సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీహెచ్‌ఎం సీలో గ్రామ పంచాయతీల విలీనం వెనుక రహస్య ఎజెండా దాగిఉందని మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆగమేఘాల మీద రాత్రికిరాత్రే శివారు పంచాయతీలను గ్రేటర్ లో కలపడానికి బలమైన కారణాలున్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర విభజన తరుణంలో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేలా ఆదృశ్యశక్తులు పావులు కదిపాయన్నారు. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అధ్యక్షతన టీడీపీ అత్యవసర సమావేశం జరిగింది.దేవేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆదాయాన్ని ఉమ్మడిగా పంచుకునే కుట్రలో భాగంగానే నగర పరిధిని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
ఆదాయ వనరులు దండిగా ఉన్న పంచాయతీలను కలపడం ద్వారా ఆస్తులను పరిరక్షించుకోవడమే కాకుండా... రెవెన్యూలోను అధికవాటాను కొల్లగొట్టొచ్చని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేసినట్లు ఆరోపించారు. జిల్లా ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ప్రభుత్వం తీసుకున్న పంచాయతీల విలీనాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్‌లో అంతర్భాగమైన శివారు మున్సిపాలిటీల్లో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప.. కొత్తగా ఎలాంటి పనులు చేపట్టలేదని అన్నారు. గ్రేటర్‌తో గ్రామీణ ప్రజలకు పన్ను ల భారం తప్ప ఒరిగేదేమీలేదని పేర్కొన్నా రు. విలీనం సరికాదని, అవసరమైతే మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చాలని కోరినప్పటికీ సీఎం ఏకపక్షంగా విలీన ఉత్తర్వులు జారీ చేయడం దురదృష్టకర మన్నారు.
జిల్లా ఉనికిని కాపాడుకునేందు కు రాజకీయాలకతీతంగా జిల్లా నేతలు కలిసిరావాలని దేవేందర్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామని, 19న ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సహా పలువురు నేతలు నిరవధిక దీక్ష చేపట్టనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హెచ్ ఎండీఏ, ఏపీఐఐసీలు అడ్డగోలు వ్యవహారాలతో జిల్లా ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. సంపన్న వర్గాలకు కొమ్ముకాసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నా జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాల ను పరిగణనలోకి తీసుకోకుండా విలీన ప్రక్రి య చేపట్టిన అధికార పార్టీ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే రత్నం పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ , ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డితో పాటు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఇతర నేతలు పాల్గొన్నారు.
విలీనం వెనుక రహస్య ఎజెండా
Published Fri, Sep 13 2013 12:52 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement