ఆగండి.. ఆగండి! | ongole police using new technology for control vehicles over speed. | Sakshi
Sakshi News home page

ఆగండి.. ఆగండి!

Published Sun, Mar 19 2017 3:12 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

ఆగండి.. ఆగండి! - Sakshi

ఆగండి.. ఆగండి!

►వాహనాల స్పీడ్‌కు ఇక చెక్‌
►40 కిమీ దాటితే రూ.300ల జరిమానా
►సెన్సర్‌ల ద్వారా స్పీడ్‌ లేజర్‌ గన్‌తో వాహన వేగం షూట్‌
► రోజుకు 60 నుంచి 70 వాహనాలకు జరిమానా విధిస్తున్న పోలీసులు


చీమకుర్తి రూరల్‌ : హైటెక్‌ టెక్నాలజీ సాయంతో పోలీసులు హైస్పీడ్‌ వాహనాలను గుర్తిస్తున్నారు. వెంటనే ప్రింటౌట్‌ తీసి ఎగువనున్న పోలీసులకు సమాచారం అందించి వెంటనే రూ.300ల చలానా రాసేస్తున్నారు. ఒంగోలు నుంచి పొదిలి వైపు వెళ్లే కర్నూలు రోడ్డులో పేర్నమిట్ట వద్ద ఒకటిన్నర నెల నుంచి హైస్పీడ్‌ వాహనాలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ రంగనాథ్‌ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసు ఇంటర్‌ సెప్టర్‌ వాహనంలో ప్రత్యేకంగా అమర్చిన స్పీడ్‌ లేజర్‌గన్‌ సాయంతో 40 కిమీ కంటే ఎక్కువ వేగంగా వచ్చే వాహనాలను గుర్తించి వెంటనే ఆ వాహనం ప్రింటౌట్‌ బయటకు తీస్తున్నారు. దానిలో ఆ వాహనం వస్తున్న వేగం ఎంత, రావాల్సిన వేగం ఎంత.. వంటి పూర్తి వివరాలతో సహా వాహనం ఫొటోతో ప్రింటౌట్‌ వస్తుంది. వెంటనే వేగాన్ని అతిక్రమంచిన వాహనానికి సంబంధించిన సమాచారాన్ని వైర్‌లెస్‌ సెట్‌లో ఎగువనున్న పోలీసులకు అందిస్తారు. ఫొటో తీసిన ప్రింటౌట్‌ను ఎగువకు వెళ్లే ఇతర వాహనదారుల ద్వారా పంపిస్తారు. ఎగువన వేగాన్ని అతిక్రమించిన వాహనదారుడిని పోలీసులు జెండా ఊపి పక్కకు తీస్తారు. వారికి ఒక్కొ వాహనానికి రూ.300 చొప్పున చలానా రాసి పంపిస్తున్నారు. ఇలా హైటెక్‌ పోలీసు ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలు రాష్ట్రంలో మూడే మూడు ఉన్నాయి. ఒకటి వైజాగ్, రెండు తిరుపతి, మూడు పేర్నమిట్ట.

ప్రమాదాలు ఎక్కవ జరిగే చోట నిఘా: ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న చోట్ల హైటెక్‌ ఇంటర్‌ సెప్టర్‌ వాహనాలు ఉంచుతున్నారు. కర్నూలు రోడ్డులో ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి ఒంగోలు వరకు మధ్య ప్రాంతంలో ఎక్కువుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పేర్నమిట్ట ప్రాంతంలో స్పీడ్‌ కంట్రోల్‌ను 40 కిమీగా నిర్ణయించి రోడ్డు మీద బోర్డు పెట్టారు. స్పీడ్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి వచ్చే వాహనాల వేగాన్ని 40 కిమీ దాటిన తర్వాత వాస్తవానికి జరిమానా విధించాలి. కానీ లేజర్‌ గన్‌ అదనంగా మరో 15 కిమీ వరకు సహిస్తుంది. అంటే 55 కిమీ వరకు ఫొటో తీయకుండా 56 కిమీ దాటిన వాహనాలను మాత్రమే ఫొటో తీసి బయటకు పంపిస్తుంది. ఇలా వాహనదారుల అతివేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న హైటెక్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి వాహనదారులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

గమనించడం కష్టం: పోలీసులు ఇంటర్‌ సెప్టర్‌ వాహనంతో రోడ్డు పక్కన ఉంటారు. వారు చలానా రాస్తారని వాహనదారులు ఆఖరి వరకూ గమనించలేకపోతున్నారు. దీన్ని గతంలో నేషనల్‌ హైవేపై పేస్, రైజ్‌ కాలేజీల వైపు ఉంచారు. ప్రస్తుతం పేర్నమిట్ట వైపు ఎక్కువుగా ప్రమాదాలు జరుగుతుండటం గమనించి పోలీసు ఉన్నతాధికారులు పేర్నమిట్ట్టపై దృష్టి సారించారు. రానున్న రెండు మూడు రోజుల్లో ఒంగోలు వైపు వచ్చే వాహనాలకే కాకుండా ఒంగోలు నుంచి సంతనూతలపాడు వైపు వెళ్లే వాహనాలకు కూడా విడతలు వారీగా ఇంటర్‌ సెప్టర్‌ వాహనాన్ని మార్చి మార్చి స్పీడ్‌ కంట్రోల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌ఐ రంగనా«థ్‌ తెలిపారు. ఇప్పుడు వాహనాల స్పీడ్‌ తగ్గటమే కాకుండా గతంతో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పట్టాయని పేర్కొంటున్నారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు వాహనాలను పర్యవేక్షిస్తున్నామన్నారు. రోజుకు 60 నుంచి 70 మంది వాహనాలను గుర్తించి వారికి జరిమానా విధిస్తున్నట్లు రంగనాథ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement