధర్ తప్పుబట్టారు. చీఫ్ ఇంజినీర్‌కు ఫిర్యాదు చేశారు. కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు పనుల్లో నాణ్యత లేకుంటే ఎలా అంటూ నిలదీసినట్లు తెలిసింది. సర్కిల్-1 చేపట్టిన పనుల్లో కొన్ని నాసిరకంగా ఉండడంపై కమిషనర్ జి.వీరపాండియన్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో కలిసి కమిషనర్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. సింగ్‌నగర్ ప్రాంతంలో చేపట్టిన కొన్ని పనుల్లో డొల్లతనం వెలుగుచూసింది.
విస్తరణ పనులకు అడ్డంకులు.. సమగ్ర ప్రణాళికలు, ఏర్పాట్లు లేకుండా టెండర్లు పిలవడంతో రోడ్ల విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దుర్గగుడి ఫ్లైఓవర్, కృష్ణాపుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు నగరంలో సుమారు 29 రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. దీనికి సంబంధించి నిధులు కేటాయించడంతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. విస్తరణకు మార్కింగ్ ప్రకారం రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టారు. మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను ఇప్పటికీ
తొలగించకపోవడంతో రోడ్డు పనులు ఆగిపోయాయి. స్తంభాలు తొలగిస్తేనే పనులు చేయగలుగుతామని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
భవానీపురం, విద్యాధరపురం, సింగ్‌నగర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. విస్తరణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓ కొలిక్కిరాలేదు. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ సీరియస్ అయ్యారు. స్తంభాల తొలగింపునకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలంటూ కమిషనర్‌కు లేఖరాసినట్లు తెలుస్తోంది.