
సాక్షి, కోడుమూరు : భక్తులు ఎక్కడైనా దేవుళ్లకు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనసులోని కోరికలను కోరుకుంటారు. ఇందుకు భిన్నంగా కోడుమూరులోని కొండమీద వెలసిన శ్రీకొండలరాయుడికి భక్తులు తేళ్లను నేవేద్యంగా పెడుతున్నారు. ఈ వింత ఆచారం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటం గమనార్హం. ప్రతి ఏటా శ్రావణమాసం మూడవ సోమవారం కొండల రాయుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ క్రమంలో సోమవారం నియోజవర్గ కేంద్రంతో పాటు చుట్ట పక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. కొండపైన ఉన్న చిన్న చిన్న రాళ్లను ఎత్తి వాటి కింద ఉండే తేళ్లను భయపడకుండా చేతులతో పట్టుకుని స్వామికి కానుకగా సమర్పించారు. పట్టుకునే సమయంలో తేలు కుట్టితే స్వామి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది వారి నమ్మకంగా చెప్పారు. ఇదిలా ఉంటే స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ సంరక్షకుడు రామమనోహర్‌రెడ్డి తీర్థప్రసాదాలు, మంచినీటి సదుపాయం కల్పించారు.

స్వామి క్షేత్రం వద్ద భక్తజన సందడి

కొండలరాయుడు స్వామి విగ్రహంపై తేళ్లను వదులుతున్న భక్తులు