కుటుంబంలో ఒకరికే ఫీజు రియింబర్స్మెంట్ | only one from family of crda region in ap will get Fees Reimbursement | Sakshi
Sakshi News home page

కుటుంబంలో ఒకరికే ఫీజు రియింబర్స్మెంట్

Published Mon, May 16 2016 8:05 PM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

only one from family of crda region in ap will get Fees Reimbursement

-ల్యాండ్‌పూలింగ్‌కు భూములిచ్చిన రైతుల పిల్లలకు
-భూములు లేని నిరుపేదల కుటుంబాల నుంచి ఒకరికి ఉచిత విద్య
-ఉత్తర్వులు జారీచేసిన సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్


హైదరాబాద్ : ఏపీ నూతన రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు, అమరావతి ప్రాంతంలో ఉన్న భూములు లేని పేదల కుటుంబాల్లో ఒకరికి ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నట్టుగానే ల్యాండ్‌పూలింగ్‌కు భూములిచ్చిన రైతుల కుటుంబం నుంచి ఒకరికి అలాగే పేదల కుటుంబాల్లో ఒకరికి ఉచిత విద్యను అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌తో పాటు ఇంజనీరింగ్, యూనివర్శిటీ కళాశాలల్లో ఈ ఉచిత విద్య వర్తిస్తుందన్నారు. ఈ ఉచిత విద్యకు 2014 డిసెంబర్ 8 నాటికి అమరావతిలో నివాసం ఉన్న విద్యార్థులకే వర్తిస్తుందన్నారు. ఈ పథకం పదేళ్ల పాటు అమల్లో ఉంటుందని, గత ఏడాది అంటే 2015-16లో చదివిన విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తారన్నారు. ఈ పథకం అమలు బాధ్యత జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి చూస్తారన్నారు. ఇప్పటికే కళాశాలల జాబితా రాష్ట్ర ప్రభుత్వ డేటాబేస్‌లో ఉందన్నారు. అర్హులైన అభ్యర్థులు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు గానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు గానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికోసం ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన డాక్యుమెంట్లు, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్, అర్హత పరీక్ష పాసైన సర్టిఫికెట్, బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తదితరం సమర్పించాల్సి ఉంటుంది. అమరావతి ప్రాంత విద్యార్థులకు అందించే ఈ ఉచిత విద్యకు అయ్యే నిధులను సంబంధిత బీసీ సంక్షేమశాఖకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ చెల్లిస్తుందన్నారు. ఈ పథకం పర్యవేక్షణ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌లు వ్యవహరిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement