ఉట్నూర్, న్యూస్‌లైన్ :
గ్రామ పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆన్‌లైన్ సేవలు ఇప్పట్లో జిల్లాలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం వంటి వివరాలు ప్రతీఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా అన్నింటినీ కంప్యూటరీకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యోచన. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తేనే 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసిన అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆన్‌లైన్ విధానంపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. జిల్లాలో 839 మైనర్, 27 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మాస్టర్ ఎంట్రీలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓచర్ల సంఖ్య వివరాలను 2013 మార్చి నెలాఖరు వరకు పంచాయతీరాజ్ సంస్థల అడిటింగ్ సాఫ్ట్‌వేర్ (ప్రియా సాఫ్ట్) ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచితే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే..
కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి రూ.కోట్లాది నిధులు కుమ్మరిస్తున్నా ఆశించిన ప్రగతి కానరావడం లేదు. నిధులు పక్కాదారి పడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధిదీపాలు, తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. 2011 ఆగస్టులో పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 13వ అర్థిక సంఘం నిధులు అగిపోయాయి. ఆ నిధులు గత నెలలో 2011-12కు సంబంధించిన 13వ అర్థిక సంఘం(టీఏఫ్‌సీ) రూ.11.78 కోట్లు విడుదల అయ్యాయి. ఇక నుంచి నిధులు విడుదల కావాలంటే పంచాయతీల పద్దుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, కావాల్సిన నిధులు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కాగా వీటిని ఆన్‌లైన్‌లో పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు కుస్తీ పడుతున్నారు.
పంచాయతీల్లో కంప్యూటర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లు వ్యవహరిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన వివరాలు నమోదు చేయని పంచాయతీలకు నిధులు నిలిచిపోయి అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే ఆ శాఖ అధికారులు కనెక్షన్లు తొలగిస్తే పంచాయతీ గ్రామాల్లో నీటి సరఫరా నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కారణాలు అనేకం..
జిల్లాలో 866 పంచాయతీలుండగా కేవలం 190 వరకే కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కార్యదర్శికి నాలుగు నుంచి ఐదారు పంచాయతీల అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నిధులు విడుదల, వినియోగం తదితర వాటిని ఆన్‌లైన్‌లో పెట్టెందుకు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. దీంతో వారికి సరైన అవగాహన లేక వివరాల నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీల్లో కంప్యూటర్లు లేక పోవడంతో వివరాలు నమోదు చేసేందుకు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ స్నేహితుల దగ్గర, సమీప బంధువుల ఇళ్లకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. అవగాహన రాహిత్యంతో పలువురు కార్యదర్శులు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌లో పొందుపరచకుండా మమ అంటున్నారు. దీనికి తోడు అప్పుడప్పుడు సాఫ్ట్‌వేర్ ఓపెన్ కాకపోవడం వంటి కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో పూర్తి స్థాయి వివరాలు ఆన్‌లైన్‌లో లభించడం లేదు. గడువు ముగిసి ఆరునెలలు గడుస్తున్నా ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పంచాయతీల వివరాలు ఆన్‌లైన్ చేయని వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం లేదు. అదే జరిగితే పంచాయతీల అభివృద్ధికి తీవ్ర అటంకం ఏర్పాడుతుంది.
650 నుంచి 670 వరకు ఆన్‌లైన్ చేశాం..
- పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 650 నుంచి 670 వరకు పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వివరాలను ఆన్‌లైన్లో పొందుపరిచాము. మిగతా పంచాయతీల వివరాలు ఆన్‌లైన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
అటకెక్కిన ‘ఆన్‌లైన్’ సేవలు
Published Mon, Nov 18 2013 6:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement