పద్దుల నిర్వహణలో ప్రభుత్వ శాఖలు వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని కాగ్ (కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్) కడిగేసింది. ఆన్‌లైన్‌లో చూపే వివరాలు, సాధారణంగా నమోదుచేసే రికార్డుల్లో తేడాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వశాఖల్లో అవకతవకలను ఎండగట్టింది.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం కాగ్ 2013 మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేసిన ఆడిట్‌పై నివేదిక సమర్పించింది. ఇందులో జిల్లాలోని వివిధ శాఖల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ.. జరిగిన నష్టాన్ని నివేదించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ), మండల పరిషత్‌లు, విద్యాశాఖ, రిజిస్ట్రేషన్ శాఖల్లో జరిగిన అవకతవకలను ఉదాహరణలతో సహా వెల్లడించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పద్దుల నిర్వహణలో స్థానిక సంస్థల తీరు ఆందోళనకరంగా ఉన్నట్లు కాగ్ పేర్కొంది. హయత్‌నగర్ మండలంలో ప్రియాసాఫ్ట్ పనితీరును పరిశీలించిన కాగ్ అధికారులు.. ఆన్‌లైన్ పద్ధతిలో పేర్కొన్న వివరాలు, సాంప్రదాయ పద్ధతిలో నమోదు చేసిన వివరాల్లో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది. దీంతో నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు కాగ్ పేర్కొంది.
వ్యక్తిగత మరుగుదొడ్ల పథకంలో జిల్లాలో అక్రమాలు జరిగినట్లు కాగ్ పరిశీలనలో వెల్లడైంది. ఐహెచ్‌హెచ్‌ఎల్ పథకంపై క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు ఒకే కార్డుపై లెక్కకుమించి మరుగుదొడ్లు మంజూరు చేసినట్టు తేలింది. 69 కార్డులపై 510 మరుగుదొడ్లు మంజూరు చేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. ఇలా పలుప్రాంతాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అభిప్రాయపడింది.
జిల్లా నీటిసరఫరా, పారిశుద్ధ్య సమితి (డీడబ్ల్యూస్‌ఎమ్)కి సంబంధించి జిల్లాలో రూ.1.3 కోట్లు టర్మ్ డిపాజిట్‌లో పెట్టడాన్ని కాగ్ ఆక్షేపించింది. అదేవిధంగా డీడబ్ల్యూస్‌ఎమ్‌లో అడ్వాన్స్ రూపేనా ఇచ్చిన రూ.80లక్షలకు సంబంధించి లెక్కలు లేవని కాగ్ నివేదికలో తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో జిల్లా విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని కాగ్ పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో మంజూరైన మరుగుదొడ్లలో కనీసం 50శాతం కూడా నిర్మాణాలు పూర్తికాలేదని, నిర్మాణాలు పూర్తిచేసిన చోట నీటివసతి కల్పించకపోడంతో అవి నిరుపయోగంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తీరుపై కాగ్ తీవ్రంగా స్పందించింది. 2013 మార్చినెలలో రూ.50లక్షలకు సంబంధించి రికార్డులు లేవని కాగ్ అధికారులు గుర్తించారు. ఆడిట్‌లోనూ ఈ అంశం ప్రస్తావనలేదని కాగ్ తెలిపింది. డీఆర్‌డీఏ అధికారులు పలు బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహించడంతో నిధులపై స్పష్టత లోపించిందని, ఫలితంగా రూ.2.49 కోట్లకు సంబంధించి వివరాల్లో గందరగోళం నెలకొందని పేర్కొంది.
పౌరసరఫరాల శాఖలో డిమాండ్, వసూళ్లు, నిల్వ(డీసీబీ)రిజిస్టర్ నిర్వహణలో అయోమయం నెలకొం దని, కిరోసిన్‌కు సంబంధించి రూ.2.07 కోట్లకు లెక్కల నిర్వహణ సరిగాలేదని కాగ్ పేర్కొంది.
వ్యాట్‌కు గండి
బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లింపులో అవకతవకలు జరిగాయని, తక్కువ విలువ చూపడంతో పన్ను చెల్లింపు సైతం తక్కువగా జరిగిందని కాగ్ స్పష్టం చేసింది. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడిందని కాగ్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ఎస్‌ఆర్‌ఓలలో తనిఖీలు నిర్వహించి పైవాస్తవాలను గుర్తించారు.
అది నిర్లక్ష్యమే!
Published Fri, Nov 28 2014 11:52 PM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM
Advertisement
Advertisement