ఆగస్టు 10 నుంచి ఆన్‌లైన్‌లో రూ. 300 టికెట్లు
తిరుమల: శ్రీవారి దర్శనానికి రూ.300 టికెట్లను ఆగస్టు 10వ తేదీ నుంచి ఆన్‌లైన్, ఈ దర్శన్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం (భక్తుని ఫొటో, వేలిముద్ర సేకరణ)లో మంజూరు చేయించాలని టీటీడీ నిర్ణయించింది. జే ఈవో కేఎస్.శ్రీనివాసరాజు నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో రూ.300 టికెట్లలో మార్పులపైనే ప్రధానంగా చర్చ సాగింది. రోజుకు 18 వేల టికెట్లలో 14 రోజుల ముందు 10 వేలు, ఏడు రోజుల ముందు ఐదు వేలు, ఒక రోజు ముందు మూడు వేల టికెట్ల చొప్పున ఆన్‌లైన్‌లో కేటాయించాలని నిర్ణయించారు. అది అమలు చేసిన నాటి నుంచి తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఇవ్వకూడదని నిర్ణయించారు. కాగా, తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 19 కంపార్ట్‌మెంట్లలో నిండి ఉన్న భక్తులకు 15 గంటలు, కాలిబాట భక్తులకు 5 గంటల తర్వాత, రూ.300 టికెట్లు పొందిన భక్తులకు గంటన్నర సమయంలోపు శ్రీవారి దర్శనం లభించనుంది. గదులు, లాకర్లు సులభంగానే లభించాయి.